Categories: LATEST UPDATES

హైదరాబాద్లో అద్దె ఇళ్లకు భారీ డిమాండ్

  • జూన్ త్రైమాసికంలో 22 శాతం పెరుగుదల
  • ఇళ్ల సరఫరా తగ్గడంతో 4.5 శాతం పెరిగిన అద్దెలు

హైదరాబాద్ లో అద్దె ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది ఈ ఏడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే.. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అద్దె ఇళ్ల డిమాండ్ ఏకంగా 22 శాతం పెరగడం గమనార్హం. అదే సమయంలో అద్దె ఇళ్ల సరరా జూన్‌ త్రైమాసికంలో అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే 2.1 శాతం తగ్గింది. ఫలితంగా సగటు అద్దె ధరల్లో త్రైమాసికం వారీగా 4.5 శాతం పెరుగుదల నమోదైందని ప్రముఖ మ్యాజిక్‌బ్రిక్స్‌ ‘రెంటల్‌ ఇండెక్స్‌, ఏప్రి ల్‌-జూన్‌ 2023’ నివేదికలో పేర్కొంది. గచ్చిబౌలి, కొండాపూర్‌ లు అద్దె ఇళ్ల కోసం అన్వేషిస్తున్న ప్రాంతాల్లో ముందు ఉన్నాయి. పలు ఐటీ కంపెనీలు ఉండడం, ఓఆర్‌ఆర్‌కు పక్కనే ఉండటమే ఇందుకు కారణమని మ్యాజిక్‌బ్రిక్స్‌ పేర్కొంది.

ఇక హైదరాబాద్ లో ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమైన ప్రాంతాల్లో 2బీహెచ్‌కే ఇంటి అద్దె ధరలు రూ.20వేల నుంచి రూ.32వేల మధ్యలో ఉండగా.. 3బీహెచ్‌కే ధరలు రూ.30వేల నుంచి రూ.45వేల మధ్య ఉన్నాయి. ఎక్కువ మంది అద్దెదారులు 2 బీహెచ్ కే ఇళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మొత్తం అద్దె ఇళ్లలో ఫర్నిష్డ్‌ 2బీహెచ్‌కే యూనిట్ల వాటా 55 శాతం ఉండగా.. 1 బీహెచ్‌కే ఇళ్ల డిమాండ్‌ 23 శాతం, 3 బీహెచ్‌కే ఇళ్ల డిమాండ్‌ 20 శాతంగా ఉంది. అద్దె ఇళ్ల సరఫరా అంశాన్ని పరిశీలిస్తే.. 2 బీహెచ్‌కే ఇళ్లు 58 శాతం, 1 బీహెచ్‌కే ఇళ్లు 13 శాతం, 3బీహెచ్‌కే ఇళ్లు 25 శాతం, మిగిలిన ఇళ్ల సరఫరా 4 శాతంగా నమోదైనట్టు నివేదిక పేర్కొంది. మరోవైపు రూ.10వేల నుంచి రూ.20వేల మధ్య అద్దెలున్న ఇళ్లకే 55 శాతం మంది మొగ్గు చూపిస్తుండగా.. రూ.20వేల నుంచి రూ.30వేల మధ్య ఇళ్ల పట్ల 19 శాతం మంది ఆసక్తి కనబరుస్తున్నారు. పరిమాణం విషయానికి వస్తే.. వెయ్యి నుంచి 1500 చదరపు అడుగుల మధ్యలో ఉన్న ఇళ్లకు సగానికి పైగా డిమాండ్ ది. అయితే, వీటి సరఫరా మాత్రం 39 శాతంగానే ఉంది.

దేశవ్యాప్తంగా 18 శాతం మేర పెరిగిన డిమాండ్

దేశవ్యాప్తంగా 13 ప్రముఖ పట్టణాల్లో అద్దె ఇళ్లకు డిమాండ్‌ జూన్‌ త్రైమాసికంలో 18.1 శాతం పెరిగినట్టు మ్యాజిక్‌బ్రిక్స్‌ తెలిపింది. అదే సమయంలో సరఫరా 9.6 శాతమే పెరిగిందని.. ఇళ్ల అద్దెలు 4.9 శాతం పెరిగినట్టు వివరించింది. మ్యాజిక్‌ బ్రిక్స్‌ ప్లాట్‌ఫామ్‌పై 2 కోట్ల మంది కస్టమర్ల అన్వేషణ, ప్రాధాన్యతల ఆధారంగా ఈ వివరాలను రూపొందించింది. త్రైమాసికం వారీగా చూస్తే బెంగళూరులో 8.1 శాతం, నవీ ముంబైలో 7.3 శాతం, గురుగ్రామ్‌లో 5.1 శాతం చొప్పున అద్దెలు పెరిగాయి. ఢిల్లీ, ముంబైలో మాత్రం నికరంగా తగ్గాయి. దేశవ్యాప్తంగా చూస్తే ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్లో అద్దె ఇళ్లకు డమాండ్‌ అత్యధికంగా 27.25 శాతం పెరగ్గా, ఆ తర్వాత అత్యధిక డిమాండ్‌ హైదరాబాద్‌ మార్కెట్లోనే (22 శాతం) నమోదైంది. ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌లో 18.35 శాతం, పుణెలో 19.3 శాతం, బెంగళూరులో 12.8 శాతం చొప్పున డిమాండ్‌ పెరిగింది.

This website uses cookies.