తెలంగాణ నిర్మాణ సంఘాలన్నీ కలిసికట్టుగా ఒక్క రోజు బంద్ నిర్వహిస్తే.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. సుమారు మూడు లక్షల మందికి పైగా కార్మికులు ఒక్క రోజు నిర్మాణ పనుల్ని స్తంభించినా ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. ఎందుకంటే, నిర్మాణ పనులు స్తంభిస్తే.. తమకొచ్చే నష్టమేం లేదని ఉన్నతాధికారులు భావించి ఉండొచ్చు. తమ సమస్యల్ని చెప్పుకోవడానికి బంద్ నిర్వహిస్తున్నామని నిర్మాణ సంఘాలు ముందే చెప్పుకున్నాయి. వాస్తవానికి, ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం గనక సీరియస్గా తీసుకుని.. కేంద్రాన్ని ప్రశ్నిస్తే.. భారతదేశపు నిర్మాణ రంగమంతా సీఎం కేసీఆర్ కు జేజేలు పలికేది.
దేశవ్యాప్తంగా స్థిరాస్తి రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపెట్టడం పెద్దగా కష్టమేం కాదు. కాస్త విప్లవాత్మకంగా ఆలోచిస్తే సరిపోతుంది. తెలంగాణ ఆవిర్భవించాక సీఎం కేసీఆర్ చేసింది కూడా ఇదే. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోకు ముఖ్య అతిథిగా విచ్చేసి.. ఈ రంగానికి అనేక రాయితీలను ప్రకటించారు. ఆ తర్వాతే కదా.. మన నిర్మాణ రంగానికి ఎక్కడ్లేని ఊపొచ్చింది. ఇదే విధంగా కేంద్రమూ రియల్ రంగానికి ప్రోత్సహాన్ని అందజేస్తే.. భారతదేశ రియల్ రంగం ప్రపంచ దేశాలతో పోటీపడే స్థాయికి ఎదుగుతుంది.
కానీ, మన సీఎం కేసీఆర్ కు ఉన్న ముందు చూపు దేశనాయకులకెక్కడిది? అందుకే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. వ్యవసాయం తర్వాత అధిక శాతం మందికి ఉపాధి, ఉద్యోగావకాశాల్ని కల్పించే నిర్మాణ రంగానికి భరోసా కల్పించాలి. అప్పుడే, ఆయన చూపెట్టిన బాటలో మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుసరిస్తారు.
This website uses cookies.