ఇల్లు కొనే విషయంలో కొనుగోలుదారుల ఆలోచనలు మారుతున్నాయి. తమ అవసరాలు, కావాల్సిన సౌకర్యాలు ఉన్న ఇళ్లకే ఎక్కువ మంది ఓటేస్తున్నారు. సొంతింటి కల నెరవేర్చుకునే విషయంలో రాజీపడటానికి వారు ఇష్టపడటంలేదు. ముఖ్యంగా కరోనా తర్వాత చాలామంది వైఖరిలో గణనీయమైన మార్పు వచ్చింది. ఇరుకుగా ఉండే ఇళ్లను ఇష్టపడటంలేదు. కాస్త విశాలంగా ఉండే ఇళ్లనే కోరుకుంటున్నారని తాజా జరిపిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. అలాగే ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నట్టు తేలింది. తమ ఇంటికి చుట్టుపక్కల ఆరోగ్య సౌకర్యాలు ఎలా ఉన్నాయి? అత్యవసర సమయంలో ఆస్పత్రికి ఎంత సేపట్లో చేరుకోవచ్చు వంటివి చూస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, పెద్దవాళ్ల ఆరోగ్య అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఆరోగ్యం తర్వాత వినోద కార్యకలాపాలకు ఎక్కువ మంది జైకొడుతున్నారు. తమ కమ్యూనిటీలో ఆటపాటలకు అనువైన వాతావరణం ఉండాలని కోరుకుంటున్నారు. పిల్లల కోసం క్రీడా సదుపాయాలతోపాటు పెద్దలకు క్లబ్ హౌస్, జిమ్, స్విమింగ్ పూల్ వంటివి కావాలనుకుంటున్నారు. అలాగే ఎక్కువ ఖాళీ స్థలం, అధిక పచ్చదనం ఉండాలని చెబుతున్నారు. ఇక వారాంతాల్లో కుటుంబంతో సరదాగా గడిపేందుకు దగ్గర్లో వినోద కేంద్రాలు, రెస్టారెంట్లు ఉన్నాయా లేవో కూడా చూసుకుంటున్నారు. అలాగే చిన్నపిల్లల ఆలనాపాలనా చూసే డేకేర్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయో లేవో ఆరా తీసుకుంటున్నారు. నగరాల్లో ట్రాఫిక్ నరకం నుంచి విముక్తి పొందడం కోసం పలువురు తమ ఆఫీసులకు సమీపంలో ఉండే ఇళ్ల కోసం చూస్తున్నారు. మరికొందరు సిటీకి దూరంగా కాస్త ప్రశాంతమైన వాతావరణంలో ఇల్లుంటే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇలా తాము మెచ్చే, తమకు నచ్చే సౌకర్యాలుంటేనే ఇల్లు కొంటామని తెగేసి చెబుతున్నారు.
This website uses cookies.