- కోకాపేట్‌లో కొత్త ప్రాజెక్టును లాంచ్
చేసేందుకు సన్నాహాలు?
- పేరు.. మై హోమ్ నిషధ?
- 16 ఎకరాల్లో హై ఎండ్ ప్రాజెక్టు
- సుమారు 1600 ఫ్లాట్ల నిర్మాణం
- బయ్యర్లలో నెలకొన్న ఆసక్తి!
దాదాపు పదిహేనేళ్ల క్రితం మాదాపూర్‌లోని హైటెక్ సిటీలో.. నవద్వీప లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీతో.. నగర నిర్మాణ రంగంలో మై హోమ్ సరికొత్త ట్రెండ్ సృష్టించింది. సైబర్ టవర్స్.. దాని పక్కన మై హోమ్ నవద్వీప.. ఈ రెండే అప్పట్లో ఆకర్షణీయంగా కనిపించేవి. తాజాగా హైటెక్ సిటీ ఫేజ్-2గా భావిస్తున్న కోకాపేట్‌లోనూ మైహోమ్ సరికొత్త లగ్జరీ ప్రాజెక్టును డిజైన్ చేస్తోందని సమాచారం. దీనికి మై హోమ్ నిషధ అని పేరు పెట్టారని తెలిసింది. రాయదుర్గంలోని మై హోమ్ భూజా తరహాలో.. కోకాపేట్‌లోనూ అత్యాధునిక లగ్జరీ ప్రాజెక్టును నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అంతా సవ్యంగా సాగితే, దసరా తర్వాత ఈ సరికొత్త ప్రాజెక్టును ఆరంభించేందుకు అవకాశాలున్నాయని తెలిసింది.
ఇటీవల హెచ్ఎండీఏ నిర్వహించిన వేలం పాటలో మై హోమ్ సంస్థ దక్కించుకున్న స్థలంలో.. సుమారు 49 అంతస్తుల ప్రాజెక్టును నిర్మిస్తోందని రియల్ ఎస్టేట్ గురుకి సమాచారం అందింది. దాదాపు 16.6 ఎకరాల విస్తీర్ణంలో.. పదహారు వందల దాకా ఫ్లాట్లను నిర్మిస్తారని తెలిసింది. మై హోమ్ సంస్థ ఇప్పటివరకూ డెవలప్ చేసిన ఎలివేషన్ల కంటే.. మై హోమ్ నిషధ ఎలివేషన్ భిన్నంగా, వైవిధ్యంగా దర్శనమిస్తోంది. కొత్తదనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో పాటు కోకాపేట్‌లోనే మై హోమ్ సంస్థ మరో హై రైజ్ ప్రాజెక్టును నిర్మించేందుకు ప్రణాళికల్ని రచిస్తుందని సమాచారం. మొత్తానికి, ఈ రెండు ప్రాజెక్టులను అధికారికంగా ఆరంభిస్తే.. బయ్యర్లకు పెద్ద పండగేనని చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ కంపెనీ వద్ద ఫ్లాటు కొంటే.. డెలివరీ పక్కా అనే నమ్మకం కొనుగోలుదారుల్లో ఏర్పడింది. మొత్తానికి, ఈసారి ఫెస్టివల్ సీజన్‌లో బయ్యర్లకు సరికొత్త గిఫ్టును అందించడానికి మైహోమ్ సమాయత్తం అవుతోందని చెప్పొచ్చు.