గత నాలుగైదు ఏళ్లుగా ఎల్ఈడీ లైట్ల వాడకం విరివిగా పెరిగింది. ఇంట్లో షాండ్లీయర్లు, గోడలు, గేట్లు, వీధులు.. ఇలా ఈ బల్బులను వాడని చోటంటూ లేదు. సెన్సర్లు గల వీధి దీపాలూ మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో కొరియా, చైనా, జపాన్, తైవాన్ వంటి దేశాల్లో ఎల్ఈడీ లైట్లను భారీస్థాయిలో ఉత్పత్తి జరుగుతుంది. ఫిలిప్స్, బజాజ్, విప్రో, ఓస్రామ్, జాగ్వార్ వంటి సంస్థలు ఎల్ఈడీ బల్బులను మార్కెట్లో విక్రయిస్తున్నాయి. వీటిలో ఎల్ఈడీ డిజైనర్ల బల్బులూ మార్కెట్లో లభిస్తున్నాయి.
ఖర్చు ఎక్కువేం కాదు..
ఎల్ఈడీ లైట్ల కోసం ఖర్చెక్కువని చాలామంది అనుకుంటారు. అయితే, ఆరంభ పెట్టుబడి కాస్త ఎక్కువే అయినా.. వాటి వల్ల విద్యుత్తు బల్బులు గణనీయంగా తగ్గుతాయి. పైగా, అధిక వెలుతురు కోసం భారీ లైట్లను పెట్టక్కర్లేదు. కేవలం చిన్న చిన్న వాటితోనే ఇంటిని అందంగా ముస్తాబు చేసుకోవచ్చు. వీటి ప్రత్యేకత ఏమిటంటే.. ఒకసారి కొన్నాక నాలుగైదు సంవత్సరాలు వెనక్కి చూడక్కర్లేదు. ఎల్ఈడీల్లో రిఫ్లెక్టర్లు ఉండటం వల్ల అధిక కాంతి ప్రసరిస్తుంది.
మన గృహాల్లో వాడే ఎల్ఈడీ బల్బులు సాధారణంగా 20 వాట్ల దాకా లభిస్తాయి. వీటి ధర రకాలను బట్టి దాదాపు రూ.200 నుంచి రూ.7,000 దాకా ఉంటాయి. ఆఫీసులు, ఆస్పత్రుల్లో అయితే 24, 36, 48 వాట్లలో దొరుకుతాయి. దీనికోసం ఎంతలేదన్నా రూ.5000 నుంచి రూ.15,000 దాకా పెట్టాలి. వీధుల్లో అయితే 20, 40, 80 వాట్లవి పెట్టుకోవచ్చు. అవి దాదాపు రూ.4,000 నుంచి లభిస్తాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. సంస్థ, బ్రాండ్‌ను బట్టి ధరల్లో మార్పులుంటాయి. ఇంతకంటే తక్కువ ధరకు దొరికేవి మార్కెట్లో లభించొచ్చు. కాకపోతే, వాటి నాణ్యత గురించి ఒకటిరెండు సార్లు పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకోవాలి.
ఏ గది.. ఎంత సైజు?
ఇంట్లోని హాల్ సైజు పెద్దగా ఉంటుంది కాబట్టి.. 12 వాట్ల ఎల్ఈడీ బల్బులను బిగించుకోవచ్చు. సాధారణంగా ధర రూ.500 నుంచి ప్రారంభమవుతుంది. పేరున్న కంపెనీ తయారీ లైట్ల కోసం ఎంతలేదన్నా రూ.1200 దాకా పెట్టాల్సి ఉంటుంది. 15/10 లేదా 20/12 సైజున్న హాల్లో అయితే 12 వాట్లవి.. సుమారు ఎనిమిది బల్బులు పెట్టుకుంటే సరిపోతుంది.
పడక గదుల విస్తీర్ణం 10/10, 12/10, 14/10 లేదా 14/12 సైజుల్లో ఉంటాయి. ఇందులో 12 వాట్లవి బిగించుకుంటే సరిపోతుంది. గదికి నాలుగు చొప్పున లైట్లను ఏర్పాటు చేసుకుంటే.. సుమారు రూ.4,800 అవుతుంది. రెండు గదులుంటే ఖర్చు రెట్టింపు అవుతుంది.
వంట గదిలో వెలుతురు ఎక్కువ కావాల్సి ఉంటుంది. కాబట్టి, 15 వాట్లవి రెండు బిగించుకుంటే సరిపోతుంది. ఒక్కో బల్బు కోసం రూ.1200 చొప్పున లెక్కిస్తే.. రెండింటికి రూ.2,800 అవుతుంది.
బాత్ రూముల్లో 6 వాట్లు, వాష్ బేసిన్ వద్ద ఒక వాట్, ఎల్ఈడీ లైటును ఏర్పాటు చేసుకోవచ్చు.