Categories: LATEST UPDATES

ఎమినిటీస్, డెలివరీ తేదీ బిల్డ‌ర్లు ముందే చెప్పాలి

రెరా స్పష్టీకరణ

ప్లాట్ల అమ్మకాలకు సంబంధించి డెవలపర్లు, కొనుగోలుదారుల మధ్య ఎలాంటి సమస్యలూ రాకుండా చూసే విషయంలో మహారాష్ట్ర రెరా దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిన మహా రెరా.. తాజాగా ఎమినిటీస్, డెలివరీ తేదీ విషయంలోనూ సందిగ్ధతకు తావు లేకుండా చూసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మోడల్ అగ్రిమెంట్ షెడ్యూల్ రెండులో అపార్ట్ మెంట్ కు సంబంధించి ఏయే సౌకర్యాలు కల్పిస్తారు అనేది మాత్రమే ఉండేది. వాటి డెలివరీ తేదీ తదితరాల గురించి ఏమీ ఉండేది కాదు. ఈ నేపథ్యంలో ఇకపై వాటి డెలివరీ తేదీ కూడా తప్పనిసరిగా సేల్ డీడ్ లో పేర్కొనాలని మహా రెరా స్పష్టం చేసింది.

‘ప్రాజెక్టుకు సంబంధించి కల్పిస్తానన్న సౌకర్యాలకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా చెప్పాలి. స్విమింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్టులు, టెన్నిస్ కోర్టులు, టేబుల్ టెన్నిస్ కోర్టు, ఆడిటోరియంలు, సొసైటీ కార్యాలయాలు, జిమ్, స్క్వాష్ కోర్టుల వంటి సౌకర్యాలకు సంబంధించిన అన్ని వివరాలను, వాటిని ఎప్పుడు పూర్తి చేసి అందజేస్తారనే తేదీని అమ్మకపు ఒప్పందంలో పొందుపరచాలి’ అని పేర్కొంది. ‘ప్రస్తుతం హౌసింగ్ ప్రాజెక్టుకు సంబంధించిన అమ్మకపు ఒప్పందాల్లో అన్ని వివరాలూ ఉంటున్నాయి. స్పెసిఫికేషన్లతోపాటు పేమెంట్ షెడ్యూల్, యూనిట్ ధర, ప్రాజెక్టు అప్పగింత తేదీ వంటివన్నీ ఉంటున్నాయి. అయితే, కొనుగోలుదారులకు కల్పిస్తాననే సౌకర్యాల గురించి ఎలాంటి వివరాలూ ఉండటంలేదు.

స్విమింగ్ పూల్, జిమ్, కమ్యూనిటీ సెంటర్ ఎంత పరిమాణంలో ఉంటాయి? ఇంకా ఏమేం సౌకర్యాలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి అనేదానిపై వారికి ఎలాంటి అవగాహనా ఉండటంలేదు. ఒక్కో సందర్భంలో కొనుగోలుదారులు అంచనాల మేరకు అవి లేకపోవడం, అనుకున్న తేదీకి అప్పగించకపోవడం వంటి అంశాలు వివాదాలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంలో పాదర్శకత, జవాబుదారీతతనాన్ని మరింత పెంచడం కోసం ఎమినిటీస్ వివరాలతోపాటు వాటిని ఎప్పుడు అప్పగిస్తారు అనే తేదీని కూడా అగ్రిమెంట్ లో పొందుపరచాలనే నిర్ణయం తీసుకున్నాం’ అని మహా రెరా అధికారి ఒకరు వెల్లడించారు.

This website uses cookies.