గత వారం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసిన భువనతేజ ఇన్‌ఫ్రా కొనుగోలుదారులకు ఇచ్చిన హామీ ఏమిటో తెలుసా? తమ వద్ద ఫ్లాట్ కొంటే నిర్మాణం పూర్తయ్యేవరకూ అద్దె చెల్లిస్తానని మాటిచ్చాడు. ఒక నెల చెల్లించి తర్వాత ఇవ్వడం మానేశాడు. తాజాగా అలేఖ్య ఇన్‌ఫ్రా డెవలపర్స్ అనే సంస్థ బైబ్యాక్ ఆఫర్ అంటూ కొనుగోలుదారుల్ని బుట్టలో వేసుకునే ప్రయత్నం మొదలెట్టింది. ప్రతినెలా అద్దె చెల్లిస్తామని అంటోంది. మరి, ఇలాంటి కంపెనీల మాయమాటల్లో పడి.. కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టారంటే అంతే సంగతులు.
హైదరాబాద్‌లో కొందరు రియల్టర్లు నగదు కోసం ఎంత వెంపర్లాడుతున్నారంటే.. ఇష్టం వచ్చినట్లు కొనుగోలుదారులకు హామీలను గుప్పిస్తూ.. ముందు ఏదో రకంగా సొమ్ము వసూలు చేసే పనిలో పడ్డారు. ముందుగా సొమ్ము కట్టి స్థలం కొంటే చాలు.. ప్రతినెలా అద్దె చెల్లిస్తామని అంటున్నారు. అంతేనా.. కొన్నాళ్ల తర్వాత మళ్లీ తామే మళ్లీ కొంటామని హామీ ఇస్తున్నారు. ఈ రకంగా సామాన్య, మధ్యతరగతి ప్రజానీకానికి లేనిపోని ఆశలు కల్పిస్తూ.. వారి కష్టార్జితాన్ని దోచేసుకుంటున్నారు. డీటీసీపీ అనుమతి తీసుకోవట్లేదు.. రెరా అనుమతి తీసుకోవాలనే సంగతి వీరికి తెలుసో లేదో తెలియదు.
సదాశివపేట్ హైవే మీద నుంచి ఎన్‌కేపల్లి వైపు వెళితే.. వంద ఎకరాల్లో ఒక లేఅవుట్ వేస్తోందీ సంస్థ. అందులో ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ని ఆఫర్ చేస్తోంది. 121 గజాల ప్లాటును ఆరున్నర లక్షలు పెట్టొ కొంటే.. నెలకు పదిహేను వేలు చొప్పున అద్దె కూడా చెల్లిస్తుందట. ఇలా ముప్పయ్ నెలలు చెల్లించాక.. అవసరమైతే సంస్థే ప్లాటును బై బ్యాక్ చేస్తుందట. 26 లక్షలు పెట్టి 150 గజాలు కొంటే.. రెండున్నరేళ్ల పాటు నెలకు అరవై వేలు చొప్పున అద్దె కూడా ఇస్తారట. పైగా, నాలుగు గుంటలు స్థలం కూడా ష్యూరిటీ కింద రాసిస్తారట. ఇలాంటి మోసపూరిత సంస్థలు చెప్పే మాటల్ని ఎట్టి పరిస్థితిలో నమ్మకండి. మీ వద్ద సొమ్ము ఉంటే.. రెరా అనుమతి గల ప్లాట్లను కొనుగోలు చేయండి. లేకపోతే బ్యాంకులో డిపాజిట్ చేసుకోండి. తక్కువ వడ్డీ వచ్చినా మీ సొమ్ము సురక్షితంగా ఉంటుంది. లేకపోతే బంగారమైనా కొనుగోలు చేయండి. అంతేతప్ప, ఇలాంటి ప్రీలాంచులు, బైబ్యాక్ వంటి స్కీముల్ని నమ్మేసి గుడ్డిగా పెట్టుబడి పెట్టకండి.
This website uses cookies.