Categories: LATEST UPDATES

రెండు ఫ్లాట్లు.. రూ.170 కోట్లు

భారీ రియల్ లావాదేవీలకు వేదికగా నిలిచే ముంబైలో మరో ఖరీదైన డీల్ జరిగింది. ముంబై వర్లీ ప్రాంతంలోని ఓ విలాసవంతమైన సీ వ్యూ అపార్ట్ మెంట్లో రెండు ఫ్లాట్లు రూ.170 కోట్లకు అమ్ముడయ్యాయి. 360 వన్ అనే సంస్థ ఎండీ, సీఈఓ కరణ్ భగత్ ఆ రెండు ఫ్లాట్లను కొనుగోలు చేశారు.

అనిబీసెంట్ రోడ్డులోని 360 వెస్ట్ ప్రాజెక్టులో 45, 46 అంతస్తులో ఉన్న రెండు ఫ్లాట్లు కలిపి 12,900 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. అంటే చదరపు అడుగుకు రూ.1.31 లక్షల చొప్పున ధర పలికింది. దేశంలో ఇప్పటివరకు జరిగిన ఖరీదైన లావాదేవీల్లో ఒకటిగా ఇది నిలిచింది. ఇక ఒప్పందం కింద భగత్ కు ఎనిమిది కార్ పార్కింగ్ స్లాట్లు కూడా వస్తాయి. స్టాంపు డ్యూటీ కింద భగత్ రూ.6.44 కోట్లు చెల్లించారు. ఈనెల 28న ఈ రిజిస్ట్రేషన్ పూర్తయింది.

ముంబైలో ఒబెరాయ్ 360 వెస్ట్ అనే ప్రాజెక్టు అత్యంత ఖరీదైన ప్రాజెక్టుల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఇందులో 4 బీహెచ్ కే, 5 బీహెచ్ కే యూనిట్లు ఉన్నాయి. రెండు టవర్లుగా ఉన్న ఈ ప్రాజెక్టులో ఓ టవర్ లో రిట్జ్-కార్ల్ టన్ హోటల్ ఉండగా.. మరో టవర్ లో విలాసవంతమైన నివాసాలు ఉన్నాయి. సముద్రం కనిపించేలా నిర్మించిన ఈ టవర్ ఎత్తు 360 మీటర్లు ఉండగా.. అన్ని అపార్ట్ మెంట్లు వెస్ట్ ఫేసింగ్ ఉండటంతో ఈ ప్రాజెక్టుకు ఒబెరాయ్ 360 వెస్ట్ అని పేరు వచ్చింది.

This website uses cookies.