Categories: TOP STORIES

జేఎల్ఎల్‌పై రెరా చ‌ర్య‌లు తీసుకోవాలి!

  • ఢిల్లీ, ముంబైలో రెరా లేకుండా ప్రెస్టీజ్ ఫ్లాట్ల‌ను విక్ర‌యించ‌దు!
  • తెలంగాణ‌లో మాత్రం ఎందుకు ప్రీసేల్స్ చేస్తుంది?
  • ఇక్క‌డి ప్ర‌భుత్వం ప‌ట్టించుకోద‌ని భావిస్తున్నారా?
  • టీఎస్ రెరా అథారిటీ నిద్ర‌పోతుంద‌ని అనుకుంటున్నారా?
  • ఎంత‌టి బ‌డా బిల్డ‌ర్ అయినా ప్రీసేల్ చేస్తే కఠిన చ‌ర్య‌లు
JLL Selling flats in Prestige City without Rera

తెలంగాణ నిర్మాణ రంగాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించే సంస్థ‌ల్లో జోన్స్ లాంగ్ ల‌సాల్ వంటి సంస్థ‌లూ ఉన్నాయి. ముంబై, బెంగ‌ళూరు, ఢిల్లీలో ఎక్క‌డా ప్రీ సేల్స్ చేయ‌ని సంస్థ‌లు.. హైద‌రాబాద్‌కి రాగానే బ‌రితెగించి ప్రీలాంచుల్లో ఫ్లాట్ల‌ను అమ్ముతున్నాయి. బెంగ‌ళూరుకు చెందిన ప్రెస్టీజ్ ఎస్టేట్స్ అనే సంస్థ దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప్రెస్టీజ్ సిటీ పేరిట ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే బెంగ‌ళూరులో దాదాపు 180 ఎక‌రాల్లో చేప‌డుతోంది. ముంబై, ఢిల్లీలోనూ చేప‌ట్టింది. అయితే, ఆయా న‌గ‌రాల్లో రెరా అనుమ‌తి లేకుండా ఫ్లాట్ల‌ను విక్ర‌యించ‌ని ప్రెస్టీజ్ ఎస్టేట్స్‌.. హైద‌రాబాద్ వ‌చ్చేస‌రికి ప్రీ సేల్స్‌లో ఫ్లాట్ల‌ను ద‌ర్జాగా అమ్ముతోంది.

ఇందుకు ప్ర‌ధాన కార‌ణం.. జేఎల్ఎల్ వంటి సంస్థలే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. మాదాపూర్‌లోని సాలార్‌పూరియా స‌త్వా నాలెడ్జి పార్కులో ఆఫీసు గ‌ల జేఎల్ఎల్‌.. గురువారం జంకుబొంకు లేకుండా క‌స్ట‌మ‌ర్ల‌కు ఎక్స్‌ప్రెష‌న్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరిట‌ ప్రెస్టీజ్ సిటీలో ఫ్లాట్ల‌ను బుక్ చేసుకునేందుకు తొలుత రూ.5 ల‌క్ష‌లు చెల్లించ‌మంటోంది. ఈ మెయిల్ చూసిన రియ‌ల్ ఎస్టేట్ గురు ప్ర‌తినిధి.. ఆ మెయిల్‌లో పొందుప‌ర్చిన ఎగ్జిక్యూటివ్‌కు కాల్ చేస్తే.. పూర్తి వివ‌రాల్ని తెలియజేశాడు. అతనిచ్చిన స‌మాచారం ప్ర‌కారం ప్రెస్టీజ్ సిటీ ప్రీలాంచ్ సేల్స్ వివ‌రాలు ఇలా ఉన్నాయి.

రాజేంద్ర‌న‌గ‌ర్‌లోని అగ్రికల్చ‌ర‌ల్ యూనివ‌ర్శిటీ ప‌క్క‌నే సుమారు 100 ఎక‌రాల్లో ప్రెస్టీజ్ సంస్థ ప్రెస్టీజ్ సిటీ అనే ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందులో అపార్టుమెంట్లు, విల్లాలు, ఫోరం మాల్ వంటివి అభివృద్ధి చేస్తారు. 36 అంత‌స్తుల్లో ఐదు వేల ఫ్లాట్ల‌ను క‌డ‌తార‌ట‌. ప్ర‌స్తుతం రెరా అనుమ‌తి లేని ఈ ప్రాజెక్టును సెప్టెంబ‌రులో అధికారికంగా లాంచ్ చేస్తార‌ట‌. ఆ ఫ్లాట్ ధ‌ర ఎంతో అప్పుడే చెబుతార‌ట‌. ఇప్పుడు బుక్ చేసుకుంటే చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.6000 చొప్పున ఇస్తార‌ట‌. కానీ, లాంచ్ అయ్యేట‌ప్ప‌టికీ మాత్రం రూ.6500 నుంచి రూ.7000 మ‌ధ్య‌లో ధ‌ర ఉంటుంద‌ట‌.

ఇలా ఆశ చూపెట్టి కొనుగోలుదారుల్ని బుట్ట‌లో వేసుకునే ప్ర‌య‌త్నం ప్రెస్టీజ్ అనే సంస్థ చేయ‌డం దారుణ‌మైన విష‌యం. 700 నుంచి 1000 గ‌జాల విస్తీర్ణంలో విల్లాల్ని కూడా ఇందులో నిర్మిస్తున్నార‌ట‌. మ‌రి, తెలంగాణ అనేస‌రికి ఎందుకు ప‌క్క రాష్ట్రాల బిల్డ‌ర్ల‌కు చుల‌క‌న‌? ఇక్క‌డ ఫ్లాట్ల‌న‌యితే అమ్ముకోవ‌డానికి ఆస‌క్తి చూపిస్తారు. కానీ, ఇక్క‌డ రెరా నిబంధ‌న‌ల్ని ఎందుకు పాటించ‌రు? అంటే, ఇక్క‌డ తెలంగాణ రెరా అథారిటీ ఇలాంటి బ‌డా బిల్డ‌ర్ల జోలికి వెళ్ల‌దా? ఇలాంటి బ‌డా సంస్థ‌ల‌పై రెరా ఛైర్మ‌న్‌ ఎలాంటి చ‌ర్య‌ల్ని తీసుకోరా? ప్రెస్టీజ్ ఎస్టేట్స్ తో పాటు జేఎల్ఎల్ పై కూడా తెలంగాణ రెరా ఛైర్మ‌న్ జ‌రిమానా విధించాలి. మ‌రోసారి ఏ బ‌డా బిల్డ‌ర్ రెరా అనుమ‌తి లేకుండా ఫ్లాట్ల‌ను అమ్మే సాహ‌సం చేయ‌ని రీతిలో క‌ఠిన చ‌ర్య‌ల్ని తీసుకోవాల‌ని న‌గ‌ర నిర్మాణ రంగం కోరుతోంది. #JLL

This website uses cookies.