Categories: EXCLUSIVE INTERVIEWS

జోరుగా పదకొండు ప్రాజెక్టులు

    • అప‌ర్ణా గ్రూప్ డైరెక్ట‌ర్ రాకేశ్ రెడ్డి

నిర్మాణ రంగం మీదే దృష్టి పెట్ట‌కుండా వేరే రంగంలోకి అడుగుపెట్ట‌డం వ‌ల్ల చైనాలో ఎవ‌ర్ గ్రాండ్ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంద‌ని అప‌ర్ణా గ్రూప్ డైరెక్ట‌ర్ రాకేశ్‌రెడ్డి తెలిపారు. శుక్ర‌వారం ఆయ‌న రియ‌ల్ ఎస్టేట్ గురుతో మాట్లాడుతూ.. చైనా ప్ర‌భుత్వం హ‌ఠాత్తుగా కొన్ని క‌ఠిన నిబంధ‌న‌ల్ని విధించ‌డం వ‌ల్లే ఈ స‌మ‌స్య వెలుగులోకి ఒక్క‌సారిగా వ‌చ్చింద‌న్నారు. సెప్టెంబ‌రులో బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌ల‌కు క‌ట్టాల్సిన వాయిదా సొమ్మును చెల్లించ‌డం లేద‌ని ఈ సంస్థ ప్ర‌క‌టించ‌డంతో ఒక్క‌సారిగా స్టాక్ మార్కెట్లు క‌కావిక‌లం అయ్యాయ‌ని తెలిపారు. మ‌న‌దేశంలో ఢిల్లీ, ఎన్‌సీఆర్ రీజియ‌న్‌లో కొన్ని బ‌డా నిర్మాణ సంస్థ‌లు ఇలాగే నిధుల్ని మ‌ళ్లించి కొనుగోలుదారుల్ని ఇబ్బంది పెట్టాయ‌ని గుర్తు చేశారు. ఇంకా ఆయ‌న ఏమ‌న్నారో రాకేశ్ రెడ్డి మాట‌ల్లోనే..

నిర్మాణ సంస్థ‌లు కొనుగోలుదారుల్ని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నందు వ‌ల్లే కేంద్ర ప్ర‌భుత్వం రెరా అథారిటీకి శ్రీకారం చుట్టింది. కానీ, రెరాను కూడా ప‌క్కన పెట్టేసి యూడీఎస్లో కొంద‌రు ప్లాట్లు, ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తున్నారు. అదృష్టం కొద్దీ హైద‌రాబాద్ మార్కెట్ మెరుగ్గా ఉండ‌టం వ‌ల్ల ప్ర‌స్తుతం ఇబ్బందులు ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ, ఒక్క‌సారి మార్కెట్ ప్ర‌తికూలంగా మారితే అంతిమంగా కొనుగోలుదారులు ఇబ్బంది ప‌డే ప్ర‌మాదముంది. కాబ‌ట్టి, సొంతిల్లు కొనుక్కునేవారు ఒక‌టికి రెండుసార్లు ఆలోచించి తుది నిర్ణ‌యం తీసుకుంటే ఉత్త‌మం. బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాల నిర్మాణంలో పెద్ద‌గా అనుభ‌వం లేనివారూ ఆకాశ‌హ‌ర్మ్యాల్ని క‌డ‌తామంటూ ముందుకొస్తున్నారు. పైగా, చ‌దర‌పు అడుక్కీ రూ.3500కే విక్ర‌యిస్తున్నారు. కానీ, ఆ సొమ్ము నిర్మాణ ప‌నుల‌కే స‌రిపోతుంద‌నే విష‌యం మ‌ర్చిపోవ‌ద్దు.

పదకొండు ప్రాజెక్టులు

2021 ప్రథమార్ధంలో అమ్మకాలు మరియు కొత్త లాంచ్‌లు పెరిగాయి. వ‌డ్డీ రేట్ల‌ను య‌ధాత‌థంగా కొన‌సాగించాల‌నే ఆర్‌బీఐ నిర్ణ‌యం వ‌ల్ల కొనుగోలుదారులు ఫ్లాట్ల‌ను కొన‌డానికి ముందుకొచ్చారు. తొలుత ముంబై, ఇటీవ‌ల కాలంలో క‌ర్ణాట‌క స్టాంప్ డ్యూటీ త‌గ్గించింది. తెలంగాణ ప్ర‌భుత్వం మౌలిక స‌దుపాయాల‌పై పెద్ద ఎత్తున దృష్టి సారించ‌డం, బ‌డా ఐటీ దిగ్గ‌జ సంస్థ‌లు న‌గ‌రంలో త‌మ కార్యాల‌యాల్ని ఏర్పాటు చేయాల‌నే నిర్ణ‌యాల్ని తీసుకోవ‌డం వంటి అంశాల వ‌ల్ల మ‌న నిర్మాణ రంగం అతిత‌క్కువ కాలంలోనే పుంజుకుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో మేం పదకొండు ప్రాజెక్టుల్ని నిర్మిస్తున్నాం. రెండు కోట్ల చదరపు అడుగుల కంటే అధిక విస్తీర్ణంలో వీటిని చేప‌డుతున్నాం. మార్కెట్ మెరుగ్గా ఉండ‌టం వ‌ల్ల అమ్మ‌కాలూ ఊపందుకున్నాయి. మౌలిక స‌దుపాయాలు, ఆధునిక సౌక‌ర్యాలున్న ప్లాట్ల‌ను కొనుగోలు చేసేందుకు గ‌త ఏడాది నుంచి కొనుగోలుదారులు ఆస‌క్తి చూపిస్తున్నారు. క‌రోనా నేప‌థ్యంలో కొనుగోలుదారుల ఆలోచ‌న‌ల్లో మార్పు వ‌చ్చింద‌న‌డానికిదే నిద‌ర్శ‌నం.

అపర్ణా ప్రస్తుత ప్రాజెక్టులివే..

నెం. ప్రాజెక్టు పేరు సంఖ్య బిల్టప్ ఏరియా (చ.అ.)
1 అపర్ణా కెనోపి ఎల్లోబెల్స్ 1050 1.6 మిలియన్
2 అపర్ణా సరోవర్ జైకన్ 3024 5.1 మిలియన్
3 అపర్ణా సెరినిటీ 1499 2.6 మిలియన్
4 అపర్ణా కెనోపి మ్యారీగోల్డ్ 1320 2.1 మిలియన్
5 అపర్ణా సైబర్ స్పేస్ 612 1 మిలియన్
6 అపర్ణా లగ్జర్ పార్క్ 414 1 మిలియన్
7 అపర్ణా వన్ 462 1.7 మిలియన్
8 అపర్ణా ఆల్టియస్ 253 0.4 మిలియన్
9 అపర్ణా మ్యాపుల్ 246 0.3 మిలియన్
10 అపర్ణా సరోవర్ జెనిత్ 2475 4.3 మిలియన్
11 అపర్ణా అమరావతి వన్ 612 1.1 మిలియన్

This website uses cookies.