నిలిచిపోయిన ప్రాజెక్టులకు సంబంధించిన ప్రమోటర్లను జీవితకాలం నిషేధించాలని ఇళ్ల కొనుగోలుదారుల సంస్థ ‘ఫోరం ఫర్ పీపుల్స్ కలెక్టివ్ ఎఫర్ట్స్ (ఎఫ్ పీసీఈ) సూచించింది. అంతేకాకుండా నిధులను ఎలా మళ్లించిందీ తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ ఆడిట్స్ నిర్వహించాలని పేర్కొంది. ఈ మేరకు స్టాల్డ్ ప్రాజెక్టుల కమిటీ చైర్మన్ అమితాబ్ కాంత్ కు ఎఫ్ పీసీఈ అధ్యక్షుడు అభయ్ ఉపాధ్యాయ లేఖ రాశారు. అలాగే నిలిచిపోయిన ప్రాజెక్టుల పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు చేపట్టాల్ అందులో సూచించారు.
దేశంలో నిలిచిపోయిన ప్రాజెక్టుల విషయంలో ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపై విధివిధానాలు రూపకల్పన చేయడం కోసం కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ నీతిఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ నేతృత్వంలో 14 సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఈనెల 8న రెండోసారి సమావేశమై పలు అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ ఈ కమిటీకి లేఖ రాశారు. ‘తొలుత పాన్ ఇండియా ప్రాతిపదికన ఐదేళ్లకు పైగా ఆలస్యమైన, పూర్తిగా నిలిచిపోయిన ప్రాజెక్టుల వివరాలు సేకరించాలి. ఈ వివరాలతో రాష్ట్రాలవారీగా జాబితా సిద్ధం చేయాలి. తర్వాత ఆర్థికంగా సమస్య లేని, ఆర్థిక ఇబ్బందులు కలిగిన, నిధుల లేమి కాకుండా ఇతరత్రా సమస్యలతో ఇబ్బందిపడుతున్న ప్రాజెక్టులను కేటగిరీలవారీగా విభజించాలి. తర్వాత సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆయా ప్రాజెక్టుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలి’ అని అందులో పేర్కొన్నారు. నిధుల ఇబ్బంది కలిగిన ప్రాజెక్టుల విషయంలో ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి ఫైనాన్షియల్ గ్రాంట్లు ఇవ్వడం ద్వారా వాటిని పూర్తి చేయాలన్నారు. ఎక్కువకాలం జాప్యమైన లేదా నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే ఆయా ప్రమోటర్లపై జీవితకాల నిషేధం విధించాలని స్పష్టంచేశారు. ‘అలాంటి ప్రమోటర్లను జీవితకాలం పాటు నిషేధించాలి. ఇకపై ఎలాంటి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టూ చేపట్టనివ్వకూడదు’ అని పేర్కొన్నారు.
This website uses cookies.