3.77 లక్షల యూనిట్లో టాప్ లో ముంబై
దేశంలో ఓ వైపు ఇళ్ల అమ్మకాలు బాగానే సాగుతుండగా.. మరోవైపు అమ్ముడుపోని గృహాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 10,36,860కి చేరింది. కరోనా ముందుతో పోలిస్తే ఇది 6.02 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఏడు ప్రధాన నగరాల్లో 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 3,77,152 అమ్ముడుపోని ఇళ్లతో ముంబై తొలి స్థానంలో ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (డిసెంబర్ 2019) ముగింపు నాటికి అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 9,77,993 ఉంది. తర్వాత కరోనా, లాక్ డౌన్ కారణంగా అమ్మకాలు, కొత్త లాంచ్ లపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 10 లక్షలు దాటింది. నగరాలవారీగా గణాంకాలు పరిశీలిస్తే.. కరోనా ముందు ముంబైలో 2,93,376 అమ్ముడుపోని ఇళ్లు ఉండగా.. 2023 మార్చి నాటికి 28.55 శాతం పెరిగి 3,77,152కి చేరాయి. హైదరాబాద్ మార్కెట్ అయితే గరిష్టంగా 105.24 శాతం పెరిగి 94,316 యూనిట్లకు చేరడం గమనార్హం. అహ్మాదాబాద్ లో అన్ సోల్డ్ ఇన్వెంటరీ 45.04 శాతం పెరిగింది.
ఇళ్లన్నీ అమ్ముడుపోవడానికి అత్యధికంగా చెన్నైకి 61 నెలలు, ముంబై (52), ఢిల్లీ (44), కోల్ కతా (39), అహ్మదాబాద్ (38), హైదరాబాద్ (31), పుణె (24), బెంగళూరుకు 22 నెలల సమయం అవసరం. కాగా, ఇలా యూనిట్లు కుప్పలుతెప్పలుగా పేరుకుపోవడానికి ప్రధాన కారణం కొత్త ప్రాజెక్టుల ప్రారంభమే. ఏటా చెన్నై (405శాతం), కోల్ కతా (102 శాతం), ఢిల్లీ (73 శాతం), బెంగళూరు (52 శాతం), పుణె (28 శాతం), ముంబై (11 శాతం), అమ్మదాబాద్ (10 శాతం), హైదరాబాద్ (6 శాతం) కొత్త లాంచ్ లు అవుతున్నాయి. మరోవైపు దేశంలోని 8 ప్రధాన నగరాలు కొత్త సరఫరాలో బలమైన వృద్ధి సాధించడం విశేషం. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.5 లక్షల కోట్ల విలువైన సరఫరాలు ప్రారంభమయ్యాయి. అమ్మకాలు కూడా వృద్ధిని కనబరుస్తూ.. రూ. 2.9 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
This website uses cookies.