Categories: LATEST UPDATES

ఆఫీస్ లీజింగులో బెంగళూరు టాప్

  • సరఫరాలోనూ బెంగళూరుదే అగ్రస్థానం
  • గతేడాదితో పోలిస్తే దేశంలో తగ్గిన ఆఫీస్ లీజింగ్, సరఫరా
  • బలంగానే సంస్థాగత పెట్టుబడులు
  • 2023 క్యూ-1పై కొలియర్స్ నివేదికలో వెల్లడి

దేశంలోని ప్రధాన నగరాల్లో ఆఫీస్ లీజింగ్ అంశంలో బెంగళూరు టాప్ ప్లేస్ లో నిలిచింది. సరఫరాలోనూ బెంగళూరుదే అగ్రస్థానం కావడం విశేషం. వాస్తవానికి గతేడాదితో పోలిస్తే.. ఆఫీస్ లీజింగ్, సరఫరాలో క్షీణత నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పరిస్థితులే ఇందుకు కారణమని విశ్లేషిస్తున్నారు. 2023 క్యూ-1లో భారత రియల్ రంగానికి సంబంధించిన పలు అంశాలపై కొలియర్స్ ఇండియా నివేదిక విడుదల చేసింది. ముఖ్యాంశాలివీ..

ఆర్థిక అనిశ్చితి కారణంగా ఆఫీస్ మార్కెటింగ్ లీజింగ్ 2023 క్యూ1లో తగ్గిపోయింది. వార్షికంగా ఇది 19 శాతం 10.1 మిలియన్ చదరపు అడుగులకు తగ్గింది. అలాగే సరఫరా 9.5 మిలియన్ చదరపు అడుగులకు (34 శాతం) పడిపోయింది. ఇది 2022 క్యూ4 కంటే 4.6 శాతం తక్కువ.

  • ఇండస్ట్రియల్, వేర్ హౌసింగ్ డిమాండ్ 11.3 శాతం పెరిగి 7.2 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. ఢిల్లీ అత్యధికంగా 29 శాతం వాటా కలిగి ఉండగా.. ముంబై 25 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. త్రీ పీఎల్ ఆపరేటర్లు అత్యధికంగా 41 శాతం వాటా కలిగి ఉన్నారు. కాగా, సరఫరా మాత్రం 8 శాతం తగ్గింది.
  • సంస్థాగత పెట్టుబడులు బలంగానే ఉన్నాయి. 2023 క్యూ1లో 37 శాతం వృద్ధితో 7.1 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది భారత రియల్ రంగం ఆశాజనకంగా ఉంది అనడానికి నిదర్శనం. ఈ పెట్టుబడుల్లో ఆఫీస్ రంగానిదే అత్యధిక వాటా. మొత్తం పెట్టుబడుల్లో 55 శాతం ఆఫీస్ రంగానివే కావడం విశేషం.
  • ఇక భారత ఆఫీస్ రంగాన్ని చూస్తే.. 2023 క్యూ1లో లీజింగ్ కార్యకలాపాల్లో బెంగళూరు అత్యధికంగా 32 శాతం వాటా కలిగి ఉండగా.. తర్వాత ఢిల్లీ 22 శాతంతో రెండో స్థానంలో ఉంది.
  • 2023 క్యూ1లో ఆఫీస్ లీజింగ్ 10.1 మిలియన్ చదరపు అడుగులు జరగ్గా.. అందులో బెంగళూరులో 3.2 మిలియన్ చదరపు అడుగులు, ఢిల్లీలో 2.2 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ జరిగింది. ఆ తర్వాత చెన్నై (1.6 మిలియన్ చదరపు అడుగులు), హైదరాబాద్ (1.3 మిలియన్ చదరపు అడుగులు), ముంబై (1 మిలియన్ చదరపు అడుగులు), పుణె (0.8 మిలియన్ చదరపు అడుగులు) నిలిచాయి. సరఫరా విషయానికి వస్తే.. మొత్తంగా 9.5 మిలియన్ చదరపు అడుగుల సరఫరా ఉంది. ఇందులోనూ బెంగళూరే టాప్ లో ఉంది. ఇక్కడ 4 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ సరఫరా అయింది. తర్వాత 2.4 మిలియన్ చదరపు అడుగులతో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. ఢిల్లీ (1.3 మిలియన్ చదరపు అడుగులు), చెన్నై (0.8 మిలియన్ చదరపు అడుగులు), పుణె (0.6 మిలియన్ చదరపు అడుగులు), ముంబై (0.4 మిలియన్ చదరపు అడుగులు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
  • ఆఫీస్ అద్దెలను పరిశీలిస్తే.. సగటు అద్దె చదరపు అడుగుకు నెలకు రూ.95గా ఉంది. నగరాలవారీగా ఇది రకరకాలుగా ఉన్నాయి. ముంబైలో అత్యధికంగా ఇది రూ.140.5 ఉండగా.. ఢిల్లీలో రూ.93.3, బెంగళూరులో రూ.91.8, పుణెలో రూ.76.4, చెన్నైలో రూ.75.1, హైదరాబాద్ లో రూ.73.6గా ఉంది.
  • ఆఫీస్ స్పేస్ లీజింగ్ లో టెక్ సెక్టార్ 22 శాతంతో అగ్ర స్థానంలో ఉంది. ఫ్లెక్స్ ఆక్యుపయర్లు 2.1 మిలియన్ చదరపు అడుగులతో 20 శాతం వాటా కలిగి ఉన్నారు. అలాగే బీఎఫ్ఎస్ఐ ఆపరేటర్ల లీజింగ్ పెరిగి 14 శాతానికి చేరింది.
  • ఇండస్ట్రియల్ మార్కెట్ విషయానికి వస్తే… మొత్తం సరఫరా 8.1 శాతం తగ్గి 5.8 మిలియన్ చదరపు అడుగులకు తగ్గింది. అదే సమయంలో లీజింగ్ 11.3 శాతం పెరిగి 7.2 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. ఖాళీలు 1.7 శాతం తగ్గి 8.1 శాతానికి చేరాయి.
  • ఇండస్ట్రియల్ మార్కెట్లో నగరాలవారీగా లీజింగ్ వాటాను పరిశీలిస్తే..ఢిల్లీ 29 శాం, ముంబై 25 శాతం, పుణె 22 శాతం, చెన్నై 14 శాతం, బెంగళూరు 10 శాతంగా నమోదయ్యాయి. అలాగే సరఫరా విషయంలో పుణె 30 శాతం, ముంబై 22 శాతం, చెన్నై 21 శాతం, ఢిల్లీ 19 శాతం, బెంగళూరు 8 శాతంతో ఉన్నాయి.
  • సంస్థాగత పెట్టుబడులు 37 శాతం పెరిగి 1.7 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇందులో ఆఫీస్ సెక్టార్ 41 శాతం వృద్ధితో 0.9 మిలియన్ డాలర్లు, 100 శాతం పెరుగుదలతో నివాస రంగం 0.4 బిలియన్ డాలర్లు, 20 శాతం వృద్ధితో ఇండస్ట్రియల్ అండ్ వేర్ హౌసింగ్ 0.2 బిలియన్ డాలర్లు ఉన్నాయి.

This website uses cookies.