Categories: TOP STORIES

ఎల్ఆర్ఎస్‌.. ఎందుకు ఫెయిల్‌?

  • మున్సిప‌ల్‌ ముఖ్య కార్య‌ద‌ర్శి చెప్పినా
  • ప‌ని చేయ‌ని కింది స్థాయి సిబ్బంది
  • ఎల్ఆర్ఎస్‌కు క‌ల్పించ‌ని ప్ర‌చారం
  • త‌లెత్తుతున్న సాంకేతిక స‌మ‌స్య‌లు

ప్ర‌భుత్వం ఎల్ఆర్ఎస్ ప్ర‌క‌టిస్తే చాలు.. ప్ర‌జ‌లెంతో ఉత్సాహంగా ముందుకొచ్చి ప్లాట్ల‌ను రెగ్యుల‌రైజ్ చేయించుకుంటారు. కానీ, కాంగ్రెస్ హ‌యంలో ఇందుకు భిన్న‌మైన ప‌రిస్థితి. ఎల్ఆర్ఎస్ ప్ర‌క్రియ‌పై త‌గినంత ప్ర‌చారం క‌ల్పించ‌డంలో పుర‌పాల‌క శాఖ విఫ‌ల‌మైంది. సాంకేతిక స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. ఫీజు క‌ట్టినా వెంట‌నే ప్రొసిడీంగ్స్ ఇవ్వని దుస్థితి. మార్చి 31లోపు వంద శాతం పురోగ‌తి సాధించాల‌ని పుర‌పాల‌క శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి దాన‌కిశోర్ ఆదేశాలిచ్చినా.. క్షేత్ర స్థాయిలో మాత్రం ఫైళ్లు క‌ద‌ల‌ట్లేదు. ఏమిటీ దుస్థితి?

ఎల్ఆర్ఎస్ కు సంబంధించిన మొత్తం 25.68 లక్షల దరఖాస్తుల్లో నిషేధిత భూముల పరిధిలో 2.50 లక్షల అప్లికేషన్లు, జల వనరులకు ఆనుకుని ఉన్న వాటికి సంబంధించి 1.60 లక్షల దరఖాస్తులు, ఇతర సాంకేతిక కారణాలతో మరికొన్ని కలిపి సుమారు 5 లక్షలకు పైగా దరఖాస్తులను అధికారులు పెండింగ్‌లో పెట్టారు. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాలని లేఖలు పంపిన 20 లక్షల దరఖాస్తుల్లో 30 శాతం మంది ఈ నెలాఖరులోగా ముందుకు వస్తారని అధికారులు అంచనా వేశారు. కానీ, అనుకున్నంత మేర స్పందన రావడం లేదు. పది రోజుల వ్యవధిలో ప్రొసీడింగ్స్‌ ఇస్తామని ప్రభుత్వం చెప్పినా.. ప్రొసీడింగ్స్ జనరేట్ అవ్వట్లేదు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో తలెత్తుతున్న సమస్యలపై స్పష్టత ఇవ్వాల్సిన అధికారులు.. తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తుండటంతో.. దరఖాస్తుదారులు డైలమాలో పడిపోతున్నారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ వంద శాతం పురోగతి సాధించాలని పుర‌పాల‌క‌ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌ నిర్వహించిన కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో స్పష్టం చేశారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ద‌రఖాస్తుదారులకు తలెత్తుతున్న సందేహాలను, ఇబ్బందులను పరిష్కరించే ప్రత్యేకమైన వ్యవస్థ లేకపోవడంతో.. ఎల్ఆర్ఎస్ ప్రక్రియ అనుకున్నంతమేర ముందుకు సాగడం లేదు. ఎల్ఆర్ఎస్ ద్వారా 8,800 కోట్ల ఆదాయాన్ని రాబట్టాలని ప్ర‌భుత్వ ల‌క్ష్యం. ఇప్పటివరకు వ‌చ్చింది రూ. 800 కోట్లే.

This website uses cookies.