- ఐదు అంతస్తుల్లో పార్కింగు కట్టొచ్చు..
- ఆ ఎత్తును భవనం హైటుగా పరిగణించరు
- జీవో నెం.103 విడుదల చేసిన అరవింద్ కుమార్
- స్వాగతించిన క్రెడాయ్ హైదరాబాద్, నరెడ్కో తెలంగాణ
నివాస, వాణిజ్య భవనాల్లో పోడియం పార్కింగుకు ( Podium Floors for Parking ) అనుమతినిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ శనివారం 103 జీవోను విడుదల చేశారు.
సుమారు ఐదు అంతస్తుల ఎత్తు (15 మీటర్ల వరకూ) నిర్మాణ సంస్థల ఇక నుంచి పార్కింగ్ కోసం నిర్మించవచ్చు. ఆయా అపార్టుమెంట్ ఎత్తులో ఈ ఐదు అంతస్తుల ఎత్తును పరిగణనలోకి తీసుకోరు. కొత్త జీవో ప్రకారం.. నివాస భవనాలకు రెండు సెల్లార్లు వరకూ, వాణిజ్య నిర్మాణాలకైతే మూడు సెల్లార్లను మాత్రమే కట్టుకోవడానికి అనుమతినిస్తారు. పైగా, పోడియం చుట్టూ గ్రీనరిని అభివృద్ధి చేసే వీలుంటుంది. ఒకవేళ నిర్మాణ స్థలం పది ఎకరాల కంటే అధిక విస్తీర్ణంలో ఉంటే, ఒక్క పోడియం బదులు రెండింటిని అనుమతినిస్తారు. 55 మీటర్ల ఎత్తు దాక కట్టే నిర్మాణాలైతే.. పొడియం చుట్టూ ఏడు మీటర్లు, మలుపుల వద్ద 12 మీటర్ల సెట్ బ్యాక్ వదలాలి.
అగ్నిమాపక యంత్రాలు తిరిగేందుకు వీలుండాలి. పది వేల చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో కట్టే నిర్మాణాలైతే, కనీసం సగం భవనం అగ్నిమాపక యంత్రం వెళ్లేందుకు వీలుండాలి. పోడియంలను విజిటర్ల కోసం వాడుకోవచ్చు. డ్రైవర్లకు వెయిటింగ్ రూము, టాయిలెట్లను కట్టొచ్చు. ఇలాంటి వాటి కోసం ఐదు అంతస్తుల్లోని ప్రతి ఫ్లోరులో సుమారు 2 నుంచి పదిశాతం స్థలాన్ని వినియోగించుకోవచ్చు. ఎవరైనా నిబంధనల్ని ఉల్లంఘించి పోడియం కడితే.. అదనంగా కట్టిన స్థలాన్ని ప్రభుత్వం లేదా స్థానిక సంస్థకు బదిలీ చేస్తారు. నిర్మాణ సంస్థలు ఎదుర్కొంటున్న ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి పలుసార్లు తీసుకొచ్చామని క్రెడాయ్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
బిల్డర్లకు ఇబ్బందులుండవ్..
తాజా నిబంధన అమల్లోకి రావడంతో నిర్మాణ సంస్థలకు పెద్ద భారం తప్పింది. ఇక నుంచి సెల్లార్ల కోసం కోట్ల రూపాయల్ని ఖర్చు పెట్టక్కర్లేదు. బండరాళ్లను బ్లాస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల కాలంలో కోకాపేట్లో మైహోమ్ సంస్థ బండరాళ్లను పేల్చివేయగా.. పక్కనే ఉన్న రాజపుష్ప ఏట్రియా ప్రాజెక్టు సెల్లార్లు దెబ్బతిన్నాయి. ఇక నుంచి ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశమే ఉండదు.