లగ్జరీ హోమ్ లో కల్పిస్తానన్న సౌకర్యాలు కల్పించకుండా వినియోగదారులను ఇబ్బందులకు గురిచేసిన ఓ రియాల్టీ సంస్థపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కొనుగోలుదారులకు కలలు అమ్మేశారు కానీ, వాటిని నెరవేర్చలేదని వ్యాఖ్యానించింది. ఇటాలియన్ మార్బుల్ ఫ్లోర్, గోల్ఫ్ కోర్సు వ్యూ, ఇతర లగ్జరీ సౌకర్యాలు కల్పిస్తానని చెప్పి విఫలమైనందున తమ మొత్తం తిరిగి కావాలనుకునే కొనుగోలుదారులకు వడ్డీతో సహా అది తిరిగి చెల్లించాలని ఐరియో ప్రైవేట్ లిమిటెడ్ ను ఆదేశించింది.
గురుగ్రామ్ లోని గోల్ఫ్ కోర్సు ఎక్స్ టెన్షన్ రోడ్డులో ఐరియో ప్రైవేటు లిమిటెడ్ ‘స్కైఆన్’ పేరుతో ఓ ప్రాజెక్టు ప్రారంభించింది. గోల్ఫ్ కోర్సుతో సహా బోలెడు లగ్జరీ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి పలువురికి ఫ్లాట్లు విక్రయించింది. అయితే, ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టు పూర్తికాలేదు. దీంతో తాము చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలంటూ పలువురు కొనుగోలుదారులు సంస్థను డిమాండ్ చేశారు. అలా మొత్తం వెనక్కి ఇవ్వాల్సి వస్తే 20 శాతం తగ్గించి ఇస్తామని సంస్థ మెలిక పెట్టింది. దీంతో పలువురు కొనుగోలుదారులు వినియోగదారుల కోర్టుకు వెళ్లగా.. 10.5 శాతం వడ్డీతో సహా మొత్తం చెల్లించాలని ఆదేశాలు వెలువడ్డాయి. దీనిపై సదరు సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బెలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి ఐరియో తీరుపై మండిపడింది. ‘మీరు కొనుగోలదారులకు కలలు అమ్మేశారు. కానీ కల్పిస్తానని చెప్పిన సౌకర్యాలను కల్పించడంలో విఫలమయ్యారు. అందువల్ల కొనుగోలుదారులకు తాము పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి పొందేందుకు పూర్తిగా అర్హులవుతారు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ ప్రాంతంలోని ఇతర ప్రాపర్టీల్లో చదరపు అడుగుకు రూ.6,500 ధర ఉండగా.. లగ్జరీ సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పి ఐరియో సంస్థ చదరపు అడుగుకు రూ.11,600 వసూలు చేసిందని కొనుగోలుదారుల తరఫు న్యాయవాది నివేదించారు. ఇది అత్యంత ఆదునికతతో కూడిన ఎన్నో విలాసవంతమైన సౌకర్యాలు కలిగి ప్రాజెక్టు అని చెప్పి కొనుగోలుదారులను ఆకర్షించారని, కానీ వాటిని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం వినియోగదారుల కోర్టు ఆదేశాలను సమర్థిస్తూ 10.5 శాతం వడ్డీతో కొనుగోలుదారులు చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ఆదేశించింది.
This website uses cookies.