Categories: LATEST UPDATES

స్థిరంగా ఆఫీస్ స్పేస్ మార్కెట్

ప్రపంచ ఆర్థిక అనిశ్చితులను అధిగమించి ముందుకు కార్యాలయ రంగం
ఈ ఏడాది 38 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లావాదేవీలు

ప్రపంచ ఆర్థిక అనిశ్చితులను అధిగమించి 2023లో భారత ఆఫీస్ స్పేస్ మార్కెట్ స్థిరమైన వృద్ధితో ముందుకెళ్తోంది. ఈ ఏడాది దాదాపు 38 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లావాదేవీలు.. గతేడాది ఆఫీస్ స్పేస్ లావాదేవీలకు సరిపోవడంతో భారతదేశ వాణిజ్య రియల్ రంగం బలమైన దూకుడు ప్రదర్శిస్తూనే ఉంది. ఈ విషయంలో దక్షిణ భారత‌దేశ నగరాలే ముందంజలో ఉండటం విశేషం.

ఢిల్లీతో సమానంగా బెంగళూరు అగ్రస్థానంలో ఉండటమే కాకుండా మొత్తం ఆఫీస్ స్పేస్ డిమాండ్ లో సగభాగం కలిగి ఉండటం గమనార్హం. వాస్తవానికి 38 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అనేది చెప్పుకోదగిన పురోగతి కాదు. అయితే, ప్రపంచ అస్థిర పరిస్థితుల్లో ఇది గణనీయమైన పురోగతిగానే భావించాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో మాత్రమే ప్రధాన భారతీయ నగరాల్ ఆఫీస్ లీజింగ్ కార్యకలాపాలు 13.2 మిలియన్ చదరపు అడుగులకు చేరుకున్నాయి. 2022లో నమోదైన 12.6 మిలియన్ చదరపు అడుగుల త్రైమాసిక డిమాండ్ కంటే ఇది స్వల్పంగా అధికం. పైగా దేశీయ కంపెనీలే ప్రభావవంతమైన భాగస్వాములుగా ఆవిర్భవిచండం భారతీయ ఆఫీస్ మార్కెట్ లో అత్యంత ఆసక్తికరమైన పరిణామాల్లో ఒకటి. 2023లో మొత్తం ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీలో దాదాపు 50 శాతానికి పైగా దేశీయ కంపెనీలే ఉండటం మన ప్రభావాన్ని గణనీయంగా ప్రతిబింబిస్తోందని కొలియర్స్ నివేదిక వెల్లడించింది. ఫ్లెక్స్ స్పేస్ లు, ఇంజనీరింగ్, తయారీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాలు ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీకి సంబంధించిన రంగాల షేర్లలో గణనీయమైన పెరుగుదలను కనబరిచాయి. కంపెనీలన్నీ తమ కార్యాలయ పోర్టు ఫోలియోలకు అనువైన, అనుకూలమైన పని ఏర్పాట్లను ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి ప్రత్యేకించి ఫ్లెక్స్ స్పేస్ లు 2023లో వృద్ధి చెందుతూనే ఉన్నాయి. మొత్తమ్మీద సాంకేతికతతో నడిచే ఆఫీస్ స్పేస్ విభాగం ఇప్పటికీ కీలకంగానే ఉంది.

This website uses cookies.