ఆర్వీ నిర్మాణ్ ఎండీ రామచంద్రారెడ్డి
నిర్మాణ రంగానికి సంబంధించి పలు అనుమతులు ఇచ్చే సింగిల్ విండో వ్యవస్థను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని ఆర్వీ నిర్మాణ్ ఎండీ రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయా అంశాలపై ఆయన రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా మట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం శుభశూచకం. రియల్ ఎస్టేట్లో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి రావడం మరింత సానుకూలమైన అంశం. ఇది హైదరాబాద్ సిటీకి మరింత అడ్వాంటేజ్. ఎన్నో రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్కడ ఉంటారు కాబట్టి.. ఈ నగరం అభివృద్ధి ఇలాగే కొనసాగుతుంది. కొత్త సీఎం రేవంత్ కు రియల్ ఎస్టేట్ అనుభవం ఉంది కాబట్టి.. ఆయన ఈ రంగంలో ఉన్న సాధకబాధకాలు చర్చించి పరిష్కరిస్తే హైదరాబాద్ రియల్ రంగం మరింత ముందుకెళుతుంది. ఎక్కడైనా ఒక ఏరియాను డెవలప్ చేయడానికి కాస్త టైం పడుతుంది. మాదాపూర్ డెవలప్ కావడానికి పదేళ్లు పట్టింది. ఉప్పల్ ఏరియా 15 ఏళ్లు అయినా అంతగా అభివృద్ధి కాలేదు. అక్కడ డెవలప్ అయ్యేలా ప్రభుత్వం ప్రోత్సహించాలి. ప్రస్తుతం వ్యవస్థలన్నీ చాలావరకు బావున్నాయి.
ఏ రంగంలో అయినా ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా కొన్ని సమస్యలు తప్పవు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం అందరితో రెండు మూడు నెలలలోకోసారి చర్చిస్తే ఈ సమస్యలు పరిష్కారమవుతాయి. కొన్ని అనుమతులు ఇవ్వడానికి సింగిల్ విండో వ్యవస్థ వచ్చింది. కానీ కొన్ని డిపార్ట్ మెంట్లు వాటిని అమలు చేయడంలేదు. చెరువు దగ్గర నిర్మాణం చేపడితే సింగిల్ విండో దగ్గర నుంచి ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ దగ్గరకు వెళుతంది. అక్కడ 15 రోజుల్లోగా రిపోర్టు రావాలి. కానీ అలా రావడంలేదు. మళ్లీ బిల్డర్లే అక్కడకు వెళ్లి అనుమతులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఎయిర్ పోర్టు అథార్టీ, ఎన్విరాన్ మెంటల్ క్లియరెన్స్ కూడా అలాగే ఉంది. వీటన్నింటినీ కూడా సింగిల్ విండోలో పొందుపరిస్తే.. అనుమతులన్నీ సకాలంలో వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు.
This website uses cookies.