Categories: LATEST UPDATES

టాప‌ప్ లోన్‌.. ఎప్పుడు బెస్ట్?

రియల్ ఎస్టేట్ తో బ్యాంకులది విడదీయలేని బంధం. ఇళ్లు కొనాలంటే సాధ్యమైనంతవరకు బ్యాంకు రుణం తీసుకోవాల్సిందే. అయితే గృహాలకు రుణాలు ఇచ్చే బ్యాంకులు టాపప్ లోన్స్ కూడా మంజూరు చేస్తాయి. మరి అప్పటికే రుణం తీసుకున్న ఇంటిపై మళ్లీ టాపప్ లోన్ తీసుకోవడం మంచిదేనా? టాపప్ లోన్ తీసుకుంటే వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి? ఏ సందర్బంలో టాపప్ లోన్ తీసుకోవాలి?

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు చిన్న చిన్న పట్టణాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా సొంతింటి అవసరం నేపధ్యంలో చాలా మంది బ్యాంకు రుణాలు తీసుకుని ఇల్లు కొంటున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు గృహ రుణాలు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చేస్తున్నాయి. అయితే అప్పటికే హౌజ్ లోన్ తీసుకున్నా.. మళ్లీ టాపప్ పేరుతో బ్యాంకులు రుణాలిస్తున్నాయి. ముందు రుణం తీసుకున్నప్పటితో పోలిస్తే ఇప్పుడు సదరు ఇంటి విలువతో పాటు ఆదాయం కూడా పెరిగి ఉంటుంది. ఈ నేపథ్యంలో మరోసారి ఇంటిపై రుణం ఇస్తామంటూ బ్యాంకులు యజమానులను సంప్రదిస్తున్నాయి. ఇప్పటికే ఇంటిపై తీసుకున్న రుణాన్ని టాపప్‌ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాయి. మరి టాపప్ లోన్ తీసుకునే సందర్బంలో పలు అంశాలను పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఇంటి రుణాలపై బ్యాంకు వడ్డీ రేట్లు అంతకంతకు పెరుగుతున్నాయి. హౌజ్ లోన్స్ ప్రస్తుతం సుమారుగా 9 శాతానికి చేరుకున్నాయి. మరోవైపు కొత్తగా గృహ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు పోటీ పడుతూనే, ఇప్పటివరకూ నెలవారి వాయిదాలను సకాలంలో చెల్లించే వారికి తిరిగి లోన్ ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నాయి. ముందు తీసుకున్న గృహ రుణంపై వడ్డీ రేటు కంటే బ్యాంకును బట్టి 50 పైసల నుంచి 75 పైసల వరకు అధిక వడ్డీ ఉంటుంది. అంటే ఇంటి రుణంపై వడ్డీ రేటు 9శాతం ఉంటే టాపప్ లోన్ పై వడ్డీ 9.5 నుంచి 9.75 శాతం ఉండే అవకాశం ఉంది. గృహరుణానికి చెల్లించే వడ్డీకి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 24 ప్రకారం 2లక్షల వరకూ, అసలుకు సెక్షన్‌ 80సీ పరిమితి మేరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే ఇంటిని విస్తరించడానికి తీసుకునే సందర్బంలో తప్ప మళ్లీ తీసుకునే టాపప్‌ లోన్ కి ఇలాంటి వెసులుబాటు ఉండదని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. డబ్బు అవసరం ఉన్నప్పుడు వ్యక్తిగత రుణం, బంగారంపై అప్పులాంటివి కాకుండా గృహరుణ టాపప్‌ ను ఎంచుకోవడం మేలని అంటున్నారు. మిగతా రుణాలతో పోలిస్తే గృహంపై తీసుకునే టాపప్ లోన్ వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. అంతే కాదు గృహరుణ వ్యవధిని బట్టి, టాపప్‌ రుణ కాల పరిమితి నిర్ణయిస్తారు కాబట్టి మిగతా రుణాలకు లభించే సమయం కంటే టాపప్ లోన్ కు ఎక్కువ కాల వ్యవధి ఉంటుంది.

ఇంటిని విస్తరించడంతో పాటు, ఇంట్లో ఫర్నీచర్ కొనుగోలు, పిల్లల చదువులకు సంబందించిన ఫీజులు వంటి వాటికి టాపప్ లోన్స్ వాడుకోవచ్చు. ఒకేసారి డబ్బుతో అవసరం లేదు అనుకుంటే, టాపప్‌ రుణంలోనే ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. దీనికి గృహరుణంతో పోలిస్తే కాస్త అధిక వడ్డీ ఉంటుంది. దీర్ఘకాలం వరకూ అవసరమైనప్పుడే డబ్బు తీసుకునే వీలుంటుంది. ఉపయోగించుకున్న మొత్తానికే వడ్డీ విధిస్తారు. కాబట్టి పెద్దగా భారం ఉండదు. అప్పటికే లోన్ తీసుకున్న వారికి సంబంధించిన అన్ని వివరాలూ బ్యాంకు దగర ఉంటాయి. రుణగ్రహీత ఈఎంఐలు సరిగా చెల్లించిన వివరాలు, ఆదాయ ధ్రువీకరణ, ఇతర కొన్ని పత్రాలు అందిస్తే చాలు. టాపప్‌ రుణం ఎంతివ్వాలన్నది ఆదాయం, గృహరుణం మొత్తం, తనఖా పెట్టిన ఆస్తి మార్కెట్‌ విలువ తదితరాలను బట్టి ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

This website uses cookies.