Categories: LATEST UPDATES

ఇంటి రీసేల్ ధర ఖరారయ్యేది ఇలా..

మనదేశంలో ఇంటికి ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. మన ఇంటి ధర కాలక్రమేణా పెరుగుతుందే తప్ప తగ్గదు అనేది అందరి అంచనా. మరి ఇంటి రీసేల్ ధర ఎలా ఖరారవుతుంది? ఏయే అంశాలు దీనిపై ప్రభావం చూపుతాయి అనేది ఓసారి చూద్దామా? వాస్తవానికి కరోనా తర్వాత దేశంలో రియల్ రంగం గణనీయమైన పురోగతి సాధించింది. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు బాగానే పెరిగాయి. ధరలు సైతం అలాగే పైకి ఎగబాకాయి. మరి ఈ ట్రెండ్ పాత ఇళ్ల అమ్మకంలోనూ ఉంటుందా? కొత్త ఇళ్ల ధరలు పాత ఇంటి ధరలను ప్రభావితం చేస్తాయా? అంటే ఔననే చెప్పాలి. ఈ విషయంలో ఇళ్ల యజమానులకు కొన్ని విషయాలపై అవగాహన ఉండటం చాలా ముఖ్యం. అవేంటంటే..

డెవలపర్ బ్రాండ్ ప్రభావం..

ఇటీవల కాలంలో డెవలపర్ బ్రాండ్ అనేది అపార్ట్ మెంట్ల రీసేల్ లో కీలకపాత్ర పోషిస్తోంది. ప్రముఖ డెవలపర్ల ప్రాజెక్టులకు డిమాండ్ ఉండటంతో వాటికి మంచి ధర పలుకుతోంది. వీరి ప్రాజెక్టుల పట్ల జనాలకు విశ్వాసం ఉండటం, సకాలంలో పూర్తి చేస్తారనే పేరుండటం, క్వాలిటీలో రాజీ పడరనే అంశాలు ఇందుకు కారణాలు. దీనివల్ల ఈ ప్రాజెక్టుల్లో ఫ్లాట్ల రీసేల్ కు మంచి ధర రావడం ఖాయం.

సౌకర్యాల ప్రభావం..

ఓ హౌసింగ్ ప్రాజెక్టులో ఉండే సౌకర్యాలు దాని రీసేల్ లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కొనుగోలుదారులు ఎప్పుడూ తమకు అవసరమైన సౌకర్యాలు ఉండాలని కోరుకుంటారు. స్విమింగ్ పూల్, జిమ్, కమ్యూనిటీ సెంటర్లు, గ్రీన్ స్పేస్ తదతరాలతోపాటు ఆధునిక జీవనశైలికి అనుగుణమైన వసతులూ కావాలనుకుంటున్నారు. ఇలాంటి సౌకర్యాలున్న ప్రాజెక్టులకు డిమాండ్ కూడా భారీగానే ఉంటుంది. దీంతో వీటి పున:విక్రయం ధర గణనీయంగా పెరుగుతుంది.

మార్కెట్ పరిస్థితులు అంచనా వేయడం..

రీసేల్ లో మంచి ధర రావాలంటే అందుకు మార్కెట్ మద్దతు ఉందో లేదో నిర్ధారించడానికి అనేక అంశాలు పరిశీలించాలి. వీటిలో ప్రస్తుత రియల్ ఎస్టేట్ ట్రెండ్ లు, వడ్డీ రేట్లు, ఆర్థిక పరిస్థితులు, ఆ ప్రాంతంలో డిమాండ్-సప్లై ఎలా ఉంది వంటివి ఉంటాయి. వీటిని పరిశీలించి మదింపు చేయడం ద్వారా మీ ఇంటిని ఏ సమయంలో, ఎంతకు విక్రయించాలి అనే అంశంపై ఓ నిర్ణయానికి రావొచ్చు. అయితే, అక్కడ సరఫరా ఉండి డిమాండ్ తక్కువగా ఉంటే ధర తగ్గుతుంది. ఈ నేపథ్యంలో సరఫరా తగ్గే వరకు వేచి ఉండటం తెలివైన నిర్ణయం అవుతుంది. ఇందుకు ఓర్పు, శ్రద్ధ చాలా అవసరం.

రీసేల్ విలువ పెంచడానికి చిట్కాలు..

అపార్ట్ మెంట్ ను మంచి స్థితిలో ఉంచాలి. క్రమం తప్పకుండా చక్కని మెయింటనెన్స్ చేయడం, సకాలంలో అవసరమైన మరమ్మతులు చేయించడం రీసేల్ విలువను పెంచుతాయి. అలాగే ఇంటిని రెన్యువేట్ చేయడం ద్వారా కూడా రీసేల్ ధర పెంచుకోవచ్చు. ఆధునిక సౌకర్యాలు కల్పించడం లేదా కొన్ని వసతులను ఆధునీకరించడం ద్వారా కొనుగోలుదారులను ఆకర్షించవచ్చు.

ప్రభావవంతమైన మార్కెటింగ్..

తమంతట తాముగా అమ్ముడయ్యే ప్రాపర్టీలు చాలా తక్కువగా ఉంటాయి. మీ ఇంటికి అత్యుత్తమ ధర రావాలంటే వీలైనంత ఎక్కువ మందికి అది చేరాలి. అందుకోసం తగిన చర్యలు తీసుకోవాలి. ప్రాపర్టీ పోర్టళ్లలో మీ ఇంటి ఫొటోలు, ఇతరత్రా వివరాలను పోస్టు చేయాలి. అలాగే రియల్ ఎస్టేట్ ఏజెంట్ల సహకారం కూడా తీసుకోవచ్చు. తద్వారా ఎక్కువ మందికి మీ ఇంటి వివరాలు చేరి, అత్యుత్తమ ధర వచ్చే అవకాశం ఉంటుంది.

అవసరమైన అన్ని పత్రాలూ ఉండాలి..

ఆస్తికి సంబంధించి చట్టబద్ధంగా కావాల్సిన పత్రాలన్నీ ఉంటే మీకు చక్కని ధర రావడం ఖాయం. టైటిల్ డీడ్, సేల్ డీడ్, భవన నిర్మాణ అనుమతి ప్లాన్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, పొసెసన్ సర్టిఫికెట్, ఎన్ కంబెన్సీ సర్టిఫికెట్, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ వంటి పత్రాలన్నీ ఉంటే కొనుగోలుదారులకు భరోసా కలుగుతుంది.

This website uses cookies.