తెలంగాణ రెరా ఛైర్మన్
డా. ఎన్ సత్యనారాయణ
ప్రత్యేక ఇంటర్వ్యూ..
రియల్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని.. సోషల్ మీడియాలో ఇక నుంచి ప్రీలాంచ్ ప్రకటనల్ని విడుదల చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలంగాణ రెరా అథారిటీ ఛైర్మన్ డా.ఎన్ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ.. తక్కువ రేటుకు వస్తుందని హోమ్ బయ్యర్లు.. రెరా అనుమతి లేని ప్రాజెక్టుల్లో ఫ్లాట్లను కొనకూడదని విన్నవించారు. వెంచర్ ప్రమోటర్లు, డెవలపర్లు ఇక నుంచి రెరా పర్మిషన్ లేకుండా.. ప్రీలాంచ్‌లో ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయిస్తే.. చట్టప్రకారం కఠిన చర్యల్ని తీసుకుంటామని హెచ్చరించారు. ఒకసారి చెప్పినా వినిపించుకోకపోతే, జైలుశిక్షను విధించడానికైనా వెనకాడమని స్పష్టం చేశారు. ఆయన రియల్ ఎస్టేట్ గురుకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం..
రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్ యాక్ట్ 2016 ప్రధాన లక్ష్యాలేమిటంటే.. రియల్ ఎస్టేట్ పరిశ్రమను రెగ్యులేట్ చేయడంతో పాటు ప్రమోట్ చేయడంతో పాటు ప్లాట్లు లేదా ఫ్లాట్లను పారదర్శకంగా విక్రయించాలి. మూడోది ఇళ్ల కొనుగోలుదారులను పరిరక్షించాలి. పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో.. 500 చదరపు మీటర్లపైబడిన విస్తీర్ణంలో అభివృద్ధి చేసే లేఅవుట్లు, ఫ్లాట్లకు రెరా అనుమతిని తప్పకుండా తీసుకోవాలి. ఆతర్వాతే వాటిని విక్రయించాలి.
రెరా ఏర్పాటైన వెంటనే మంత్రి కేటీఆర్ చెప్పిందేమిటంటే.. తెలంగాణ రాష్ట్రమెంతో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందుతోంది. కొత్తగా తెలంగాణ మున్సిపల్ 2019 చట్టం తెచ్చాం. అది మున్సిపాల్టీలు, కార్పొరేషన్లుకు సంబంధించిన ఏకీకృత చట్టం. ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాల్ని తీసుకునేలా ఆ చట్టం సూచిస్తోంది. అందులో భాగంగానే టీఎస్ బీపాస్ ని ప్రవేశపెట్టి 500 చదరపు మీటర్లలోపు గల ఇళ్లకు ఇన్‌స్టంట్ అనుమతిని మంజూరు చేస్తున్నాం. అపార్టుమెంట్లకు సింగిల్ విండోలో భాగంగా డీమ్డ్ అనుమతినిస్తున్నాం. ఈ క్రమంలో కొనుగోలుదారులకు, బిల్డర్లకు యూజర్ ఫ్రెండ్లీ విధానాల్ని ప్రవేశపెట్టాలని మంత్రి కేటీఆర్ పలుసార్లు చెప్పారు. మిగతా మెట్రో నగరాల్లో పాటించే ఉత్తమ విధానాల్ని అధ్యయనం చేయమన్నారు. అందులో భాగంగానే ఆరు మెట్రో నగరాల్లో పర్యటించి ఉత్తమ విధానాల్ని తెలుసుకున్నాం. నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తాం. రెరాకు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రణాళికాబద్ధంగా చేపడతాం. అటు కొనుగోలుదారులతో పాటు ఇటు ప్రమోటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రెరా కార్యకలాపాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నాం.
