జువారీ ఇన్ ఇండస్ట్రీస్ కు చెందిన జువారీ ఇన్ ఫ్రా వరల్డ్ గంగోత్రి డెవలపర్స్ తో కలిసి హైదరాబాద్ లో ఓ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాయి. కొల్లూరు మైక్రో మార్కెట్లో జువారీ గంగోత్రి త్రిభుజ పేరుతో ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టును లాంచ్ చేశాయి. మొత్తం 9.4 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు రాబోతోంది. నిర్మాణ పనులను గంగోత్రి డెవలపర్స్ చూసుకుంటుంది. జువారీ ఇన్ ఫ్రా వరల్ డెవలప్ మెంట్ మేనేజర్ గా వ్యవహరిస్తుంది. రూ.1500 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో తొమ్మిది హైరైజ్ రెసిడెన్షియల్ టవర్లు ఉంటాయి. మొత్తం 1730 అపార్ట్ మెంట్లు అందుబాటులోకి వస్తాయి. మొత్తం 53 లక్షల చదరపు అడుగుల డెవలప్ మెంట్ ఏరియాలో అమ్మకపు ప్రాంతం 38 లక్షల చదరపు అడుగులుగా ఉంటుంది.
సిమెంట్ పరిశ్రమతో హైదరాబాద్ ప్రాంతంలో తమ ప్రయాణం మొదలైందని.. ఇప్పుడు అదే హైదరాబాద్ ప్రాంతంలో రియల్ రంగంలోకి అడుగుపెట్టడం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని జువారీ గ్రూప్ ప్రమోటర్ అక్షయ్ పొద్దార్ పేర్కొన్నారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటని.. ఆ అభివృద్ధిలో తాము కూడా భాగస్వాములం కావాలనుకుంటున్నామని తెలిపారు. తమ సంస్థ జువారీ ఇన్ ఫ్రా వరల్డ్ రియల్ రంగంలో కీలకంగా వ్యవహరిస్తోందని.. దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా విస్తరిస్తోందని చెప్పారు. తమ అభివృద్ధి పయనంలో హైదరబాద్ అనేది ఓ మైలురాయిగా నిలుస్తుందని జువారీ ఇన్ ఫ్రా వరల్డ్ ఇండియా లిమిటెడ్ సీఈఓ, డైరెక్టర్ ఆలోక్ బెనర్జీ వ్యాఖ్యానించారు. కాగా, జువారీ ఇన్ ఫ్రా వరల్డ్ ఇండియా లిమిటెడ్ ఇప్పటివరకు దుబాయ్, మైసూర్, గోవా, బెంగళూరుల్లో 3 మిలియన్ చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో ఉన్న పలు రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసింది. దాదాపు 1500కి పైగా కుటుంబాలకు సొంతింటిని సమకూర్చింది.
This website uses cookies.