పాశ్చాత్య దేశాల్ని గమనిస్తే.. ఎక్కువ వుడెన్ హౌజెస్ కనువిందు చేస్తాయి. వాటి ఎలివేషన్స్, ఇంటీరియర్స్ భలే ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా, చలి ఎక్కువుండే ప్రదేశాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. కాకపోతే, గత కొంతకాలం నుంచి ప్రపంచవ్యాప్తంగా కలప గృహాల్ని కట్టడం మీదే చాలామంది దృష్టి సారిస్తున్నారు. పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీయకుండా తగు జాగ్రత్తల్ని తీసుకుంటున్నారు. పర్యావరణం మీద ఉన్న మక్కువతో ఇటీవల కాలంలో చాలామంది కలప గృహాల్ని నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలపై చాలామందికి అవగాహన పెరిగిందని అంటున్నారు.. మ్యాక్ ప్రాజెక్ట్స్ ఎండీ డాక్టర్ నవాబ్ మీర్ నాసీర్ అలీఖాన్ అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో కజకిస్ఠాన్ రాయబారిగా నియమితులైన ఆయన ”రియల్ ఎస్టేట్ గురు”తో ప్రత్యేకంగా ముచ్చటించారు.
పాశ్చాత్య దేశాల్లో ప్రాచుర్యం పొందిన కలప గృహాల విల్లా ప్రాజెక్టును.. భారతదేశంలోనే ప్రప్రథమంగా హైదరాబాద్‌లో ఆరంభిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు, అంతర్జాతీయ స్థాయిలో టీఐఈ సస్టెయినబిలిటీ సమ్మిట్ (టీఎస్ఎస్ 2021)ను సదస్సును 2021 అక్టోబరు 4 నుంచి 6 దాకా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని వెల్లడించారు. దేశవిదేశాలకు చెందిన ఇరవై వేల మంది వ్యాపారవేత్తలతో పాటు పెట్టుబడిదారులు ఇందులో పాల్గొంటారని చెప్పారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో కలప గృహాల పాత్ర.. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు.. ఈ గృహాల్ని నిర్మించడంలో మ్యాక్ ప్రాజెక్ట్స్ దీర్ఘకాలిక ప్రణాళికలు తదితర అంశాలపై ప్రత్యేకంగా వివరించారు. సారాంశం డాక్టర్ నవాబ్ నాసీర్ అలీఖాన్ మాటల్లోనే..
సిమెంట్ కాంక్రీటుతో కట్టడాల్ని చేపట్టడం బదులు కలపతో ఇళ్లను కట్టడం వైపు దృష్టి సారించాలి. ఇది సహజమైన పునరుత్పాదక కలిగింది. మరియు సమృద్ధిగా దొరుకుతుంది. ఇది ప్రపంచ వినాశనకారి అయిన కార్బన్‌ను నిల్వ చేసుకోవడంతో బాటు అధిక శక్తిని కలిగి ఉంటుంది. వాతావరణ మార్పులను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే మనం వాతావరణం నుండి కార్బన్ డయాక్సైడ్ ని తొలగించడంతో పాటు కార్బన్ ఉద్గారాలను తగ్గించాలి. మొత్తానికి, మన భారతదేశంలో మార్పును ప్రత్యక్షంగా చూడాల్సిన సమయం ఆసన్నమైంది. భారతదేశపు పర్యావరణంలో మార్పులు తెచ్చేందుకు కలప గృహాల నిర్మాణాన్ని ఒక ఉద్యమంగా చేపట్టాలి.
ప్రపంచవ్యాప్తంగా వాయు ఉద్గారాల్ని క్షుణ్నంగా పరిశీలిస్తే.. కాంక్రీటు నుంచి ఎంతలేదన్నా 11 శాతం వెలువడుతుంది. కొన్ని దేశాల్లో ఇది ఎంతలేదన్నా 23 శాతం దాకా నమోదైంది. కాంక్రీటు కట్టడాల్లో అధిక శాతం విద్యుత్తును వినియోగించాలి. వీటిని కట్టేటప్పుడు నీరును ఎక్కువగా వాడాలి. ఆయిల్ తర్వాత అత్యంత ఎక్కువగా వినియోగించే సహజసిద్ధ వనరు అయిన ఇసుకనూ.. నిర్మాణాల్లో విరివిగా వినియోగిస్తున్నాం. దీన్ని కొరత రాన్రానూ మనదేశంలో పెరుగుతోంది. సిమెంట్ మరియు ఉక్కు ఉత్పత్తి పర్యావరణానికి హానికరం. మొత్తానికి, కాంక్రీటు నిర్మాణాల వల్ల కలిగే దుష్ఫలితాల్ని అంచనా వేసిన పాశ్చాత్య దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాయి.
నాలుగు అంతస్తుల్లోపు ప్రభుత్వ భవనాలన్నీ కాంక్రీటు బదులు కలపతో కట్టాలని న్యూజిలాండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకా, అనేక ప్రభుత్వాలు కలప గృహాల్ని నిర్మించేందుకు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో భారతదేశంలోనూ సంప్రదాయ నిర్మాణాల నుంచి వెలువడే కాలుష్యానికి అడ్డుకట్ట వేయాలన్న ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. భారత్‌లో తొలిసారిగా హైదరాబాద్‌లో కలప గృహాల్ని నిర్మిస్తున్నాం. కెనడా కలప గృహాలు అని కూడా వీటిని పిలుస్తారు. మన కలప ఫర్నీచర్ గా చక్కగా పనికొస్తాయి. కానీ, కెనడా కలప దృఢంగా ఉంటుంది. అందుకే, వాటితో ఎంతటి ఎత్తులోనైనా భవనాల్ని కట్టొచ్చు.
చైనా, జపాన్, ఇండియా వంటి దేశాల్లో రెండు వందల ఏళ్ల కంటే పురాతనమైన కలప దేవాలయాలు ఉన్నాయి. అదే కాంక్రీటుతో కట్టినవి పెద్దగా కనిపించవని మర్చిపోవద్దు. అందుకే, భవిష్యత్తు తరాలకు మెరుగైన ప్రపంచాన్ని అందించాలంటే, ఇప్పటికైనా మన ఆలోచనలు మారాలి. కలప గృహాలు కట్టడం ఆరంభమైతే గిరాకీ అధికంగా ఉంటుంది. ప్రస్తుతం భారత నిర్మాణ రంగం విలువ ఎంతలేదన్నా 120 బిలియన్ డాలర్లు.. 2030 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఇందులో ఒక శాతం లెక్కించినా రానున్న రోజుల్లో సస్టెయినబుల్ గృహాలకు గిరాకీ ఎక్కువే ఉంటుందని చెప్పొచ్చు.
కాకపోతే, ముడిసరుకు దిగుమతి చేసుకోవడం ఒక్కటే సవాలుతో కూడుకున్న వ్యవహారం. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రాయితీలివ్వాలి. రానున్న రోజుల్లో ఈ సాంకేతిక పరిజ్ఞానం మనవాళ్లకు బదిలీ కావాలని, స్థానికులకు అధిక ఉద్యోగావకాశాలు రావాలని భావిస్తున్నాను. ఉత్తరాఖండ్, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి కలప గృహాల్ని నిర్మించాలనే అభ్యర్థనలు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లోనూ వీటికి అనూహ్య గిరాకీ ఉంటుందని అంచనా వేస్తున్నాం. పలు విదేశీ నగరాల్లోనూ ఈ తరహా గృహాల్ని కట్టాలనే ఆలోచనలున్నాయి.
This website uses cookies.