రెరా చట్టం అమల్లోకి వచ్చాక ప్రీలాంచ్ ఆఫర్లపై పూర్తిగా నిషేధముంది. ప్రాజెక్టు ఆరంభించే ప్రతిఒక్క ప్రమోటర్.. స్థానిక సంస్థలతో పాటు రెరా అనుమతి తీసుకోవాలి. ఈ రెండూ లేక ప్రాజెక్టును ఆరంభించడమంటే చట్టవిరుద్ధమే. పైగా అది నేరం కూడా. రెరాను పాటించకుండా ప్రాజెక్టుల్ని ప్రారంభించేవారి మీద కఠిన చర్యల్ని తీసుకుంటాం.
ప్లాటు మరియు ఫ్లాటు కొనుగోలుదారులకు నా విన్నపం ఏమిటంటే.. జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్ముతో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి వారు రేటు తక్కువకు వస్తుందనో.. మరే ఇతర కారణాల వలనో.. ప్రీలాంచులు, యూడీఎస్, ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరిట ఎవరు అమ్మడానికి ప్రయత్నించినా దయచేసి వాటిలో కొనకండి. ఆ తర్వాత ఇబ్బంది పడకండి. కచ్చితంగా రెరా అనుమతి ఉన్నవాటినే కొనాలి. రెరాకు విరుద్ధంగా వ్యవహరించే ప్రమోటర్ల వివరాల్ని సేకరించేందుకు ప్రత్యేకంగా ఒక టీమును ఏర్పాటు చేసి వారి మీద చట్టరీత్యా కఠిన చర్యల్ని తీసుకుంటాం.
మంచి పాయింట్ రైజ్ చేశారు. ఈ అంశాన్ని నేను వేరే స్టేట్స్‌లో కూడా స్టడీ చేశాను. కచ్చితంగా ప్రతి మూడు నెలలకోసారి బిల్డర్లు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాలి. ఇందులో ఎవరైనా తప్పుడు సమాచారమిచ్చినా చట్టప్రకారం చర్యల్ని తీసుకుంటాం. ఐదు శాతం జరిమానా విధించడానికి ఆస్కారముంది. కాబట్టి, ప్రతిఒక్కరూ ప్రాజెక్టు ప్రగతిని గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి.
ప్రాజెక్టును పూర్తి చేయడానికి బిల్డర్లు తీసుకున్న నిర్థారిత గడువు ప్రకారం నిర్మాణ పనుల్ని చేపట్టాలి. సమయానికి అనుగుణంగా నిర్మాణాల్ని చేపడుతున్నారని తెలియడానికి మూడు నెలలకోసారి నివేదిక తప్పకుండా పొందుపర్చాలి. అలా కాకుండా, ఒక్కసారే పూర్తి చేయడానికి ఏ బిల్డర్‌కు వీలు కాదు. అతను గనక నిర్ణీత గడువులోపు ప్రాజెక్టు పనుల్ని చేయకపోతే కొనుగోలుదారులు రెరాకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఎట్టి పరిస్థితి బిల్డర్లు ఈ నివేదికను పొందుపర్చాలి. ఇందుకు సంబంధించిన మెకానిజం కూడా ప్లాన్ చేస్తున్నాం. బయ్యర్లకు రెండు ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఇచ్చేలా ప్రణాళికల్ని రచిస్తున్నాం. దాదాపు నెలరోజుల్లోపు ఈ ప్రొవిజన్‌ను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నాం. డెవలపర్ నివేదికను పొందుపర్చగానే అందులో ఫ్లాట్లు కొన్నవారికి ఎస్ఎంఎస్ అలర్ట్ ఇచ్చేలా ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తాం. మొత్తానికి ఎవరూ ఇబ్బంది పడకుండా తగు చర్యల్ని తీసుకుంటాం.
