హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి కొత్త ప్రభుత్వం తొలుత ఔటర్ గ్రోత్ కారిడార్ పై దృష్టి పెట్టాలని ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ ఎండీ ఎస్.రాంరెడ్డి సూచించారు. రియల్ రంగానికి సంబంధించి పలు అంశాలపై ఆయన రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంలో గత 25, 30 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లే అంశంలో కొత్త సీఎం రేవంత్ రెడ్డికి ఓ ప్రణాళిక ఉందని మేం భావిస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగానికి మరింత ఊపు వస్తుందనుకుంటున్నాం. చంద్రబాబు మొదలుపెట్టిన యాక్టివిటీస్ ను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొనసాగించారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కూడా అలానే చేశారు. అక్కడ నుంచి తెలంగాణ ఏర్పడిన తర్వాత చంద్రశేఖర్ రావు కొనసాగించారు. ఇప్పుడు రేవంత్ కొనసాగిస్తారని భావిస్తున్నాం. అన్ని విషయాలూ చాలా సానుకూలంగానే ఉంటాయని అనుకుంటున్నాం. కొత్త ప్రభుత్వం ఔటర్ గ్రోత్ కారిడార్ ను తొలి ప్రాధాన్యంగా తీసుకుని అక్కడ గ్రిడ్ రోడ్లు, ఇతరత్రా మౌలిక వసతులు అభివృద్ధి చేయాలి. తక్కువ వ్యయంతో ఎక్కువ అభివృద్ధికి అక్కడ అవకాశం ఉంది. అందువల్ల తొలి ప్రాధాన్యంగా ఈ పనులు చేపట్టాలి. తర్వాత మాస్టర్ ప్లాన్స్ అన్నీ గజిబిజిగా ఉన్నాయి. వాటన్నింటినీ క్రోడీకరించి ఓ యూనిఫైడ్ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. దీనిని యుద్దప్రాతిపదికన చేయాల్సిన అవసరం ఉంది. అలా చేయడంలో నగరం క్రమపద్ధతిలో అభివృద్ధి చెందుతుంది.
గత ప్రభుత్వం ట్రిపుల్ వన్ జీవోను ఎత్తేసింది. ఆ ప్రాంతానికి ఏ విధంగా కొత్త మాస్టర్ ప్లాన్ తేవాలో, దానిని ఎలా అభివృద్ధి చేయాలి అనే అంశంపై సీఎం రేవంత్ దృష్టి పెట్టాలి. అక్కడున్న చెరువులు, పర్యావరణ వ్యవస్థకు విఘాతం కలగకుండా అభివృద్ధి చేస్తే.. హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయికి వెళుతుంది. ప్రపంచంలోనే టాప్ ఫైవ్ సిటీస్ లో హైదరాబాద్ చేరుతుంది. అదే సమయంలో హైదరాబాద్ డెవలప్ అనేది ఇప్పటివరకు వెస్ట్, సౌత్ లో మాత్రమే జరుగుతోంది. అందువల్ల నార్త్, ఈస్ట్ లో కూడా అభివృద్ధి చేస్తే నగరంలో ట్రాఫిక్ కూడా తగ్గుతుంది. అప్పుడు నగరం నలువైపులా అభివృద్ధి చెందుతుంది’ అని పేర్కొన్నారు.
This website uses cookies.