రెసిడెన్షియల్ భవనాల పై అంతస్తు యజమానులకు అనుకూలంగా తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఈడీఎంసీ) ఒక కొత్త విధానం తీసుకొచ్చింది. పై అంతస్తుల యజమానులు ఇతర ఫ్లోర్ల యజమానులతో సంబంధం లేకుండా టెర్రస్ పై నిర్మాణాలకు అనుమతి పొందవచ్చని పేర్కొంది. ఈ విషయాన్ని ఈడీఎంసీ మేయర్ శ్యామ్ సుందర్ అగర్వాల్ వెల్లడించారు. రెగ్యులర్, రెగ్యులరైజ్ అయిన అక్రమ కాలనీల్లోని భవనాలకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. కింది అంతస్తుల ఓనర్లు పై అంతస్తుల యజమానులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, కొందరు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వందలాది ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.
రెగ్యులర్, రెగ్యులరైజ్ అయిన కాలనీల్లోని రెసిడెన్షియల్ భవనాలకు సంబంధించి టెర్రస్ పై యాజమాన్య హక్కులు పై అంతస్తువారికి మాత్రమే ఉంటాయని అగర్వాల్ స్పష్టంచేశారు. ‘ఇప్పటివరకు పై అంతస్తు యజమానులు కొత్తగా మరో అంతస్తు నిర్మించాలంటే, కింది అంతస్తుల యజమానుల నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) సమర్పించాల్సి వచ్చేది. అయితే, ఇది అక్రమాలకు తావివ్వడంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని వివరించారు. ప్రస్తుతం పై అంతస్తు యాజమానులు నిర్దేశిత ఎత్తు 15 మీటర్ల లోపు టెర్రస్ పై నిర్మాణం చేయాలనుకుంటే కింది అంతస్తుల యజమానులతో సంబంధం లేకుండానే అనుమతి పొందవచ్చని చెప్పారు. అయితే, కింది అంతస్తుల యజమానులకు అందే సేవలకు ఈ కారణంగా విఘాతం కలగకూడదని పేర్కొన్నారు.
This website uses cookies.