తెలంగాణలో లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ నత్త నడకన సాగుతోంది. ప్రత్యేక రాయితీ కోసం ప్రభుత్వం నెల రోజులు గడువు పెంచినా స్పందన కరువైంది. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు గత నెల 31నే గడువు ముగిసినా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వచ్చిన ధరఖాస్తుల్లో 10 శాతం మంది కూడా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించకపోవడం, సాంకేతిక సమస్యల కారణంగా మరో నెల పాటు పొడిగించారు. అయినప్పటికీ ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలు అయిన అప్లికేషన్లలో కేవలం 10 శాతం మాత్రమే క్లియర్ అయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీనిపై రేవంత్ సర్కార్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో ఏళ్ల తరబడి ఎదురు చూపుల తరువాత లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ను అమలు చేస్తోంది ప్రభుత్వం. గత నెల మార్చి 31 వరకు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన ధరఖాస్తుదారులకు 25 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఆఫర్ ప్రకటించింది రేవంత్ సర్కార్. అయితే ఎల్ఆర్ఎస్ స్కీమ్ కు పెద్దగా స్పందన రావడం లేదు. దీంతో మరో నెల రోజుల పాటు రాయితీ ఆఫర్ ను పొడిగించి ఏప్రిల్ 30 వరకు గడువు ఇచ్చింది. అయినప్పటికీ మొత్తం ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లలో 10 శాతం మంది కూడా ఫీజు చెల్లించకపోవడంతో అధికారులు పునరాలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో మరో నెల పాటు ఎల్ఆర్ఎస్ ఫీజు రాయితీ గడువు పొడిగించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
గత నెల మార్చి 31 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం వెయ్యి కోట్ల రూపాయల మేర ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలు కాగా.. శుక్రవారం నాటికి 1,098 కోట్లు మాత్రమే వసూలు అయిందని తెలుస్తోంది. అంటే గడిచిన 25 రోజుల్లో కేవలం 98 కోట్ల రూపాయలు మాత్రమే వసూలైంది. ఎల్ఆర్ఎస్ ద్వార మొత్తం 7 వేల కోట్లు వసూలవుతుందని ప్రభుత్వం అంచనా వేయగా ఇప్పటి వరకు అంతా కలిపి 1,500 కోట్లు కూడా వసూలు కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ కోసం మొత్తం 25.4 లక్షల ధరఖాస్తులు వచ్చాయి. అందులో అప్లికేషన్ ప్రాసెస్ చేసి ఫీజు చెల్లించాలని సమాచారం ఇచ్చిన అప్లికేషన్లు 10 లక్షల 85 వేలు ఉండగా.. ఇందులో 2 లక్షల 25 వేల మంది ఫీజు చెల్లించినట్టు డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారులు చెబుతున్నారు. ఇంకా 8 లక్షల 59 వేల ధరఖాస్తు దారులు ఫీజు చెల్లించాల్సి ఉంది. మరో 5 రోజుల్లో గడువు ముగియనున్న నేపథ్యంలో మరో లక్ష మంది ఫీజు చెల్లించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణలో ఎల్ ఆర్ ఎస్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి సాంకేతిక సమస్యలు వస్తున్నాయని అన్ని జిల్లాల నుంచి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వీటి పరిష్కారంపై మున్సిపల్ కమిషనర్లకు అవగాహన లేకపోవడం, ఎల్ఆర్ఎస్ ధరఖాస్తు దారులు వచ్చి అడిగినా మాకేం తెలియదని సమాధానాలిస్తున్నారని వాపోతున్నారు. అప్లికేషన్ ప్రాసెస్ లో భాగంగా చెల్లించాల్సిన ఫీజు చూపించి, తరువాత నిషేధిత జాబితాలో మీ ప్లాట్ ఉందని చూపించడం, నిషేధిత జాబితా చూస్తే అందులో ప్లాట్ లేదని, ఫీజు చెల్లిద్దామంటే ఓపెన్ కావడం లేదని పలువురు దరఖాస్తుదారులు చెబుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వానికి ఆరు గ్యారంటీల అమలు, వివిధ అభివృద్ది-సంక్షేమ కార్యక్రమాల కోసం నిధుల కొరత ఉన్న నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ ద్వారా వచ్చే రెవెన్యూను వదులుకోదని అధికారవర్గాల్లో చర్చ జరగుతోంది. అందుకే ఎల్ఆర్ఎస్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలనీ, ఈ నెలాఖరుకల్లా సాధ్యమైనంత వరకు ధరఖాస్తులను క్లియర్ చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఉన్నతాధికారులు ఆదేశించారని తెలుస్తోంది.