హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడ, పొప్పాల్‌గూడ, కోకాపేట్, నార్సింగి, గచ్చిబౌలి, లింగంపల్లి వంటి ప్రాంతాల్లో ఆకాశహర్మ్యాల నిర్మాణం జోరుగా జరుగుతోంది. దాదాపు ముప్పయ్ నుంచి నలభై నిర్మాణ సంస్థలు.. రెరా అనుమతి తీసుకుని బహుళ అంతస్తులు, ఆకాశహర్మ్యాల్ని నిర్మిస్తున్నాయి. ఇందులో కొన్ని ఆరంభ దశలో ఉంటే.. మరికొన్ని అడ్వాన్స్ స్టేజీలో ఉన్నాయి. ఆయా నిర్మాణ ప్రగతిని బట్టి.. అందులో ఫ్లాట్ల ధరలు చదరపు అడుక్కీ రూ.8 నుంచి 12 వేలు చొప్పున విక్రయిస్తున్నాయి. అయితే, ఆ సంస్థల అమ్మకాలన్నీ దెబ్బతీసేలా.. ఇటీవల ఒక సంస్థ హఠాత్తుగా తెరమీదికొచ్చింది. ప్రీలాంచ్ మాయకు శ్రీకారం చుట్టింది.
ల్యాంకో హిల్స్ ఎదురుగా గల మణికొండ గుట్ట పక్కనే 9.25 ఎకరాల్లో ఆరు టవర్లను నిర్మించడానికీ కంపెనీ ప్రణాళికల్ని రచించింది. జి ప్లస్ 43 అంతస్తుల ఎత్తులో మైవాన్ షట్టరింగ్ విధానంలో ఆకాశహర్మ్యాల్ని నిర్మించేందుకు డిజైన్ చేసింది. ఎంచక్కా నగరంలోనే పేరెన్నిక గల ఆర్కిటెక్చర్ కంపెనీ వద్ద ప్లాన్లను గీసింది. ఇంతవరకూ బాగానే ఉంది. కాకపోతే, ఆ ప్లాన్లను చూపెట్టి.. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరిట.. ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను అమ్మడం ఆరంభించింది. జీహెచ్ఎంసీ అనుమతి లేదు.. రెరా పర్మిషన్ తీసుకోలేదు.. అయినా 43 అంతస్తుల అపార్టుమెంట్‌ను కడతానని చెబూతూ.. వంద శాతం సొమ్ము కట్టేవారికి చదరపు అడుక్కీ రూ.6200కే ఫ్లాట్లను విక్రయిస్తోంది. తొలుత ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఒక్కో కస్టమర్ నుంచి రూ.10 లక్షలను వసూలు చేస్తోంది.
రెరా అనుమతి లేకుండా ఇలా కొనుగోలుదారుల నుంచి సొమ్ము వసూలు చేయడం నిషిద్ధమని టీమ్-4 బృందానికి తెలియదా? తెలిసినా తమల్ని ఎవరేం చేయలేదనే ధీమానా? జీహెచ్ఎంసీ, రెరా జాన్తా నహీ అంటున్నారా? సమాజంలో పేరున్న నలుగురు వ్యక్తులు కలిసి ఒక బడా ప్రాజెక్టును చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు.. ఇంత చీప్‌గా వ్యవహరించాల్సిన అవసరమేంటి? హైదరాబాద్‌లోనే స్ట్రాటజిక్ లొకేషన్‌లో అంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీ నిర్మించేవారి ఆలోచనలూ ఎంతో ఉన్నతంగా ఉండాలి. అప్పుడే, ఆయా ఆకాశహర్మ్యాన్ని పూర్తి చేయగలరు. అలా కాకుండా, రెరా అనుమతి లేకుండానే కేవలం రూ.10 లక్షలను ఒక్కొక్క కస్టమర్ వద్ద తీసుకుంటే.. మార్కెట్లో ఎంత చీప్ అవుతారో ఒక్కసారైనా ఆలోచించారా?
టీమ్-4లో గల నలుగురు సభ్యులెవరనే విషయాన్ని రెజ్ న్యూస్ ఆరా తీసింది. ఇందులో ప్రాస్పరా గ్రూప్, గుంటూరుకు చెందిన జ్యోతిర్మయి ప్రాపర్టీస్, లాన్సమ్ ఎటానియా గ్రూపునకు చెందిన రాజేష్ ప్రసాద్, యూలా కన్‌స్ట్రక్షన్స్ కొండయ్య వంటివారున్నారని తెలిసింది. వారి వెబ్‌సైట్లలో చూస్తే.. ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. అవేమిటంటే..
ఇందులో ప్రాస్పరా గ్రూప్ అల్కాపురి టౌన్‌షిప్‌లో ద డ్రిజిల్ అనే ప్రాజెక్టును ఆరంభించింది. మూడు ఎకరాల్లో ఆరు టవర్లను నిర్మిస్తోంది. అంటే, ఇది నిర్మాణ దశలోనే ఉంది. కొనుగోలుదారులకు ఇంకా అందజేయలేదని అర్థం. అదిరిపోయే గ్రాఫిక్స్ తో ఐటీ నిపుణులు, ప్రవాసుల మతి పోగొడుతున్న ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది? అందులో కొనుగోలుదారులు ఎంతమేరకు సంతృప్తి ఉన్నారో తెలిసేందుకు కొంత సమయం పడుతుంది.
గుంటూరుకి చెందిన జ్యతిర్మయి ప్రాపర్టీస్ మురళీకృష్ణా అనే వ్యక్తి ఇందులో భాగస్వామిగా ఉన్నాడు. ఈ సంస్థ సైటులోకి వెళితే.. ఈ సంస్థ అమరావతిలో ఆరంభించిన పామ్ స్ప్రింగ్స్ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. ఈ కంపెనీ ఐదు అంతస్తుల్లోపు మూడు నిర్మాణాలు చేపట్టినట్లు సైటులో కనిపిస్తోంది. లాన్సమ్ ఎటానియా గ్రూపునకు చెందిన రాజేష్ ప్రసాద్.. మాతృసంస్థలో నుంచి బయటికొచ్చి టీమ్ 4 లైఫ్ స్పేసెస్ బృందంలో సభ్యుడయ్యాడు. ఎటానియా అనే స్కై స్క్రేపర్ పూర్తి చేసిన సంస్థలో ఒక సభ్యుడు. ఇతను మినహా మిగతా ఎవ్వరికీ కనీసం ఒక్క స్కై స్క్రేపర్ ను విజయవంతంగా పూర్తి చేసిన అనుభవం లేకపోవడం గమనార్హం.
యూలా కన్‌స్ట్రక్షన్స్ కొండయ్య ఇంతవరకూ నిర్మించిన అపార్టుమెంట్లే మూడు. అవి కూడా ఐదు అంతస్తుల్లోపువే. అందులో ఆకాశహర్మ్యం ఒక్కటి కూడా లేదు. ఇప్పటికైనా టీమ్-4 బృందం మణికొండలో ఈ ప్రీలాంచ్ మాయను పక్కన పెట్టేసి.. ఎంచక్కా రెరా అనుమతి తీసుకుని.. ప్రాజెక్టులో అమ్మకాలు ఆరంభిస్తే.. అధిక ధర పలికే అవకాశముంది.