Categories: LEGAL

రెరా ఎందుకు పని చేయట్లేదు?

  • రెరాకు హైకోర్టు నోటీసులు
  • తెలంగాణలో పని చేయని రెరా
  • రెరా వచ్చినా ప్రయోజనం లేదు
  • యూడీఎస్, ప్రీలాంచుల్ని అడ్డుకోలేని రెరా

స్థిరాస్తి కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడాల్సిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథార్టీ చట్ట ప్రకారం పని చేయడం లేదంటూ గౌహతి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం అస్సాం రెరా చైర్ పర్సన్ కు నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేసింది.

రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్, డెవలప్ మెంట్) చట్టం, 2016 కింద ఏర్పాటైన ఏ-రెరా చట్టప్రకారం పని చేయడం లేదని ఈ వ్యాజ్యంలో లేవనెత్తినట్టు హైకోర్టు పేర్కొంది. కనీసం ఏ-రెరాకు వెబ్ సైట్ కూడా లేదని, చట్టప్రకారం కచ్చితంగా ఏ-రెరాకు వెబ్ సైట్ ఉండాలని చట్టంలో ఉన్నట్లు పిటిషనర్ తమ దృష్టికి తెచ్చినట్టు పేర్కొంది. నిబంధనల ప్రకారం ఏయే ప్రాజెక్టులకు అనుమతులు ఉన్నాయనే అంశాన్ని ప్రజలకు తెలిసేలా వెబ్ సైట్ లో నమోదు చేసి, ఎప్పటికప్పుడు వివరాలు అప్ డేట్ చేస్తుండాలి. అలాగే ప్రమోటర్లు, ప్రాజెక్టు వివరాలు, డీఫాల్టర్లు తదితర అన్ని వివరాలనూ సదరు వెబ్ సైట్ లో పొందుపరచాలి. అయితే, ఏ-రెరాకు కనీసం వెబ్ సైట్ కూడా లేకపోవడంతో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

అస్సాంలో పరిస్థితి అలాగుంటే తెలంగాణలో ఇందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ అథారిటీ ఏర్పాటైనా గత కొంతకాలం నుంచి సరిగ్గా పని చేయట్లేదని ఇంటి కొనుగోలుదారులు ఫిర్యాదు చేస్తున్నారు. అసలు తెలంగాణలో రెరా ఎందుకు ఏర్పాటు చేశారో తెలియడం లేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోవడం లేదని, ఇలాంటి రెరా ఉన్నా ఒక్కటే.. లేకపోయినా ఒకటే..అంటూ ప్రజలు చీత్కరిస్తున్నారు. డెవలపర్ల మీద ఫిర్యాదు చేస్తున్నా సమస్యను పరిష్కరించడం లేదని వీరంతా వాపోతున్నారు.

This website uses cookies.