poulomi avante poulomi avante

రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి టెండర్లు పిలిచిన కేంద్రం..

తెలంగాణకు మణిహారం కాబోతున్న హైదరాబాద్ రీజినల్‌ రింగ్‌ రోడ్డు ఉత్తర భాగం ప్రాజెక్టుకు సంబందించి కీలక ముందడుగు పడింది. మొత్తం ఐదు ప్యాకేజీల్లో ట్రిపుల్ ఆర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్ఆర్ఆర్ ఉత్తరభాగం నిర్మాణపనులకు సంబందించి టెండర్లను ఆహ్వానించింది కేంద్రం. గ్రీన్‌ఫీల్డ్‌ రీజినల్‌ ఎక్స్‌ప్రెస్‌వేగా వ్యవహరించే ఈ ప్రాజెక్టును నాలుగు వరుసలుగా నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా నిర్మించనుంది. సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్‌ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోని తంగడ్‌పల్లి వరకు మొత్తం 161.518 కిలో మీటర్ల మేర ఐదు ప్యాకేజీల్లో పనులు చేపట్టనున్నారు. ఉత్తర భాగం మొత్తం వ్యయం అంచనాను 7,104.06 కోట్లుగా నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం.

రీజినల్ రింగ్ రోడ్డుకు సంబందించి గత డిసెంబర్ 27న టెండర్లను అహ్వానించగా.. 2025 ఫిబ్రవరి 14వ తేదీ వరకు బిడ్‌లను దాఖలు చేయవచ్చు. ఫిబ్రవరి 17వ తేదీన బిడ్లను తెరవనున్నారు. ఎన్‌హెచ్‌ఏఐకు సంబంధించిన వెబ్‌సైట్‌లో టెండరు దరఖాస్తులు అందుబాటులో ఉండనున్నాయి. ట్రిపుల్ ఆర్ టెండర్లు పొందిన సంస్థలు ఈ మొత్తం పనులను రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ పనులను ఈపీసీ (ఇంజినీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కన్‌స్ట్రక్షన్‌) పద్ధతిలో చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం నిర్మాణంలో ఇంజినీరింగ్‌ పనులు, సామగ్రి సేకరణ, వ్యయం, నిర్మాణం అన్నీ కాంట్రాక్ట్ సంస్థే చూసుకోవాల్సి ఉంటుంది. నిర్మాణానికి వెచ్చించిన నిధులు 17 ఏళ్లలోనే టోల్‌ వసూలు రూపంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. ట్రిపుల్ ఆర్ ఉత్తరభాగం నిర్మాణానికి మొత్తం 1,940 హెక్టార్ల భూమి అవసరం కాగా.. ఇప్పటికే 94 శాతం భూసేకరణ పూర్తయినట్లు అదికారులు చెప్పారు. గంటకు 120 కి.మీ. వేగంతో వాహనాలు ప్రయాణించేలా ఆర్ఆర్ఆర్ రోడ్డును నిర్మించనున్నారు. మొత్తం రోడ్డు విస్తీర్ణంలో 11 ఇంటర్‌ ఛేంజ్‌లు రానుండగా.. ఆరు చోట్ల రెస్ట్‌ రూంలు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 161.518 ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం నిర్మాణంలో 187 అండర్‌ పాస్‌లు, నాలుగు ఆర్వోబీలు, 26 పెద్ద వంతెనలు, 81 చిన్న వంతెనలు, 400 వరకు కల్వర్టులను నిర్మించనున్నారు.

టెండర్ ప్యాకేజీ వివరాలు

1వ ప్యాకేజీ: గిర్మాపూర్ గ్రామం నుంచి రెడ్డిపల్లి గ్రామం వరకు 34.518 కిలోమీటర్లు నాలుగు వరసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని – 1529.19 కోట్లతో రెండు సంవత్సరాల నిర్మాణ సమయం, 5 సంవత్సరాల మొయింటెనెన్స్.

2వ ప్యాకేజీ: రెడ్డిపల్లి గ్రామం నుంచి ఇస్లాంపూర్ గ్రామం వరకు వరకు 26 కిలోమీటర్లు నాలుగు వరసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని – 1114.80 కోట్లతో రెండు సంవత్సరాల నిర్మాణ సమయం, 5 సంవత్సరాల మొయింటెనెన్స్.

3వ ప్యాకేజీ: ఇస్లాంపూర్ గ్రామం నుంచి ప్రజ్ఞాపూర్ వరకు వరకు 23 కిలోమీటర్లు నాలుగు వరసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని – 1184.81 కోట్లతో రెండు సంవత్సరాల నిర్మాణ సమయం, 5 సంవత్సరాల మొయింటెనెన్స్.