రియల్ రంగం ఇతర రంగాలకంటే ఎంతో భిన్నమైంది. ఇందులో సొసైటీ, ఎకానమి, ఎన్విరాన్‌మెంట్‌తో ముడిపడి ఉన్న పరిశ్రమ. ఈ రంగం మెరుగ్గా ఉంటే ఎకానమీ గ్రోత్ అయ్యేందుకు ఆస్కారముంది. ఎందుకంటే, దేశీయ జీడీపీలో రియల్ రంగం వాటా దాదాపు తొమ్మిది శాతమని గుర్తుంచుకోవాలి. వ్యవసాయం తర్వాత అధిక శాతం మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని కల్పిస్తుంది. బిల్ట్ ఎన్విరాన్‌మెంట్‌ను ప్రొవైడ్ చేసేదిదే. ఇందులో హౌసింగ్ వివిధ వర్గాల వారికిస్తాం. అదొక్కటే కాదు.. ప్రజలు సౌకర్యవంతంగా జీవించడానికి అవసరమయ్యే రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సరఫరా, వీధి దీపాలు, ఘనవ్యర్థాల నిర్వహణ, హరితాభివృద్ధి వంటి మౌలిక సదుపాయాలు వస్తాయి. దీంతో పాటు సామాజిక మౌలిక అభివృద్ధిలో భాగంగా.. స్కూళ్లు, కాలేజీలు, ఆస్పత్రులు, అమ్యూజ్‌మెంట్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ వంటివి అభివృద్ధి చెందుతాయి.
ఇక వాణిజ్య రియల్ రంగం విషయానికొస్తే.. షాపింగ్ మాళ్లు, మల్టీప్లెక్సులు, గోడౌన్లు, వర్కింగ్ స్పేసెస్ వంటివి రియల్ ఎస్టేట్ పరిధిలోకి వస్తాయి. ఇలా, అనేక రంగాలతో నిర్మాణ రంగం ముడిపడి ఉంది. అందుకే, నేను సిన్సియర్‌గా కోరేదేమిటంటే.. బిల్డర్లు చట్టాన్ని అతిక్రమించకూడదు. ప్రీలాంచ్, యూడీఎస్ సేల్స్ చేయకండి. బిల్డర్లు చట్టాన్ని అతిక్రమించకూడదు. ప్రీలాంచ్, యూడీఎస్ సేల్స్ చేయకండి. బయ్యర్లు కూడా గుర్తించాల్సింది ఏమిటంటే.. తక్కువకు వస్తుందని వెనకా ముందు చూడకుండా కొనకూడదు. ప్రీలాంచ్‌లో అమ్మేవారిపై కూడా చట్టపరమైన చర్యల్ని తీసుకుంటాం.
రెరా అనుమతి లేని వాటిలో కొనకూడదని ఇంటి కొనుగోలుదారులకు సవినయంగా కోరుకుంటున్నాను.
కచ్చితంగా తీసుకుంటాం. ఇందుకోసం ప్రత్యేకంగా ఐటీ వింగ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. సోషల్ మీడియాలో యూడీఎస్, ప్రీలాంచులకు సంబంధించిన ప్రకటనల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తాం. ఈ రోజు ఉదయమే జయా గ్రూప్ వద్ద ఇళ్లు కొన్న కొందరు ప్రభుత్వ ఉద్యోగులు వచ్చారు. జీవితాంతం కష్టడి సంపాదించిన సొమ్ముతో పాటు బ్యాంకు లోన్ తీసుకుని కొని ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. ఇలాంటి అంశాలపై మేం ఎప్పటికప్పుడు ఫోకస్ చేస్తున్నాం. మీరు అలాంటి బాధితుల జాబితాలో చేరకూడదంటే.. ప్రీలాంచుల్లో కొనకూడదు.
ఇలా చేసేవారు వంద శాతం శిక్షార్హులే. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరిట చెక్కులు తీసుకోవడమనేది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. కాబట్టి, బిల్డర్లు ఒకసారి సెక్షన్ 3 ని చూడండి. రెరా అనుమతి తీసుకున్నాకే చెక్కులు తీసుకోండి. లేకపోతే చట్టపరంగా శిక్షను విధిస్తాం.
