Categories: LATEST UPDATES

మౌలిక అభివృద్ధి మ‌హ‌త్యం

గ్రేటర్ హైదరాబాద్.. విశ్వ నగరం.. కోటి మందికి పైగా జనాభా.. దేశం నలువైపుల నుంచే కాకుండా.. విదేశీయులు సైతం నివాసం ఉండే సిటీ. ఒకప్పుడు అధ్వాన్నమైన రోడ్లు, ట్రాఫిక్ సమస్యతో సతమతమైన భాగ్యనగరం ఇప్పుడు అనూహ్యంగా అభివృద్ధి చెందుతోంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులతో గ్రేటర్ హైదరాబాద్ సమూల అభివృద్ది దిశగా అడుగులు వేస్తోంది. తల తల మెరిసే రోడ్లు, భారీ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, విశాలమైన జంక్షన్లు.. ఒక్కటేమిటీ.. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. తెలంగాణ సర్కార్ అభివృద్ది చేస్తున్న మౌలిక సదుపాయాల వ‌ల్ల‌.. అటు నగర శివారు ప్రాంతాలకు రవాణా సౌకర్యం, కనెక్టివిటీ పెరిగింది. దీంతో కాస్త దూరమైనా చౌక ధరలకు ఇల్లు కొనుగోలుదారులు కొంటున్నారు.

ప్రపంచ స్థాయిలో దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు.. ఇక్కడి ట్రాఫిక్‌, రోడ్ల తీరు ప్రభావం చూపుతాయని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. అందుకే రోడ్లను పూర్తిగా మార్చివేసేందుకు ప్రణాళికలు రచించి, వేగంగా కార్యాచరణ ప్రారంభించింది. హైదరాబాద్ మహానగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలపై కేసీఆర్ సర్కార్ దృష్టి సారించింది. గడిచిన ఏడేళ్లలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కోసం తెలంగాణ ప్రభుత్వం 67 వేల 35 కోట్ల మేర నిధులను ఖర్చు చేసింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే మౌలికవసతులు, సౌకర్యాల మెరుగుదల కోసం 32 వేల 532 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో దాదాపు 80 శాతం నిధులను ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, రోడ్లు, పేదలకు డబల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కోసం వినియోగించారు. రద్దీగా ఉండే ప్రధాన రహదారులు, వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు అధికంగా ఉన్న మార్గాలను ఎస్ఆర్డీపీ కింద ఎంపిక చేశారు. ఇందులో భాగంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, కూకట్‌పల్లి, బాచుపల్లి, పటాన్‌ చెరువు, ఆబిడ్స్, చార్మినార్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, శంషాబాద్ విమానాశ్రయం, ఉప్పల్, సికింద్రాబాద్, ఈసీఐఎల్, అల్వాల్, కొంపల్లి, జీడిమెట్ల తదితర ప్రాంతాలను అభివృద్ధి చేశారు. నిధుల లభ్యత, తక్కువ భూసేకరణ అవసరమైన కారిడార్లకు ప్రాధాన్యతనిస్తూ ఐదు దశల్లో జీహెచ్ఎంసీ అభివృద్ది పనులను చేపట్టింది.

గ్రేటర్ హైదరాబాద్ లో మౌలిక వసతుల మెరుగుదల, జీవన ప్రమాణాల పెంపే లక్ష్యంగా జీహెచ్ఎంసీ ద్వారా 32,532 కోట్లను అభివృద్ధి కోసం వెచ్చించారు. ఇందులో భాగంగా 46 ఫ్లైఓవర్లు, 7అండర్ పాస్లు, 4 ఆర్వోబీలు, 5 రోడ్డు అండర్ బ్రిడ్జ్లు, 46 జంక్షన్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సమగ్ర రహదారుల నిర్వహణ ప్రాజెక్టు క్రింద 1 వెయ్యి 839 కోట్లు కేటాయించి..709 కిలోమీటర్లు వాన నీటి డ్రెయిన్లను నిర్మించాలనే ఆలోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. జేబీఎస్ నుంచి తూంకుంట, నాగపూర్ హైవే పై కూడా ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం 5 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ, రాంనగర్ నుంచి బాగ్ లింగంపల్లికి 426 కోట్ల అంచనా వ్యయంతో రోడ్డు నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. నిర్వహణ పనులు కొనసాగుతున్నాయి. హైద‌రాబాద్‌లో ఇప్ప‌టికే 16 లింకు రోడ్ల‌ను పూర్తి చేయగా, త్వ‌ర‌లోనే మ‌రో 6 రోడ్లు పూర్తి కానున్నాయి.

హైద‌రాబాద్ లో పెరుగుతున్న జ‌నాభా, జ‌న సాంద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని ర‌హ‌దారుల‌ను అభివృద్ధి చేస్తోంది కేసీఆర్ సర్కార్. ద‌శ‌లవారీగా మొత్తం 133 లింకు రోడ్లు నిర్మించేందుకు మంత్రి కేటీఆర్ ప్రణాళికలు రూపొందించారు. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రధాన రహదారులకు కనెక్టివిటి పెంచడంతో పాటు రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించి ప్రయాణ దూరాన్ని, సమయాన్ని ఆదా చేసేందుకు 313.65 కోట్ల‌తో 22 లింకు రోడ్ల నిర్మాణం చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్న గ్రేటర్ హైదరాబాద్ లో దేశంలోని మరే మెట్రో నగరాల్లో లేనివిధంగా లింక్ రోడ్లను నిర్మిస్తున్నారు. నగరాభివృద్ధికి ర‌హ‌దారులు చాలా ముఖ్యమ‌ని, అభివృద్ది సూచికలుగా నిలిచే రహదారుల అభివృద్దిలో భాగంగా 6వేల కోట్ల వ్యయంతో ఎస్.ఆర్.డి.పి ప్రాజెక్ట్, 1800 కోట్ల వ్యయంతో సి.ఆర్.ఎం.పి ప్రాజెక్ట్ ల ద్వారా పలు రహదారుల అభివృద్ది, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

This website uses cookies.