who will help buyers to get back money from sahiti?
రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో.. సాహితీ సంస్థ స్కామ్ తమ మెడకు చుట్టుకుంటుందనే ఉద్దేశ్యంతో.. ప్రభుత్వం కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. ఎట్టకేలకు సాహితీ ఇన్‌ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను అరెస్టుకు పచ్చ జెండా ఊపింది. ఇంతవరకూ బాగానే ఉంది. ఆయన అరెస్టు కావడంతో కొన్ని వర్గాలు శాంతించాయి. మరికొందరు సంబుర పడ్డారు. కానీ, తమ కష్టార్జితాన్ని సాహితీ సంస్థలో పోసిన కొనుగోలుదారుల పరిస్థితి ఏమిటి? 2500 మంది నుంచి ఈ సంస్థ ఎండీ రూ.900 కోట్లు వసూలు చేశాడని పోలీసులు అధికారికంగా అంటున్నారు. మరి, వీరికి సొమ్ము వెనక్కి ఇప్పించే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుందా? లేక కేసులు పెట్టి జైలుకు పంపించి చేతులు దులిపేసుకుంటుందా? ఒకవేళ, అలా చేస్తే ప్రభుత్వం అప్రతిష్ఠపాలయ్యే ప్రమాదముంది. సుమారు 2500 మంది కొనుగోలుదారులకు సొమ్ము వెనక్కి ఇప్పించేందుకు ప్రభుత్వం ఏం చేయాలంటే..
* సాహితీ సంస్థలో సొమ్ము పెట్టి మోసపోయిన వారికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలి. సత్యం స్కామును పరిష్కరించేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరిగా.. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక నిపుణుల బృందాన్ని నియమించాలి.
* ఈ బృందం సాహితీ సంస్థకు సొమ్ము కట్టిన వారి పూర్తి వివరాల్ని సేకరించాలి.
* మొత్తం ఎంతమందికి సొమ్ము చెల్లించాల్సి ఉంటుందో ఆరా తీయాలి.
* ఏయే ప్రాజెక్టుల్లో ఎంతెంత మంది ఫ్లాట్లు కొన్నారో తెలుసుకోవాలి.
* ఆయా ప్రాజెక్టులు ప్రస్తుత నిర్మాణ స్థాయిని అంచనా వేయాలి. అవి పూర్తి కావాలంటే ఇంకా ఎంత కాలం పడుతుంది? ఇందుకోసం అయ్యే ఖర్చెంత? అమ్ముడు కాకుండా మిగిలిన ఫ్లాట్లు ఎన్ని? వాటిని విక్రయించడం ద్వారా వచ్చే సొమ్ముతో ఆయా ప్రాజెక్టును పూర్తి చేయవచ్చా? ఇప్పటికే అడ్వాన్సులు ఇచ్చినవారిలో ఇంకా ఎంతమంది బకాయిలు చెల్లించాలో తెలుసుకోవాలి. ప్రత్యేకంగా ఒక ఎస్క్రో ఖాతాను ఆరంభించి.. ఆయా నిర్మాణాన్ని వేరే బిల్డర్ లేదా కాంట్రాక్టరుకు అప్పగించి పూర్తి చేసే బాధ్యతను అప్పగించాలి. ఆయా ప్రాజెక్టులో ఏమైనా అదనపు సొమ్ము వస్తే.. ఆయా సొమ్ముతో మిగతా ప్రాజెక్టులను పూర్తి చేయడానికి వినియోగించాలి.
* ఇలా, సాహితీ సంస్థ ఆరంభించిన ప్రాజెక్టులన్నింటినీ పక్కాగా గమనించి.. వాటి తాజా స్థితిగతిని అంచనా వేసి.. ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి.. సాహితీ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. లేకపోతే, రానున్న రోజుల్లో ఈ అంశం ప్రభుత్వానికి తలనొప్పిగా పరిణమించే ప్రమాదముంది.
* ఇందులో ఫ్లాట్లు కొని మోసపోయినవారే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమిప్పే అవకాశం లేకపోలేదు. అలా జరగకుండా ఉండాలంటే, ప్రభుత్వమే బాధితులకు అండగా నిలవాలి. వారి సొమ్మును అయినా ఇప్పించాలి. లేక ఫ్లాట్లను కట్టించి ఇవ్వాలి.
This website uses cookies.