యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో నవంబరు 6న పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి పలు ఆర్కిటెక్చరల్ డిజైన్స్ ను ఇంజీనిరింగ్ నిపుణులు సిద్దం చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని మీర్‌ఖాన్‌పేట సమీపంలో 57 ఎకరాల్లో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌తో పాటు, అకడమిక్ బ్లాక్, వర్క్ షాప్‌లు, బాలికలు, బాలురకు వేర్వేరుగా వసతి గృహాలు, డైనింగ్ హాల్, స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వీటితో పాటు ఆడిటోరియం, లైబ్రరీ, సువిశాల మైదానం, పార్కింగ్ ఏరియా ఉండేలా ఈ డిజైన్లు రూపొందించారు. విశాలమైన స్కిల్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఎక్కువ ఖాళీ స్థలం, పచ్చదనం ఉండేలా నాలుగైదు మోడల్ డిజైన్స్ ను తయారు చేశారు. అన్ని భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఆరు వేల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ, వసతి సదుపాయాలు ఉండేలా క్యాంపస్‌లో నిర్మాణాలను చేపడతారు.
స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి మేఘా కంపెనీ ఇటీవల 200 కోట్ల విరాళం అందించింది. అదానీ గ్రూప్ సైతం 100 కోట్ల విరాళం అందజేసింది. వివిధ కార్పొరేట్ కంపెనీల భాగస్వామ్యం, విరాళాల ద్వారా సమీకరించిన నిధులతో కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తారు. వీటితో యూనివర్సిటీ నిర్వహణకు భవిష్యత్తులో ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా చూస్తారు. ఈ యూనివర్సిటీకి శంషాబాద్ విమానాశ్రయంతో పాటు మహబూబ్‌నగర్ నుంచి సులభంగా చేరుకునేందుకు ఒక కొత్త రహదారిని నిర్మించాలని.. టీజీఐఐసీ, హెచ్ఎండీఏ, ఆర్ అండ్ బీ శాఖలు ప్రణాళికల్ని సిద్ధం చేశాయి.
ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 13 రావిర్యాల నుంచి కొంగరకలాన్ మీదుగా మీర్‌ఖాన్‌పేట్, అక్కడి నుంచి ఆమనగల్‌లోని ఆకుతోటపల్లి వద్ద రీజనల్ రింగ్‌రోడ్‌ని అనుసంధానం చేస్తూ.. 40 కిలోమీటర్ల రహదారిని అందుబాటులోకి తెస్తారు. ఈ రహదారిని ఓఆర్ఆర్‌లా 200 అడుగుల వెడల్పుతో నిర్మించేలా ప్రణాళికల్ని సిద్దం చేశారు. రావిర్యాల నుంచి ఆకుతోటపల్లి వరకూ కొన్ని గ్రామాల నుంచి ఈ రహదారి వెళ్లనుండగా.. భూసేకరణపై రెవెన్యూ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వచ్చే యేడాది స్కిల్ యూనివర్సిటీ పూర్తి స్థాయి అకాడమిక్ ఇయర్ ను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
This website uses cookies.