Categories: LEGAL

ఓసీ ఆలస్యం నష్టాన్ని బిల్డరే భరించాలి

  • కొనుగోలుదారులు అదనంగా చెల్లించిన
  • మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలి
  • సుప్రీంకోర్టు స్పష్టీకరణ

ఆక్యుపేషన్ సర్టిఫికెట్ (ఓసీ) అంశంలో గృహ కొనుగోలుదారులకు సుప్రీంకోర్టు ఊరట కలిగించే తీర్పు వెలువరించింది. ఓసీ సహా ఇతర అనుమతులు తీసుకోకుండా బలవంతంగా ఫ్లాట్ అప్పగించడం వల్ల కలిగిన నష్టాలను బిల్డర్లే చెల్లించాలని స్పష్టం చేసింది. ఓసీ తీసుకోకుండానే ఫ్లాట్ అప్పగిస్తే.. కొనుగోలుదారులు పరిహారం పొందే హక్కు ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఓసీ లేని కారణంగా కొనుగోలుదారులు అధికంగా చెల్లించిన పన్నులు, నీటి చార్జీలను బిల్డర్ నుంచి పొందొచ్చని పేర్కొంది. ఈ మేరకు జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ బిల్డర్ కు అనుకూలంగా ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ముంబైకి చెందిన సమృద్ధి కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్.. వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ ప్రాజెక్టులో ఫ్లాట్లు కొన్నవారు గత 25 ఏళ్లుగా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండా నివసిస్తున్నారని.. ఫలితంగా 25 శాతం ఎక్కువగా ఆస్తిపన్ను, 50 శాతం అధికంగా నీటి చార్జీలు చెల్లిస్తున్నారని సొసైటీ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. అయితే, 1997లో వారు ఫ్లాట్ ఆధీనంలోకి తీసుకున్నప్పుడు చేయాల్సిన ఫిర్యాదు అని.. కానీ వారు 18 ఏళ్ల తర్వాత ఫిర్యాదు చేసినందున దీనికి విచారణ అర్హత లేదని బిల్డర్ వాదించాడు. అయితే, ధర్మాసనం ఆ వాదనలను తోసిపుచ్చింది.

This website uses cookies.