ఇంటి నిర్మాణంలో ఇటుకలదీ కీలకపాత్రే. సాధారణంగా గోడలకు ఎర్ర ఇటుకలే వాడతారు. అయితే, కాలక్రమేణా వస్తున్న మార్పులతో ఇటుకల వినియోగంలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. ఎర్ర ఇటుకల స్థానంలో సిమెంట్ బ్రిక్స్ వచ్చి చేరాయి. వీటినే ఏఏసీ (ఆటో క్లేవ్డ్ ఏరేటడ్ కాంక్రీట్) బ్లాక్స్ అంటారు. వీటిని సిమెంట్, ఫ్లై యాష్, లైమ్, నీటిని వినియోగించి తయారు చేస్తారు.
సాధారణ ఎర్రటి ఇటుకల కంటే వీటి పరిమాణం ఎనిమిది రెట్లు ఎక్కువ. చాలా సులభంగా వీటిని హ్యాండిల్ చేయొచ్చు. పైగా ఎర్రటి ఇటుకల కంటే చాలా తక్కువ సరిపోతాయి. దీనివల్ల ఆ మేకు జాయింట్స్ కూడా తగ్గుతాయి. ఇది నిర్మాణం మరింత నాణ్యతతో ఉండేందుకు ఉపయోగపడుతుంది. పరిమాణంలో పెద్దగా ఉన్నప్పటికీ, చాలా తక్కువ బరువు ఉంటుంది. దీంతో భవనం పునాదులపై తక్కువ భారం పడుతుంది. భూకంపాల వంటి విపత్తుల సమయంలో కూడా ఇవి అంతగా చెక్కుచెదరవు. ఇక ఏఏసీ బ్లాకులు పర్యావరణ అనుకూలమైనవే కాకుండా.. దీని ఉత్పత్తి సమయంలో వృథా అయ్యే మెటీరియల్ చాలా తక్కువగా ఉంటుంది. పైగా సాధారణ ఇటుకల కంటే ఇవి ధృఢంగా ఉంటాయి. లోడ్ బేరింగ్, నాన్ లోడ్ బేరింగ్ గోడలతోపాటు పార్టిషన్లకు కూడా వీటిని వినియోగించవచ్చు. బరువు తక్కువగా ఉండటం వల్ల వీటి రవాణా కూడా సులభమే. ఇంకా ఏఏసీ బ్లాకులు వాతావరణం నుంచి చాలా తక్కువ వేడిని గ్రహిస్తాయి. దీంతో లోపలి ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా.. మనకు కావాల్సినట్టుగా ఉంటాయి. వీటిని అమర్చడం చాలా తేలిక. వీటి వినియోగం వల్ల కార్పెట్ ఏరియా కూడా పెరుగుతుంది. సిమెంట్ ఇటుకల వినియోగం వల్ల ఏసీ వాడకం తగ్గుతుంది. ఫలితంగా విద్యుత్ ఆదా అవుతుంది. ఏఏసీ బ్లాకులకు క్యూరింగ్ అవసరంలేదు. అందువల్ల బోలెడంత నీరు ఆదా చేయొచ్చు. ఈ కారణాలతోనే బిల్డర్లు సాధారణ ఇటుకల కంటే ఏఏసీ బ్లాకుల వైపు మొగ్గు చూపిస్తున్నారు.
This website uses cookies.