Categories: LATEST UPDATES

లగ్జరీ హౌసింగ్ దూకుడు

జనవరి-మార్చి త్రైమాసికంలో 10 శాతం వృద్ధి
విలాసవంతమైన ఇళ్ల అమ్మకాల్లో అగ్రస్థానంలో ముంబై
తర్వాత స్థానాల్లో హైదరాబాద్, పుణె

దేశంలో లగ్జరీ హౌసింగ్ సెగ్మెంట్ దూకుడు ప్రదర్శిస్తోంది. జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ విభాగం 10 శాతం వృద్ధి సాధించింది. రూ.4 కోట్లు అంతకంటే ఎక్కువ ధర కలిగిన విక్రయాలు గత ఏడాది తొలి త్రైమాసికం కంటే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 10 శాతం మేర పెరిగినట్టు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ సీభీఆర్ఈ వెల్లడించింది. మొత్తం రెసిడెన్షియల్ యూనిట్ అమ్మకాల్లో లగ్జరీ హౌసింగ్ సెగ్మెంట్ వాటా 5 శాతంగా ఉంది. అలాగే కొత్త లాంచ్ లలో తొలి త్రైమాసికంలో 64 శాతం పెరుగుదల నమోదైంది.

నగరాలవారీగా చూస్తే విలాసవంతమైన ఇళ్ల అమ్మకాల్లో ముంబై అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ గతేడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే 15 శాతం పెరుగుదల నమోదైంది. తర్వాత ఢిల్లీ, హైదరాబాద్, పుణెలు ఉన్నాయి. హైదరాబాద్ లో రెండు రెట్లు, పుణెలో 4.7 రెట్ల మేర అమ్మకాలు పెరిగాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దేశంలోని మొత్తం లగ్జరీ ఇన్వెంటరీలో 40 శాతం కంటే ఎక్కువ వాటాతో ముంబై తొలి స్థానంలో ఉంది. అనేకమంది హెచ్ఎన్ఐ, యూహెచ్ఎన్ఐలను ఈ నగరం ఆకర్షించడమే ఇందుకు ప్రధాన కారణం. ఇక్కడ సగటు టికెట్ పరిమాణం రూ.20 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు ఉంటోంది.

ఒక్కోసారి రూ.100 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన అపార్ట్ మెంట్లు కూడా అమ్ముడవుతాయి. ఇక లగ్జరీ ఇన్వెంటరీ 25 శాతానికి పైగా వాటాతో రెండో స్థానంలో ఢిల్లీ నిలిచింది. ఇక్కడ టికెట్ పరిమాణం రూ.40 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు ఉంటోంది. ఇటీవల కాలంలో గుర్గావ్ ప్రాంతం ఓ ప్రముఖ లగ్జరీ మార్కెట్ గా అవతరించింది. ఇక్కడ టికెట్ పరిమాణం రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ఉంది. లగ్జరీ సెగ్మెంట్ ఇన్వెంటరీలో 10 శాతం వాటాతో హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, రాయదురగం, నియోపోలిస్ వంటి ప్రాంతాల్లో సగటు టికెట్ పరిమాణం రూ.20 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు ఉంటోంది.

రెసిడెన్షియల్ అమ్మకాల్లో 8 శాతం వృద్ధి

ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా అన్ని కేటగిరీల్లో రెసిడెన్షియల్ అమ్మకాలు దాదాపు 85వేల యూనిట్లకు చేరుకున్నాయి. వార్షిక ప్రాతిపదికన 8 శాతం వృద్ధి నమోదైంది. డిమాండ్ ఊపందుకోవడంతో డెవలపర్లు 2024 క్యూ1లో కొత్తగా 80వేల కొత్త హౌసింగ్ యూనిట్లు ప్రారంభించారు. మిడ్ ఎండ్ ప్రాజెక్టులు (రూ.45 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర కలిగిన ఇళ్లు) ప్రముఖ కేటగిరీ డ్రైవింగ్ సేల్స్ గా ఆవిర్భవించాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో మొత్తం అమ్మకాల్లో 47 శాతం వాటా కలిగి ఉన్నాయి. తర్వాత స్థానాల్లో హై ఎండ్ (రూ.కోటి నుంచి రూ.2 కోట్ల మధ్య), అందుబాటు ధర ప్రాజెక్టులు (రూ.45 లక్షల లోపు ధర) ఉన్నాయి. మొత్తం లాంచ్ లలో ముంబై, పుణె, హైదరాబాద్ కలిపి 69 శాతం వాటా కలిగి ఉండటం విశేషం.

This website uses cookies.