Categories: LATEST UPDATES

ఇళ్ల ధ‌ర‌లెలా ఉన్నాయ్‌?

సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అవును మరి ఏంపని చేసినా, పగలంతా ఎక్కడ తిరిగినా.. సాయంత్రం ఇంటికి చేరితే కలిగే సంతృప్తి సొంత ఇళ్లు ఉన్నవారికే తెలుస్తుంది. అందుకే చిన్నదో.. పెద్దదో తమకంటూ సొంతిల్లు ఉండాలని అంతా కోరుకుంటారు. ఎవరి బడ్జెట్ ను బట్టి వారు ఎక్కడో ఓ చోట సొంత ఇళ్లు కొనుక్కోవాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. మరి ప్రస్తుతం మన హైదరాబాద్ లో ఏయే ప్రాంతాల్లో ఇళ్ల ధరలు ఎంతమేర ఉన్నాయి, లో బడ్జెట్ నుంచి మొదలు హైరేంజ్ విల్లాల వరకు గృహాల ధరలెలా ఉన్నాయో తెలుసుకుందాము.

సొంతిల్లు ఉంటే ఆ ధీమానే వేరు. పేద వారి నుంచి పెద్ద వాళ్ల వరకు అంతా తమ తమ స్థాయిని బట్టి సొంతిళ్లు ఏర్పాటు చేసుకుంటారు. నిన్నటి వరకు అద్దెకు ఉన్నావాళ్లు సైతం ఇప్పుడు సొంతింటి కోసం ఆరాట పడుతున్నారు. ఎవరి స్థాయిని బట్టి, వారి బడ్జెట్ ను బట్టి ఎక్కడో ఓ చోటు సొంత ఇళ్లు కట్టుకోవాలని, లేదంటే కొనుక్కోవాలని చాలా మంది కోరుకుంటున్నారు. ప్రధానంగా హైదరాబాద్ లో సొంతిళ్లు ఏర్పాటు చేసుకోవాలని చాలా మంది కల. ఆ కలను నిజం చేసుకునేందుకు ఎవరిస్థాయివో వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు. హైదరాబాద్ లో ప్రాంతాన్ని బట్టి ఇళ్ల ధరల్లో భారీగా మార్పులు ఉన్నాయి. ముఖ్యంగా ఇంటి ఎంపికలో మౌళిక వసతులు, రవాణా సౌకర్యం. తాగు నీరు, భద్రత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.

హైదరాబాద్ లో ఇప్పుడు నగరం నడిబొడ్డుతో పాటు నగర శివార్లలోనూ మౌళిక వసతులు బాగా మెరుగయ్యాయి. దీంతో ఇళ్ల ధరలు దాదాపు అన్ని ప్రాంతాల్లోను క్రమంగా పెరుగుతున్నాయి. భాగ్యనగరంలో ప్రస్తుతం ఇంటి ధర కనిష్టంగా 45 లక్షల రూపాయలుండగా, గరిష్టంగా 25 కోట్ల రూపాయల విల్లాల వరకు అందుబాటులో ఉన్నాయి. ప్రాంతం, ఇంటి విస్తీర్ణాన్ని బట్టి ధరల్లో వ్యత్యాసాలున్నాయి. హైదరాబాద్ శివార్లలో తక్కువలో అంటే అపార్ట్ మెంట్స్ లో డబుల్ బెడ్ రూం ప్లాట్ ధర 45 లక్షలుగా ఉంది. షామీర్ పెట్, అల్వాల్, తారామతి పేట, బాచారం, ఘట్ కేసర్ వంటి ప్రాంతాల్లో అపార్ట్ మెంట్లలో డబుల్ బెడ్రూం ఫ్లాట్ 45 లక్షల్లో అందుబాటులో ఉండగా, అదే ట్రిపుల్ బెడ్ రూం 52 లక్షలుగా ఉంది. అంటే ప్రాంతం, ప్రాజెక్టు, విస్తీర్ణాన్ని బట్టి చదరపు అడుగు 3,400 రూపాయల నుంచి 7 వేల రూపాయలు ఉంది.

