Categories: LATEST UPDATES

త‌గ్గిన ఆఫీస్‌ లీజింగ్‌ కొలియర్స్‌ నివేదిక అంచనా

ప్రస్తుత సంవత్సరంలో ఆఫీస్ స్పేస్ లీజ్ తగ్గుతుందని కొలియర్స్ ఇండియా పేర్కొంది. ఈ ఏడాదిలో ఆఫీస్ స్పేస్ లీజు 20 శాతం క్షీణించి 40 మిలియన్‌ చదరపు అడుగులకు (ఎస్‌ఎఫ్‌టీ) పరిమితం కావొచ్చని తెలిపింది. కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలను వాయిదా వేస్తుండటమే ఇందుకు కారణమని వివరించింది. దేశవ్యాప్తంగా ఆరు ప్రముఖ పట్టణాలపై వివరాలతో కూడిన నివేదికను కొలియర్స్ తాజాగా విడుదల చేసింది. స్థూలంగా ఆఫీస్‌ స్పేస్‌ లీజు 2023లో 40-45 మిలియన్‌ చదరపు అడుగుల మధ్య ఉండొచ్చని, గతేడాది ఇది 50.3 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉందని తెలిపింది. ఈ ఏడాది మార్చిలో వేసిన అంచనా కంటే ఎక్కువే ఉన్నప్పటికీ, స్థూలంగా తగ్గుతుందని వివరించింది.

ఇక ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో (జూన్‌ వరకు) 24.7 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ ఆఫీస్‌ స్పేస్‌ లీజు నమోదైంది. ద్వితీయ ఆరు నెలల్లో (డిసెంబర్‌ వరకు) మరో 15.3-20.3 మిలియన్‌ చదరపు అడుగుల మధ్య ఉంటుందని అంచనా వేసింది. నగరాల వారీగా చూస్తే.. బెంగళూరులో అత్యధికంగా 12-14 మిలియన్‌ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజింగ్ కార్యకలాపాలు నమోదయ్యాయి. ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్లో 9-11 మిలియన్‌ చదరపు అడుగులు, చెన్నైలో 7-9 మిలియన్‌ చదరపు అడుగుల మేర కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. హైదరాబాద్‌, ముంబై, పుణె మార్కెట్లలో ఇది 4-6 మిలియన్‌ చదరపు అడుగుల మధ్య ఉంది. సరఫరాకు తగ్గట్టు లీజు పరిమాణం నమోదు అవుతుండడం, ఖాళీ స్థలాలు ఫ్లాట్‌గానే ఉండడం వల్ల అద్దెలు పెరిగే అవకాశం ఉన్నట్టు కొలియర్స్‌ అంచనా వేసింది.

This website uses cookies.