Categories: AREA PROFILE

కొంప‌ల్లి కంటే గ‌చ్చిబౌలిలో ధ‌ర పెరుగుదుల ఎక్కువ‌!

  • హైదరాబాద్లో పరిస్థితి భిన్నం
  • ఆరేళ్లలో 69 శాతం వృద్ధి
  • అనరాక్ తాజా నివేదికలో వెల్లడి

దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లోని శివారు ప్రాంతాలు సైతం రియల్ రన్ సాగిస్తున్నాయి. అక్కడి ఇళ్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. నగరాల కంటే శివారు ప్రాంతాల్లో ఎక్కువగా భూమి లభిస్తుండటం.. తక్కువ ధరకే రావడంతో డెవలపర్లు పెద్ద, విలాసవంతమైన నివాస ప్రాజెక్టులు నిర్మించడానికి మొగ్గు చూపిస్తున్నారు. సౌకర్యాలు పెరగడం, రవాణా వసతులు మెరుగుపడటం వంటి కారణాలతో కొనుగోలుదారులు కూడా అటువైపే వెళుతున్నారు. దీంతో నగరాల్లో ప్రైమ్ ప్రాంతాల ఇళ్ల ధరల కంటే శివారు ప్రాంతాల్లోని ఇళ్ల ధరలే ఎక్కువగా పెరిగాయి. గత ఆరేళ్లకు సంబంధించిన వివరాలతో ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ ఓ నివేదిక విడుదల చేసింది.

బెంగళూరులోని గుంజూర్‌లో ఈ ధోరణి ప్రత్యేకించి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ రెసిడెన్షియల్ ప్రాపర్టీ ధరలు 2019లో చదరపు అడుగుకు రూ.5,030 ఉండగా.. 2024 మూడో త్రైమాసికంలో రూ.8,500కి పెరిగింది. అంటే 69 శాతం వృద్ధి నమోదైంది. దీంతో పోలిస్తే.. గుంజూర్ కు కొద్ది దూరంలో ఉన్న ప్రధాన ప్రాంతం తన్నిసాంద్రలో 62 శాతం మాత్రమే పెరుగుదల కనిపించింది. ఢిల్లీ విషయానికి వస్తే శివారు ప్రాంతమైన నోయిడా ఎక్స్ ప్రెస్ వేలో గత ఆరేళ్లలో ఇళ్ల ధరలు 66 శాతం పెరిగాయి. 2019లో చదరపు అడుగుకు రూ. 5,075 ఉండగా.. 2024 క్యూ3లో రూ. 8,400కి పెరిగింది. అదే ప్రైమ్ ఏరియా అయిన రాజ్ నగర్ ఎక్స్ టెన్షన్ లో 55 శాతమే వృద్ధి కనిపించింది. మొత్తమ్మీద గత ఆరేళ్లలో దేశంలోని ప్రధాన నగరాల్లో సగటు ఇళ్ల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అగ్ర నగరాల్లోని అనేక శివారు ప్రాంతాల్లోని ఇళ్ల ధరలు ప్రధాన ప్రాంతాల్లోని గృహాలధరల కంటే పెరగడం గమనార్హం. హైదరాబాద్ విషయానికి వస్తే పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. ఇక్కడ శివారు ప్రాంతమైన కొంపల్లిలో ఇళ్ల ధరలు 49 శాతం మాత్రమే పెరగ్గా.. ప్రధాన ప్రాంతమైన గచ్చిబౌలిలో 86 శాతం వృద్ధి నమోదైంది.

This website uses cookies.