రాష్ట్రంలో అక్రమ రీతిలో ప్లాట్లు, ఫ్లాట్ల అమ్మకాల్ని జరుపుతున్న బిల్డర్లను అరెస్టు చేసి జైలులో పెట్టేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతుందా? ఇలాంటి అక్రమ వ్యవహారాలు జరుపుతున్న బిల్డర్ల జాబితాను అందజేయమని ప్రభుత్వం నిర్మాణ సంఘాల్ని కోరిందా? ఇది వాస్తవమైతే, అతిత్వరలో యూడీఎస్ అమ్మకాలు జరుపుతున్న రియల్టర్లను ప్రభుత్వం జైలుకు పంపించడం ఖాయంగా కనిపిస్తోంది. గత కొంతకాలం నుంచి హైదరాబాద్లో సాధారణ అమ్మకాలు పెద్దగా జరగడం లేదు.
కేవలం యూడీఎస్ అమ్మకాలే విరివిగా జరుగుతున్నాయి. కాస్త ఆలస్యంగా మేల్కొన్న రాష్ట్ర ప్రభుత్వం, యూడీఎస్ వల్ల జరుగుతున్న నష్టాన్ని గ్రహించి కఠిన చర్యల్ని తీసుకోవడం మొదలెట్టింది. వీటిని నిరోధించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించడం గమనార్హం. దీంతో రంగంలోకి దిగిన తెలంగాణ రెరా అథారిటీ యూడీఎస్ అమ్మకాలపై నిఘా పెట్టింది. వీటిని విక్రయిస్తున్న వారి సమాచారం సేకరించే పనిలో పడింది. పూర్తి సమాచారం అందుకున్నాక, తగిన చర్యల్ని తీసుకుంటామని తెలంగాణ రెరా అథారిటీ అంటున్నది.