Categories: TOP STORIES

లగ్జరీ ఇళ్ల దూకుడుకు కారణాలివీ..

గత కొన్ని త్రైమాసికాలుగా రియల్ ఎస్టేట్ రంగం గణనీయమైన డిమాండ్ తో ముందుకెళ్తున్నప్పటికీ, అన్ని సెగ్మెంట్ లలో కార్యకలాపాలు ఒకేలా లేవు. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో గృహాల విక్రయాల పరంగా లగ్జరీ విభాగం 39 శాతం పెరగ్గా.. అందుబాటు ధరల ఇళ్ల విభాగం 2.6 శాతం క్షీణత కనిపించిందని నైట్ ఫ్రాంక్ నివేదిక తాజాగా వెల్లడించింది. అందుబాటు ధరల అమ్మకాలను అధిగమించి హై ఎండ్ విభాగంలో అమ్మకాలు జరగడం ఇదే తొలిసారి. అందుబాటు ధదల ఇళ్ల విభాగం స్వల్పంగా తగ్గినప్పటికీ.. ప్రీమియం, లగ్జరీ విభాగాలు మంచి పనితీరును కొనసాగిస్తున్నాయని క్రెడాయ్ ఢిల్లీ ప్రెసిడెంట్, గౌర్స్ గ్రూప్ సీఎండీ మనోజ్ గౌర్ పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి, మెరుగైన జీవనం కోసం పెద్ద ఇల్లు కావాలనుకునే ఆకాంక్షే ఇందుకు కారణమని వివరించారు. అలాగే రాబోయే మూడు నాలుగేళ్లలో ధరలు కూడా 50 నుంచి 60 శాతం పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. లగ్జరీ సెగ్మెంట్ లో అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణాలివీ..

పెరుగుతున్న సంపన్నత..

భారతదేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విలాసవంతమైన ఆస్తులలో పెట్టుబడి పెట్టే అధిక నెట్ వర్క్ వ్యక్తులు (హెచ్ఎన్ఐలు), ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) పెరగడానికి దారితీసింది. వీరంతా అటు సౌకర్యాలతోపాటు భద్రత, గోప్యత కలిగిన హై ఎండ్ ఇళ్లు మాత్రమే ఎంచుకుంటారు.

గ్లోబల్ ఎక్స్ పోజర్..

పెరుగుతున్న గ్లోబల్ ఎక్స్ పోజర్ భారతీయులను గ్లోబల్ లగ్జరీ ప్రమాణాలకు మరింత అనుగుణంగా మార్చేసింది. ప్రపంచ స్థాయి సౌకర్యాలు, ప్రత్యేకమైన నిర్మాణ డిజైన్లతో పూర్తయిన గ్లోబల్ బెంచ్ మార్కులకు సరిపోయే అంశాలు కలిగిన ఇళ్ల కోసమే చాలామంది చూస్తున్నారు.

పెట్టుబడి దృక్పథం..

హై ఎండ్ రియల్ ఎస్టేట్ అనేది పెట్టుబడిపై స్థిరమైన అధిక రాబడి అందిస్తుంది. ఇది అందుబాటు గృహాలతో పోలిస్తే కాలక్రమేణా ఎక్కువ ఆదాయాన్ని అందించే ఆస్తిగా ఉంటుంది.

ఫోకస్డ్ డెవలప్ మెంట్..

లగ్జరీ విభాగానికి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో చాలామంది డెవలపర్లు ప్రత్యేకమైన ఫీచర్లతో సముచితమైన లగ్జరీ ప్రాజెక్టులను రూపొందించడంపై దృష్టి సారిస్తున్నారు. దీంతో ఈ విభాగం వృద్ధి చెందుతోంది.

భూమి ధరలు.

ప్రధాన నగరాల్లో పెరుగుతున్న భూముల ధరల కారణంగా డెవలపర్లు ప్రధాన ప్రాంతాల్లో అందుబాటు ధరల ఇళ్లు నిర్మించడం సవాల్ గా మారింది.

ఫైనాన్సింగ్ సమస్యలు..

లగ్జరీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులతో పోలిస్తే అందుబాటు ఇళ్ల ప్రాజెక్టుల కోసం నిధులు పొందడం కొన్నిసార్లు చాలా సవాల్ గానే ఉంటుంది.

This website uses cookies.