Tripura Constructions Pre Launch Fraud?
హైదరాబాద్‌లో మరో ప్రీలాంచ్ మోసం వెలుగులోకి వచ్చింది. సుమారు మూడు వందల మంది ఇళ్ల కొనుగోలుదారులు, ఇన్వెస్టర్ల నుంచి త్రిపుర కన్‌స్ట్రక్షన్స్ అనే సంస్థ ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను విక్రయించిందని సమాచారం. కేవలం మూడు నుంచి ఆరు నెలల్లో హెచ్ఎండీఏ అనుమతి వస్తుందని చెబుతూ.. నాలుగేళ్లు పూర్తయినా ఇంతవరకూ అనుమతి రాలేదని బాధితులు వాపోతున్నారు. ఈ మేరకు సుమారు నలభై నుంచి యాభై మంది బయ్యర్లు.. మాదాపూర్‌లోని సంస్థ కార్యాలయం ముందు ఇటీవల మౌన ప్రదర్శన చేశారు. దీంతో, త్రిపుర కన్‌స్ట్రక్షన్స్ సంస్థ వీరి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫలితంగా, పోలీసులు వచ్చి హోమ్ బయ్యర్లను అక్కడ్నుంచి పంపించే ప్రయత్నం చేశారు. దీంతో వీరంతా సంస్థ కార్యాలయం లోపలికి చేరుకునే ప్రయత్నం చేయగా.. మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
* నాలుగేళ్ల నుంచి తమ వద్ద సొమ్ము తీసుకుని.. ప్రాజెక్టు గురించి చెప్పినమాటే చెబుతుండటంతో విసిగిపోయిన కొందరు కొనుగోలుదారులు.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌కు చేరుకుని.. తమ కష్టార్జితాన్ని వెనక్కి ఇవ్వమని డిమాండ్ చేశారు. దీంతో, సంస్థ ఎండీ పసుపులేటి సుధాకర్ కూడా లేకపోవడంతో సీఈవో మాత్రం ఏదో సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. ఇందులో కొందరు రిటైర్డ్ ఉద్యోగులు తమ పెన్షన్ సొమ్మును.. మరికొందరు మహిళలు తమ పొదుపు సొమ్మును.. ఇంకొందరు బంధుమిత్రుల వద్ద చేబుదులు తీసుకుని.. ఇంకొందరు పర్సనల్ లోన్ తీసుకుని మరీ.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌కు సొమ్ము చెల్లించారు. కానీ, నాలుగేళ్లయినా ప్రాజెక్టుకు పర్మిషన్ రాలేదు. వస్తుందో రాదో కూడా తెలియదు.
* మరి, ఇలాంటి మోసపూరిత సంస్థల్లో ఇన్వెస్ట్ చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనూ అనేకసార్లు తెలియజేసింది. టీజీ రెరా కూడా హెచ్చరిస్తూనే ఉంది. ఇక రియల్ ఎస్టేట్ గురు అయితే, ప్రీలాంచ్ మోసాలపై ముందునుంచి అప్రమత్తం చేస్తూనే ఉంది. అయితే, తక్కువకు ఫ్లాట్లు వస్తున్నాయనే ఆశతో చాలామంది త్రిపుర కన్‌స్ట్రక్షన్స్ వంటి మోసపూరిత సంస్థల్ని నమ్ముతూనే ఉన్నారు. సొమ్మంతా వారి చేతిలో పోస్తున్నారు. సకాలంలో ఫ్లాట్లు రాక మోసపోతున్నారు. మరి, ఈ త్రిపుర కన్‌స్ట్రక్షన్స్ ఇంత మంది బయ్యర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును ఏం చేసింది? ఆయా సొమ్మును తీసుకెళ్లి మరోచోట పెట్టుబడి పెట్టిందా? లేక సొంతంగా కార్లు, బంగళాలేమైనా కొనుగోలు చేసిందా? అనే విషయం తెలియాల్సి ఉంది.
This website uses cookies.