రెరా చట్టం ప్రకారం.. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మా వద్ద నమోదు చేసుకోవాలి. ఇందుకోసం రూ.10వేలు ఫీజు చెల్లించాలి. ఐదేళ్ల దాకా రియల్ వ్యాపారం చేసుకోవచ్చు. రెరా అనుమతి లేకుండా ఏజెంట్లు ప్లాట్లు కానీ ఫ్లాట్లు కానీ అమ్మడానికి వీల్లేదు. వారి మీద మాకు ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. ఆయా ఏజెంట్లకు నోటీసులిస్తాం. ప్లాటు లేదా ఫ్లాటు విలువలో ఐదు శాతం జరిమానాను విధిస్తాం. అంతేకాకుండా, వారి మీద చట్టప్రకారం చర్యల్ని తీసుకుంటాం. కాబట్టి, ఏజెంట్లు రెరా పర్మిషన్ తీసుకోవాలి. రెరా ఆమోదిత వెంచర్లను మాత్రమే విక్రయించాలి.
ఈ విషయాన్ని కూడా మేం సీరియస్‌గా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం. మా అనుమతి లేకుండా ఎవరైనా ఎక్కడ అడ్వర్టయిజ్‌మెంట్లు చేసినా కచ్చితంగా యాక్షన్ ఉంటుంది. సోషల్ మీడియా మీద ఫోకస్ చేస్తున్నాం. చట్టం ఉన్నప్పుడు దాన్ని గౌరవించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతిఒక్కరి మీద ఉంటుంది. రెరా అనుమతి లేని ప్రాజెక్టును ప్రజలకు చూపించడమనేది కరెక్టు కాదు. ఇలా చేసేవారు తాము పాడవ్వమే కాకుండా.. ప్రజల్ని పాడు చేయాలని చూడటం కరెక్టు కాదు. ఎవరైతే ఇలాంటి ప్రకటనల్ని గుప్పిస్తున్నారో వారి మీద బరాబర్ యాక్షన్ తీసుకుంటాం. ప్రాజెక్టు విలువలో పది శాతం జరిమానా విధిస్తాం. అయినా వినకపోతే మూడేళ్ల జైలుశిక్ష కూడా విధిస్తాం. కొన్ని సందర్భాల్లో రెండూ విధిస్తామని గుర్తుంచుకోండి.
ప్రతిఒక్కరికీ నా విన్నపం ఏమిటంటే.. మీరు ఏ ప్రకటన విడుదల చేసినా రెరా నెంబరును కచ్చితంగా ప్రచురించాల్సిందే. లేకపోతే సెక్షన్ 3 ప్రకారం పీనలైజేషన్ చేస్తాం. ఈ సందర్భంగా కొన్ని మా దృష్టికొచ్చిన విషయాల్ని చెబుతాను. కొందరు రెరా నెంబరు తీసుకోకున్నా.. తప్పుడు రెరా నెంబర్లను పెట్టి ప్రకటనల్ని గుప్పిస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలో హైదరాబాద్‌తో పాటు జిల్లాల వారీగా కూడా సమాచారాన్ని సేకరిస్తున్నాం.
