హైదరాబాద్‌లో కొందరు ల్యాండ్ లార్డ్స్.. బయ్యర్ల అడ్వాన్స్ సొమ్మును అప్పన్నంగా దోచుకుంటున్నారు. నిబంధనల పేరిట బయ్యర్లకు చుక్కలు చూపిస్తూ.. నట్టేట ముంచేస్తున్నారు. బిల్డర్ అమ్మే రేటు కంటే తక్కువకే ఫ్లాట్ ఇస్తామంటూ ఆశ చూపెట్టి.. తెలిసిన బ్యాంకుల వద్ద లోన్ ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి.. లోన్ మంజూరు కాకపోవడంతో..
అగ్రిమెంట్ తేదీ ముగిసిపోయిందని.. ఫ్లాట్లను రద్దు చేస్తున్నారు. ఫలితంగా, అటు ఫ్లాటు చేతికి రాక.. ఇటు కష్టపడి దాచుకున్న సొమ్ము పోయి.. కొనుగోలుదారులు నానా ఇబ్బంది పడుతున్నారు. రాజేంద్రనగర్‌లో ప్రావిడెంట్ కెన్‌వర్త్‌కు చెందిన స్థల యజమాని.. ఒక టీచర్‌ను మోసం చేసిన సంఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బెంగళూరుకు చెందిన ప్రావిడెంట్ కెన్‌వర్త్.. రాజేంద్రనగర్లోని 293 పిల్లర్ వద్ద ఒక ప్రాజెక్టును ఆరంభించింది. అందులో ఫ్లాట్ కొనడానికి బిల్డర్ వద్దకు ఒక మహిళా టీచర్ వెళ్లగా.. ల్యాండ్ లార్డ్ మనుష్యులు ఆమెను సంప్రదించారు. బిల్డర్ కంటే తక్కువ రేటుకు ఫ్లాట్ ఇస్తామని నమ్మబలికారు. ఆశించిన మేరకు గృహరుణం కూడా లభిస్తుందన్నారు. దీంతో, అది నిజమేనని తను నమ్మి.. 2 బీహెచ్‌కే ఫ్లాట్ ఎంచుకున్నారు. అగ్రిమెంట్ విలువలో పన్నెండు శాతం సొమ్ము, అంటే లక్ష రూపాయల్ని ముందస్తుగా చెల్లించారు. 2019లో మిగతా నాలుగు లక్షల్ని కట్టారు.
ఆతర్వాత.. ల్యాండ్ లార్డ్ నుంచి ఎలాంటి సమాచారమూ అందలేదు. మరి, రుణం విషయంలో అడగ్గా.. ఓ జాతీయ బ్యాంకును సంప్రదించామని అన్నారు. దీంతో టీచర్ ఆ బ్యాంకు చుట్టూ తిరిగారు. కొన్ని నెలల పాటు తిరగ్గా తిరగ్గా చావు కబురు చల్లగా చెప్పారు. ప్రావిడెంట్ కెన్‌వర్త్ స్థల యజమాని ట్రైపార్టీ అగ్రిమెంట్ చేయలేదని చెప్పారు. పరిష్కారం గురించి అడగ్గా.. కార్పొరేషన్ బ్యాంకును రుణం అడగమన్నారు. ల్యాండ్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు సక్రమంగా లేకపోవడం వల్ల అక్కడా ఇబ్బంది ఎదుర్కొన్నారు.
రుణానికి సంబంధించిన ప్రాసెస్ పూర్తి చేసుకుందామనే సరికి.. కరోనా లాక్‌డౌన్ మొదలైంది. అదే సమయంలో వారి అగ్రిమెంట్‌ను టెర్మినేట్ చేస్తున్నామని సమాచారాన్ని టీచర్‌కు అందించారు. అయితే, మూడు బ్యాంకుల్లో స్థల యజమాని వల్ల రుణం లభించలేదు. అయినా, అగ్రిమెంట్ ప్రకారం మిగతా సొమ్ము చెల్లించలేదంటూ మళ్లీ అదే స్థలయజమాని ఎలా బయ్యర్లకు మెయిల్ పంపిస్తాడు? ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా?
ఆయా స్థలయజమానికి చెందిన సిబ్బందిని ఎంత ప్రాధేయపడినా వినలేదు. ఆ టీచర్ రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్‌కు చేరుకుని తమ గోడును వెళ్లబోసుకున్నారు. అయినా, సమస్య పరిష్కారం కాలేదు. ఫ్లాటును వేరేవారికి విక్రయించేశారు. మహిళా టీచర్ కట్టిన సొమ్మునూ వెనక్కివ్వలేదు. మొత్తానికి, హైదరాబాద్ రియల్ మార్కెట్లో.. కొనుగోలుదారుల కష్టపడి సంపాదించిన సొమ్మును దోచుకునే ఇలాంటి కేడీగాళ్లుంటారు. కాబట్టి, కష్టార్జితంతో ఫ్లాట్ కొనే వారు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.
This website uses cookies.