ప్రతి మనిషికి తిండి, బట్ట, గూడు అవసరమైన విషయం తెలిసిందే. ఇందుకోసం పంటను పండించే రైతులకు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు తోడ్పాటును అందిస్తాయి. బట్టను అందించే పరిశ్రమలు, సంస్థలకు సాయం అందిస్తూనే ఉంటాయి. కానీ, గూడును కల్పించే నిర్మాణ సంస్థలంటే వివక్ష. ఎందుకో అర్థం కాదు. గత పదేళ్ల నుంచి గమనిస్తే.. ఒకట్రెండు సార్లు మినహా కేంద్ర బడ్జెట్లో ఎప్పుడూ మొండి చెయ్యి చూపిస్తారు. మన దేశంలో వ్యవసాయం తర్వాత అధిక శాతం మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని కల్పించే నిర్మాణ రంగమంటే కేంద్రానికి ఎందుకు చిన్నచూపు? దేశ జీడీపీలో వ్యవసాయం తర్వాత అధిక శాతం వాటాను అందించే రియల్ రంగం పట్ల ప్రభుత్వాలకు ఎందుకీ వివక్ష? ఇంతకీ రంగం చేసిన తప్పేంటి?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో.. హౌసింగ్ బోర్డు అల్పాదాయ, నిరుపేద, మధ్యతరగతి ప్రజానీకం కోసం అందుబాటు ధరలో ఇళ్లను కట్టించేది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పని చేసే ఉద్యోగుల ఆర్థిక స్థోమతను బట్టి ఇళ్ల ధరలను నిర్ణయించేవి. కానీ, ఇప్పుడా పరిస్థితి ఎక్కడుంది? గత ప్రభుత్వాల పుణ్యమా అంటూ హౌసింగ్ బోర్డు నిర్వీర్యమైంది. బిల్డర్లు అధిక ధరకు ఫ్లాట్లను విక్రయిస్తున్నారని రాజీవ్ స్వగృహను ఏర్పాటు చేసి.. పలు ప్రాంతాల్లో అపార్టుమెంట్లను నిర్మించారు.
ఆ తర్వాత ఆ ఫ్లాట్ల నిర్మాణం అటకెక్కింది. దాదాపు దశాబ్దం తర్వాత కూడా వాటిలోకి మధ్యతరగతి ప్రజానీకం ధైర్యంగా కొనుక్కోని గృహప్రవేశం చేయలేని దుస్థితి నెలకొంది. పోనీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మధ్యతరగతి ప్రజల కోసం ప్రభుత్వం ఇళ్లను నిర్మించిందా? అంటే అదీ లేదు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా హెచ్ఎండీఏతో వేలంలో ప్లాట్లను విక్రయిస్తోంది. దీని వల్ల ప్రస్తుత తరమే కాదు.. భవిష్యత్తు తరాలూ కొనుక్కోలేని స్థితికి ఇళ్ల ధరలు చేరుకున్నాయి.
ఆ వేలంలో అమ్ముడైన ధర ఆయా ప్రాంతాల్లో ప్రామాణికంగా మారిపోతుంది. ఫలితంగా, మధ్యతరగతి ప్రజానీకం అసలు సొంతిల్లు కొనుక్కోలేని దుస్థితి ఏర్పడుతోంది. ఒకప్పుడు సిటీ సెంటర్లో ఫ్లాటు ధర ఎక్కువుంటే, శివారు ప్రాంతాల్లో ఫ్లాట్ల ధరలు తక్కువుండేవి. కానీ, ఇప్పుడా వ్యత్యాసం భూతద్ధం వేసి వెతికినా కనిపించట్లేదు. కోకాపేట్లో అయినా చదరపు అడుక్కీ రూ.7000 చెబుతున్నారు.. ఎల్‌బీనగర్లోనూ అంతే రేటు అంటున్నారు. అంతెందుకు ఉప్పల్‌లో అయినా ఇంతే ధర పలుకుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో చదరపు అడుక్కీ ఎంతలేదన్నా రూ.15,000కి అటుఇటుగా చెబుతున్నారు. గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో అయితే పది నుంచి పన్నెండు వేలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యుల సొంతింటి కల ఎలా తీరుతుంది?
హౌసింగ్ బోర్డు నిర్వీర్యమైంది. రాజీవ్ స్వగృహ కొత్తగా కడుతుందేమీ లేదు. ఉన్న హెచ్ఎండీఏ కాస్త ప్లాట్లను అమ్ముతోంది. మరి, ప్రభుత్వ సంస్థలు ఇలాగుంటే.. మధ్యతరగతి ప్రజానీకానికి సొంతిల్లును అందించేది ఎవరు? ఎప్పటికైనా ప్రైవేటు బిల్డర్లు నిర్మించక తప్పదు కదా! అలాంటప్పుడు, రియల్ రంగాన్ని ప్రోత్సహించడం మానేసి.. నియంత్రణ ఎందుకు విధిస్తున్నారు? అనుమతుల్లో ఆలస్యం ఎందుకు జరుగుతోంది? సింగిల్ విండోను ఆరంభించమంటే ఎందుకు పట్టించుకోవట్లేదు? ఉత్తర భారతదేశంలో డెవలపర్లు కొనుగోలుదారుల్ని మోసం చేశారని రెరా చట్టాన్ని ఆరంభించారు. కానీ, మన వద్ద అలాంటి సంస్కృతి లేదు కదా? పోనీ, రెరా చట్టం అందుబాటులోకి వచ్చిన తర్వాత అయినా, ప్రీలాంచుల్ని నిరోధించాలి కదా.. కానీ, అది కూడా జరగలేదే.. పైగా, ముక్కూమోహం లేని వాళ్లు నిర్మాణ రంగంలోకి ప్రవేశించి కోట్లు కొల్లగొడుతున్నారు. వీరిని అయినా నియంత్రించి.. నిబంధనల ప్రకారం కట్టేవారిని ప్రభుత్వం ప్రోత్సహించాలి కదా!
రాష్ట్రంలో మధ్యతరగతి ప్రజానీకం సొంతింటి కలను తీర్చేది ప్రైవేటు బిల్డర్లే. కాబట్టి, ప్రజకు నామమాత్రపు ధరకే ఫ్లాట్లను అందించాలంటే.. స్థలాన్ని పీపీపీ విధానంలో నిర్మాణ సంస్థలకు అందజేయాలి. ఇలా చేస్తేనే అపార్టుమెంట్ల ధర గణనీయంగా తగ్గుతుంది. లేదా అందుబాటు ధరలో ఇళ్లను కట్టే బిల్డర్లకు ప్రత్యేక ప్రోత్సాహాకాల్ని అయినా అందించాలి. అప్పుడే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల సొంతింటి కల సాకారం అవుతుంది.
This website uses cookies.