నేడూ, రేపూ.. వైజాగ్‌లో.. క్రెడాయ్ న్యూ ఇండియా సమ్మిట్
ముఖ్య అతిథులుగా ఏపీ పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ
నిర్మాణాలకు సంబంధించి ఆసక్తికరమైన సెషన్లు
నిర్మాణ పరిజ్ఞానం, ఫైనాన్స్ ఆప్షన్స్, సక్సెస్ స్టోరీస్
క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ ఒక గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకుంది. జాతీయ స్థాయి క్రెడాయ్ న్యూ ఇండియా సమ్మిట్ ను అట్టహాసంగా నిర్వహిస్తున్నది. ఈ రోజు నుంచి ఆరంభమయ్యే ఈ రెండు రోజుల సదస్సులో జాతీయ స్థాయి డెవలపర్లు, రియాల్టీ నిపుణులు తదితరులు పాల్గొంటారు. ఉదయం 11.30కు ఆరంభమయ్యే కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, లోక్‌సభ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొంటారు. ఈ ఆరంభోత్సవంలో క్రెడాయ్ ఛైర్మన్, ప్రెసిడెంట్, సెక్రటరీ, ఎన్ఐఎస్ ఛైర్మన్, క్రెడాయ్ ఏపీ ప్రెసిడెంట్, క్రెడాయ్ వైజాగ్ ప్రెసిడెంట్, ఎన్ఐఎస్ కన్వీనర్, సీబీఆర్ఈ ఛైర్మన్ అంశుమన్ మ్యాగజీన్ తదితరులు పాల్గొంటారు. కార్యక్రమ ముఖ్య అతిథులు సీబీఆర్ఈ నివేదికను విడుదల చేస్తారు.
క్రెడాయ్ న్యూ ఇండియా సమ్మిట్ కార్యక్రమంలో రియల్ రంగంలో లీడర్లుగా ఎదిగినవారు తమ అనుభవాల్ని సభ్యులతో పంచుకుంటారు. ఈ క్రమంలో వాటర్ ఇండియా ఎండీ అనిల్ కుమార్ ఇండియా గ్రోత్ స్టోరీ సెషన్ ఉంటుంది. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తన రియల్ ఎస్టేట్ పయనం గురించి బిల్డర్లతో పంచుకుంటారు. నిర్మాణల్లో వస్తోన్న ఆధునిక పరిజ్ఞానం, అందుకయ్యే ఖర్చు వంటి విషయాల్ని నిపుణులు సభకు వివరిస్తారు. అవినాష్ గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ సింఘానియా తన రియల్ ఎస్టేట్ జర్నీ గురించి ప్రత్యేకంగా తెలియజేస్తారు.
ద్వితీయ, తృతీయ శ్రేణీ పట్టణాల నిర్మాణాలకు సంబంధించిన సరికొత్త ఫైనాన్స్ మరియు పెట్టుబడి విధానాలపై హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్ మనీష్ అగర్వాల్ తదితరుల సెషన్ ఉంటుంది. ప్రాడక్ట్ టు మార్కెట్ స్ట్రాటజీ గురించి వీబీ సోషల్ ఎండీ శుభేందు ఝా, గ్జానాడు డైరెక్టర్ ఆదిత్యా మేష్రం తెలియజేస్తారు. ప్రాజెక్టులను ఎలా మేనేజ్ చేయాలి? నిర్ణీత గడువులోపు ఎలా పూర్తి చేయాలి? నిర్మాణ సామగ్రిని ఎలా ఎంచుకోవాలి? తదితర అంశాల్ని నిపుణులు వివరిస్తారు. ప్రాప్ టెక్ సెషనల్‌లో ప్రాప్ వీఆర్ కో ఫౌండర్ శ్రీనాథ్, వీగాట్ కో ఫౌండర్ అభిలాష్ హరిదాస్లు డెవలపర్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు. శ్రీకాంత్ బొల్ల సెషన్ ఆసక్తికరంగా ఉంటుంది.
ఆర్క్ ఛైర్మన్ పయనం..
రియల్ ఎస్టేట్ రంగంలో ఎదురైన సవాళ్లు, వాటిని అధిగమించిన తీరు, నిర్మాణాల్లో ప్రవేశపెట్టిన కొత్త పోకడలు, రియల్ రంగంలో తన పయనం గురించి ఆర్క్ గ్రూప్ ఛైర్మన్ గుమ్మి రాంరెడ్డి ప్రత్యేకంగా వివరిస్తారు. ఆయన కార్యక్రమం క్రెడాయ్ న్యూ ఇండియా సమ్మిట్‌కు ప్రధాన ఆకర్షణ కానున్నది. ఆయన ప్రస్తుతం క్రెడాయ్ జాతీయ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.