కొనేవారు గుంటల్లో కొంటున్నారంటే వ్యవసాయ భూమి అని అర్థం. వ్యవసాయం చేయడానికైతే ఎంచక్కా కొనుక్కోవచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు. దానికి రెరాతో ఎలాంటి సంబంధం లేదు. అలా కాకుండా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తే రెరా అనుమతి తప్పనిసరి. అంటే, ప్లాట్లు వేయాలన్నా.. బిల్డింగు కట్టాలన్నా.. వాణిజ్య భవనం నిర్మించాలన్నా.. సోషల్ ఇన్‌ఫ్రాను అభివృద్ధి చేయాలన్నా.. ఫ్యాక్టరీ వంటివి ఏర్పాటు చేయాలన్నా రెరా అనుమతి తప్పనిసరి. అమ్మడానికి కాకుండా సొంతంగా కట్టుకోవాలని అనుకున్నా స్థానిక సంస్థల అనుమతి అయితే తప్పకుండా తీసుకోవాలి. అగ్రికల్చర్ నుంచి కన్వర్ట్ చేయాలంటే నాన్ అగ్రికల్చర్ చేయించి అనుమతి తప్పనిసరి. కొందరు వ్యవసాయ భూముల్లో వెంచర్లు వేస్తున్నారని ఇదివరకే ప్రభుత్వం దృష్టికొచ్చింది. అందుకే, 20 గుంటల కంటే తక్కువ భూమిని రిజిస్టర్ చేయకూడదనే స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇదివరకే సర్కులర్ ఇచ్చారు. ధరణి ప్రకారం ఎంతయినా రిజిస్టర్ చేసుకోవచ్చు. కాకపోతే, ఇలాంటి మోసపూరిత విధానాల గురించి మీకు తెలిస్తే స్థానిక సంస్థలకు ఫిర్యాదు చేయండి. ఇలా పేరు మార్చి లేఅవుట్లు చేసి అమ్మడం తప్పు. ఇలాంటి వాటిలో కొంటే మీ డబ్బుకు భద్రత ఉండదు. ఎక్కడెళ్లినా మీకు న్యాయం జరగదు. రెరా అనుమతి లేకుండా ఇలాంటి వెంచర్లు వేస్తే చట్టప్రకారం ప్రాజెక్టు విలువలో పది శాతం జరిమానా విధాస్తాం.
సాధారణంగా బ్యాంకులో ఇన్వెస్ట్ చేయడం కంటే కమర్షియల్ ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేస్తే అధిక రిటర్న్స్ వస్తుందనుకుని చాలామంది వీటిలో పెట్టుబడి పెట్టడానికి ఆలోచిస్తుంటారు. రిటర్న్స్ ఎక్కువ వస్తాయని చెప్పేవాళ్లు మస్తు చెబుతారు. అమ్ముకోవాలి కాబట్టి ఎన్నయినా చెబుతారు. ఎకానమీలో సహజసిద్ధంగా అభివృద్ధి రావాలి తప్ప.. వాళ్లు చెప్పినంత మాత్రాన రిటర్న్స్ వస్తుందని గ్యారెంటీగా చెప్పలేం. రెరా వచ్చాక రిజిస్ట్రేషన్ లేకుండా అమ్మడానికి వీల్లేదు. బిల్డర్లకు విన్నపం ఏమిటంటే.. ఇలాంటి తప్పుడు విధానాల్ని అవలంబించకండి. మీరు చట్టానికి సెల్యూట్ చేస్తే అందరూ మీకు సెల్యూట్ చేస్తారు. పొల్యూట్ చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం.. రెరాతో పాటు ఇతర ఏజెన్సీలూ రంగంలోకి దిగుతాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
రెరా అనుమతిని మంజూరు చేయడానికి నెల రోజులు పడుతోంది. ఇంతకంటే ఇంకా త్వరగా అనుమతినిచ్చేందుకు ప్రయత్నిస్తాం. సాధ్యమైనంత వరకూ వారం, పది రోజుల్లోనే రెరా అనుమతిని మంజూరు చేయడంపై దృష్టి సారిస్తున్నాం. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే అక్కడే అనుమతి లభిస్తుంది. క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం.
కొత్తదనాన్ని అన్వేషిస్తూ.. ప్రణాళికాబద్ధంగా, పారదర్శకంగా అడుగులు ముందుకేయాలని.. జవాబుదారీతనంతో వ్యవహరించాలని.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ చెబుతుంటారు. ఇతర రంగాల్లో ఎంత మెరుగైన పనితీరును కనబరుస్తున్నామో.. అంతకు మించిన ఫలితాలు వచ్చేలా రియల్ రంగం అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి కేటీఆర్ సూచిస్తుంటారు. ఈ రంగంలో సెన్సిటీవిటీ ఉంటుంది కాబట్టి ఆరోగ్యకరమైన వాతావరణంలో అభివృద్ధి చెందాలని అంటుంటారు. వారి సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో రెరాను మరింత బలోపేతం చేస్తూ.. నిర్మాణాత్మక పద్ధతిలో పని చేయడానికి సంసిద్ధులయ్యాం.
This website uses cookies.