- లగ్జరీ ఫార్మ్‌హౌస్‌లు, విల్లాలకు డిమాండ్
- ఇండియా సోత్‌బీస్ సర్వే నివేదిక
దేశంలో అత్యంత సంపన్నుల చూపు రియల్ రంగంపైనే ఉంది. స్థిరాస్థిలో పెట్టుబడులు పెట్టడానికే వారు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. వచ్చే రెండేళ్లలో రియల్టీపై గణనీయంగా పెట్టుబడులు పెట్టాలని 62 శాతం మందికి పైగా కోటీశ్వరులు (అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు – హెచ్ఎన్ఐఎస్ లు, అత్యంత అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు – యూహెచ్ఎన్ఐలు) భావిస్తున్నారు. సంపన్నుల పెట్టుబడుల ధోరణులపై రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ ఇండియా సోత్‌బీస్ ఇంటర్నేషనల్ రియల్టీ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే ప్రకారం, భారత ఆర్థిక వృద్ధిపై ఆశాభావం కాస్త నెమ్మదించినప్పటికీ, వృద్ధి పటిష్టంగానే ఉండగలదనే అంచనాలు ఉన్నాయి.
2024లో ఆశాభావం 79 శాతంగా ఉండగా 2025 సర్వేలో ఇది 71 శాతానికి నెమ్మదించింది. అయినప్పటికీ, దేశ జీడీపీ వృద్ధి 6 శాతం నుంచి 6.5 శాతం వరకు ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో.. భారత్ అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఎకానమీగానే కొనసాగుతుందని ఎక్కువ మంది నమ్మకంగా ఉన్నారు. స్థిరాస్తి రంగంలో రాబడుల విషయంలో పెద్దగా అపోహలు లేకపోవడంతో చాలామంది ఈ రంగాన్నే తమ పెట్టుబడులకు మంచి ఎంపికగా భావిస్తున్నారు.
పెట్టుబడి గణనీయంగా వృద్ధి చెందుతుందనే అంచనాలే, లగ్జరీ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడానికి ప్రధాన కారణమని వారు పేర్కొంటున్నారు. 2024లో ఇలా చెప్పిన వారి సంఖ్య 44 శాతంగా ఉండగా ప్రస్తుతం ఇది 55 శాతానికి పెరిగింది. ఇక రియల్టీ పెట్టుబడులపై రాబడులు 12-18 శాతం స్థాయిలో ఉంటాయని సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది చెప్పారు. 38 శాతం మంది మాత్రం ఇది 12 శాతం కన్నా తక్కువే ఉంటుందని భావించగా .. 18 శాతానికి మించి ఉంటుందని 15 శాతం మంది అభిప్రాయపడ్డారు.
సెకండ్ హాలిడే హోమ్స్ పై ఆసక్తి కూడా పెరుగుతోంది. 54 శాతం మంది కొండ లేదా బీచ్ ప్రాంతాల్లో హాలిడే హోమ్ ఉండాలని భావిస్తుండగా.. 55 శాతం మంది రవాణా కీలకాంశమని, నాలుగు గంటల డ్రైవింగ్ దూరంలోనే అది ఉండాలని కోరుకుంటున్నారు. 20 శాతం మంది అంతర్జాతీయ ప్రదేశాల వైపు మొగ్గు చూపించారు. లండన్ కంటే దుబాయ్ టాప్ లో ఉండగా.. అమెరికా నగరాలను కోరుకునేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. దేశీయంగా బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం సైతం రియల్టీకి కలిసొస్తోందని నివేదిక పేర్కొంది. కుబేరుల సమష్టి సంపద 42 శాతం వృద్ధి చెంది ఏకంగా దాదాపు 905 బిలియన్ డాలర్ల స్థాయిని దాటిందని వివరించింది.
గత దశాబ్దకాలంలో భారత్‌లో బిలియనీర్ల సంఖ్య రెట్టింపై 185కి చేరుకోగా, మొత్తం సంపద మూడు రెట్లు పెరిగినట్లు తెలిపింది. దీంతో అంతర్జాతీయంగా అత్యధిక సంఖ్యలో కుబేరులకు కేంద్రంగా అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు వివరించింది. ” దేశీయంగా లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధి కొనసాగుతుంది. విశాలమైన ఫార్మ్‌హౌస్‌లు, గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు మొదలైన వాటికి డిమాండ్ ఉంటుందని భావిస్తున్నాం” అని ఇండియా సోత్‌బీస్ ఇంటర్నేషనల్ రియల్టీ ఎండీ అమిత్ గోయల్ తెలిపారు.