ఇంతకాలం ఐటీ రంగానికి మాత్రమే పరిమితమైన వర్క్ ఫ్రం హోమ్ విధానం.. కరోనా నేపథ్యంలో పలు రంగాలకు కూడా విస్తరించింది. ఏడాదిన్నరకు పైగా చాలామంది ఇంటి నుంచే పనిచేశారు. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టడంతో కార్యకలాపాలన్నీ యథావిధిగా సాగుతున్నాయి. ఐటీ కంపెనీలు సైతం తమ ఉద్యోగులను కార్యాలయానికి రావాలని ఇప్పటికే స్పష్టంచేశాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో ఆఫీసు నుంచే కార్యకలాపాలు నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే, ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మారుమూల ప్రాంతాల నుంచి టెక్కీలు పనిచేసుకునేందుకు వీలుగా వర్క్ ఫ్రం హోం టౌన్ షిప్పులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రతిపాదిత టౌన్ షిప్పులకు అవసరమైన స్థలం, వర్క్ స్టేషన్లు, హైస్పీడ్ ఇంటర్నెట్, ఇతర వసతులను కల్పించనుంది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా 25 టౌన్ షిప్పులు ఏర్పాటు చేయాలని.. అనంతరం పరిస్థితులను బట్టి వాటిని మరింత విస్తరించాలని భావిస్తోంది. ఈ మేరకు ఐటీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అధ్యక్షతన జరిగిన వర్క్ ఫ్రం హోం టౌన్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపాదిత టౌన్ షిప్పుల గురించి ఐటీ సలహాదారు శ్రీనాథ్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాగా, మూడు నెలల్లో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధికారులకు సూచించారు.
This website uses cookies.