నగరానికి చేరువలో అయితే ఇంటి ధరలు మరి కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఉప్పల్, ఎల్బీనగర్, బీఎన్ రెడ్డి నగర్, నాగోల్, పటాన్ చెరు, శంషాబాద్, జీడిమెట్ల వంటి ప్రాంతాల్లో ఇంటి ధరలు ఓ మోస్తరుగా ఉన్నాయి. ఇక్కడ డబుల్ బెడ్ రూం ప్లాట్ ధర 62 లక్షలు, త్రిపుల్ బెడ్ రూం ధర 70 లక్షలుగా ఉంది. అంటే ప్రాంతం, ప్రాజెక్టును బట్టి చదరపు అడుగుకు 4వేల నుంచి 8,500 రూపాయల వరకు ఉంది. ఇక హైదరాబాద్ లో ఇప్పటికే అభివృద్ది చెందిన ప్రాంతాల్లో ఇంటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నగరం నడిబొడ్డున జూబ్లీహిల్స్, మాధాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, నల్లగండ్ల, మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి, కోకాపేట్, మోకిల వంటి ప్రాంతాల్లో ఇంటి ధరలు కోటి రూపాయల పైమాటే. ఇక్కడ చదరపు అడుగు 7,500 రూపాయల మొదలు 20 వేల వరకు ఉంది. అంటే ఈ ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు కొనాలంటే కనీసం 1 కోటి 20 లక్షల రూపాయలు కావాల్సిందే. అదే ప్రీమియం ప్రాజెక్టులో మంచి విస్తీర్ణంలో ఇక్కడ ఇల్లు కొనాలంటే కనీసం ౩ నుంచి 5 కోట్ల రూపాయాలు ఖర్చు చేయాలి.

గేటెడ్ కమ్యునిటీలో సౌకర్యాలను బట్టి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మాధాపూర్ వంటి ప్రాంతాల్లో నివాస ప్రాజెక్టు, సౌకర్యాలను బట్టి ఒక్కో ఫ్లాట్ ధర 3 నుంచి 12 కోట్ల రూపాయలు కూడా పలుకుతోంది. ఇక విల్లాల సంగతైతే చెప్పక్కర్లేదు. ప్రాంతం, విస్తీర్ణాన్ని బట్టి హైదరాబాద్ లో 5 కోట్ల రూపాయల నుంచి 25 కోట్ల రూపాయల వరకు విల్లాల ధరలున్నాయి. అదే నగర శివారు ప్రాంతాలు శంషాబాద్, కందుకూరు, మహేశ్వరం, మేడ్చల్, పటాన్ చెరు, బాచుపల్లి, ఘట్ కేసర్ వంటి ప్రాంతాల్లో 2.2 కోట్ల నుంచి విల్లా ధరలు మొదలవుతున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోను ఇప్పుడు స్టాండ్ లోన్ అపార్ట్ మెంట్స్ నిర్మాణం తగ్గుతోంది. చాలా వరకు గేటెడ్ కమ్యునిటీ, హైరైజ్ అపార్ట్ మెంట్స్ ప్రాజెక్టులే వస్తున్నాయి. దీంతో మధ్యతరగతి వారు ఇల్లు కొనుక్కోవాలంటే కనీసం 50 లక్షలు ఖర్చు చేయాల్సిందే. అదే కొంత సిటీ కి దగ్గరగా, అభివృద్ది చెందిన ప్రాంతంలో ఇల్లు కొనుక్కోవాలంటే 80 లక్షల నుంచి కోటి రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని రియల్ రంగ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

హైదరాబాద్ లో జనవరి నుంచి జులై వరకు మొదటి ఏడు నెలల కాలంలో వివిధ నిర్మాణ ప్రాజెక్టులను పరిశీలించి బేరీజు వేసుకున్నాక ఈ ఇళ్ల ధరలు ఇలా ఉన్నాయి. ప్రాంతాన్ని, ప్రాజెక్టును, సమయాన్ని బట్టి ఎప్పటికప్పుడు ఇళ్ల ధరలు మారిపోతుంటాయన్న సంగతి కొనుగోలు దారులు గుర్తు పెట్టుకోవాలి. ఇళ్ల కు ఏర్పడే డిమాండ్ తో పాటు భూముల ధరలు, స్టీల్, సిమెంట్ తో పాటు నిర్మాణ సంబందిత ముడి సరకుల ధరలకు అనుగుణంగా వచ్చే ఆరు నెల్లలో ఇళ్ల ధరలు 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశం ఉంటుందని రియాల్టీ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం కొంత మేర నెమ్మదించిన నేపధ్యంలో సొంతిల్లు కొనుక్కునేందుకు ఇదే సరైన సమయమని సూచిస్తున్నారు.

This website uses cookies.