Categories: TOP STORIES

టీఎస్ రెరా కొత్త ఛైర్మ‌న్‌.. భువ‌న‌తేజ‌ ఎండీకి బుద్ధి చెప్పాలి

నా ద‌గ్గరైతే డ‌బ్బుల్లేవు..
మీరేం చేస్తారో చేసుకోండి..
మీరు ఎక్కువగా ర‌చ్చ చేస్తే..
వెంట‌నే బోర్డు తిప్పేస్తా..
క‌స్ట‌మ‌ర్లు రారు కాబ‌ట్టి..
మీకు ఒక్క పైసా రాదు..
మీరేం చేస్తారో చేసుకోండి

ఇలా కొనుగోలుదారుల‌ను బెదిరిస్తున్నాడు
భువ‌న‌తేజ ఇన్‌ఫ్రా ఎండీ చ‌క్కా సుబ్ర‌మ‌ణ్యం

మూడేళ్ల క్రితం.. త‌క్కువ రేటుకే ఫ్లాట్లు
అంటూ ప్రీలాంచ్ లో విక్ర‌యించాడు

అనుమ‌తులు రాక‌.. పనులు ఆరంభం కాక‌..
కొనుగోలుదారులు నిల‌దీస్తుంటే..
ఏం చేస్తారో చేసుకోండి.. త‌న వ‌ద్ద
సొమ్ము లేదంటూ బెదిరిస్తున్నాడు

అసలిలాంటి వ్య‌క్తుల్ని వ‌దల‌కూడ‌ద‌ని
ఈ సంస్థ భూముల్ని రెరా తీసుకుని..
వాటితో ప్ర‌జ‌ల‌కు న్యాయం చేయాల‌ని
బ‌య్య‌ర్లు ముక్త‌కంఠంతో కోరుతున్నారు

క‌రోనా స‌మ‌యంలో త‌న కొడుకు పేరిట భువ‌న‌తేజ ఇన్‌ఫ్రా అనే రియ‌ల్ సంస్థ‌ను ఆరంభించిన చ‌క్కా వెంక‌ట సుబ్ర‌మ‌ణ్యం.. కొనుగోలుదారుల‌ను ఎంతో న‌మ్మ‌కంగా బోల్తా కొట్టించాడు. మార్కెట్ రేటు కంటే త‌క్కువ రేటుకే ఫ్లాట్లు ఇస్తున్నామంటూ.. త‌నేదో గొప్ప స‌మాజ సేవ చేస్తున్న‌ట్లు ఫోజులు కొట్టాడు. ఇలా న‌గ‌రం న‌లువైపులా ప‌దికి పైగా అధిక ప్రాజెక్టుల్ని ఆరంభించి.. 11 ల‌క్ష‌ల్నుంచి 13 ల‌క్ష‌ల‌కే ఫ్లాట్ల‌ను విక్ర‌యించడం మొద‌లెట్టాడు. అనుమ‌తి రాగానే.. నిర్మాణ ప‌నుల్ని ఆరంభిస్తాన‌ని హామీ ఇచ్చాడు. దీంతో, వెయ్యికి పైగా కొనుగోలుదారులు సొంతింట్లోకి అడుగుపెట్టొచ్చ‌ని క‌ల‌లు క‌న్నారు. అయితే, మూడేళ్ల‌యినా అనుమ‌తులు రాలేదు.. నిర్మాణ ప‌నులు ఆరంభం కాలేదు. బ‌య్య‌ర్ల‌ను కాస్త మ‌చ్చిక చేసుకోవ‌డానికి కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాల్ని ప్రారంభించాడు.

అయితే, ఆ ప‌నులు నిలిచిపోవ‌డంతో బ‌య్య‌ర్లు భువ‌న‌తేజ ఇన్‌ఫ్రా య‌జ‌మాని మీద ఒత్తిడి తెస్తున్నారు. బ‌య్య‌ర్ల‌ సొమ్మును దారి మ‌ళ్లించిన సుబ్ర‌మ‌ణ్యం.. త‌న వ‌ద్ద సొమ్ము లేద‌ని చెప్ప‌డంతో ఏం చేయాలో అర్థం కావ‌ట్లేదు. కేవ‌లం హైద‌రాబాద్‌లోనే కాకుండా రాష్ట్రంలోని ఇత‌ర న‌గ‌రాల్లో సుబ్ర‌మ‌ణ్యం ప్రీలాంచుల్లో ఫ్లాట్ల‌ను విక్ర‌యించారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క అపార్టుమెంట్ కూడా క‌ట్టిన అనుభ‌వం లేని ఇత‌ని వ‌ద్ద ప్ర‌జ‌లూ పోటీప‌డి ఫ్లాట్ల‌ను కొనుగోలు చేశారు. ధ‌ర త‌క్కువ కావ‌డ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్పొచ్చు.

దాదాపు వెయ్యి మందికి పైగా బ‌య్య‌ర్ల నుంచి ల‌క్ష‌ల రూపాయ‌ల్ని వ‌సూలు చేసి.. అపార్టుమెంట్ల‌ను ఆరంభించ‌ని సుబ్ర‌మ‌ణ్యంపై రెరా కొత్త ఛైర్మ‌న్ క‌ఠిన చ‌ర్య‌ల్ని తీసుకోవాలి. త‌ను ఎక్క‌డెక్క‌డ అపార్టుమెంట్ల‌ను ఆరంభించాడు.. ఎంత‌మందికి ఫ్లాట్ల‌ను విక్ర‌యించాడు.. వారి నుంచి ఎంత సొమ్ము తీసుకున్నాడు.. ఎక్క‌డెక్క‌డ నిర్మాణాల్ని ఆరంభించాడు.. వాటికి అనుమ‌తులున్నాయా.. లేవా.. త‌దిత‌ర అంశాల్ని తెలంగాణ రెరా అథారిటీ కొత్త ఛైర్మ‌న్ స‌త్య‌నారాయ‌ణ వివ‌రాల్ని సేక‌రించాలి. ఈ సంస్థ వ‌ద్ద ఫ్లాట్ల‌ను కొన్న త‌మ‌కు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

This website uses cookies.