4వ ప్యాకేజీ: ప్రజ్ఞపూర్ నుంచి రాయగిరి గ్రామం వరకు వరకు 43 కిలోమీటర్లు నాలుగు వరసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని – 1728.22 కోట్లతో రెండు సంవత్సరాల నిర్మాణ సమయం, 5 సంవత్సరాల మొయింటెనెన్స్.

5వ ప్యాకేజీ: రాయగిరి గ్రామం నుంచి తంగడ్ పల్లి గ్రామం వరకు వరకు 35 కిలోమీటర్లు నాలుగు వరసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని – 1547.04 కోట్లతో రెండు సంవత్సరాల నిర్మాణ సమయం, 5 సంవత్సరాల మొయింటెనెన్స్.

ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం నిర్మాణంపై తెలంగాణ సర్కార్ దృష్

రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనులకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలవడంతో అందరి చూపు దక్షిణభాగంపై పడింది. ఉత్తర భాగం రోడ్డు పనులను స్వయంగా కేంద్ర ప్రభుత్వమే చేపడుతుండగా.. దక్షిణ భాగం పనులను రాష్ట్రమే చేపట్టాలని నిర్ణయించింది. రెండు భాగాల పనులను సమాంతరంగా చేపడతామని వివిధ సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దక్షిణ భాగాన్ని యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్‌ నుంచి సంగారెడ్డి వరకు మొత్తం 189.20 కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉంటుంది. ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఫోర్త్‌సిటీకి, శంషాబాద్‌ విమానాశ్రయానికి అనుసంధానం ఉండేలా ఈ మార్గాన్ని అభివృద్ధి చేస్తామని చాలా సందర్బాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఐతే దక్షిణ భాగం రీజినల్ రింగ్ రోడ్డు డీపీఆర్‌ రూపొందించేందుకు కన్సల్టెన్సీ సంస్థ కోసం గత నవంబరు 25న టెండర్లను పిలిస్తే ఒక్క బిడ్‌ దాఖలు కాలేదు. ఈ నేపథ్యంలో మరోసారి డీపీఆర్ కోసం బిడ్లను అహ్వానించనుంది తెలంగాణ ప్రభుత్వం. మూడేళ్లలో ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం పనులను పూర్తి చేయాలని భావిస్తోంది. మొదటి 14 నెలల్లో డీపీఆర్‌కు సంబంధించిన అన్ని నివేదికలను రూపొందించడం, వాటి వివరాలను పరిశీలించడం, ఆమోదించడం వంటివి ముగించాక… 22 నెలల్లో పనులను పూర్తిచేసేలా ప్రణాళికలను తయారు చేసింది.

రోడ్డు ఎలైన్‌ మెంట్, నిర్మాణం, కూడళ్లు, వంతెనలు, అండర్‌ పాస్‌లు, కల్వర్టులు ఇలా ప్రతీ అంశాన్ని డీపీఆర్‌లో పొందుపరుస్తారు. వీటితో పాటు ప్రాజెక్టు చేపట్టాల్సిన ప్రాంతంలో ఉన్న చెరువులు, కుంటలు, ప్రభుత్వ-ప్రైవేటు భూములు, సేకరించాల్సిన రైతుల భూమి తదితర పూర్తి వివరాలను నివేదికలో వెల్లడిస్తారు. పనులను ఇంజినీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కన్‌స్ట్రక్షన్‌, హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌, బిల్డ్‌-ఆపరేట్‌-ట్రాన్స్‌ఫర్‌ పద్ధతుల్లో దేని ప్రకారం చేపడితే అనుకూలంగా ఉంటుందో డీపీఆర్ లో సూచిస్తారు.

రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం పనులకు జైకా, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ వంటి ఆర్థిక సంస్థల నుంచి నిధులను సేకరించాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. అయితే, డీపీఆర్‌ రూపొందించడానికి ఒక్క కన్సల్టెన్సీ సంస్థ నుంచి స్పందన రాకపోవడంతో.. ఈ పనులనూ కేంద్రమే చేపట్టే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ప్రభుత్వవర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ నుంచి సానుకూల స్పందన వ్యక్తమైనట్లు సమాచారం. ఇదే జరిగితే ఎన్‌హెచ్‌ఏఐ… దక్షిణ భాగం డీపీఆర్‌ రూపకల్పనకు కన్సల్టెన్సీ సంస్థ కోసం మరోసారి టెండర్లు పిలవాల్సి ఉంటుంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles