Notification issued for auction of 400 acres of land in Gachibowli
గ్రేటర్ పరిధిలోని గచ్చిబౌలిలో 400 ఎకరాల ప్రభుత్వ భూముల వేలానికి తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కొన్నేండ్లుగా వివాదంలో ఉన్న ఐఎంజీ భూములను వేలానికి పెడుతూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఆర్థిక వనరుల్ని సమీకరించుకునేందుకు ఈ భూములను వేలం వేస్తున్న టీజీఐఐసీ విడుదల చేసిన బిడ్ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఈ లెక్కన రూ. 20 వేల కోట్లు సమీకరించుకునేందుకు ప్రభుత్వం గచ్చిబౌలి భూములను విక్రయానికి పెట్టింది. హైదరాబాద్ నగరంలో అతి పెద్ద ఐటీ హబ్, రెసిడెన్షియల్ హబ్ అయిన గచ్చిబౌలిలో ఈ భూములు ఉండటం విశేషం. హైటెక్ సిటీకి ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ 400 ఎకరాలు ఉన్నాయి. టీజీఐఐసీ నోటిఫికేషన్‌లో ఈ భూముల వివరాలను వెల్లడించింది. పంజాగుట్ట క్రాస్ రోడ్స్కు 15 నుంచి 18 కిలోమీటర్ల దూరంలో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు 22 కిలోమీటర్ల దూరంలో, శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు 33 కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ ఉందని బిడ్ డాక్యుమెంట్లో స్పష్టం చేశారు. ఈ నెల 7న ప్రీబిడ్ సమావేశం నిర్వహిస్తున్నట్లు, ఈ నెల 15, మధ్యాహ్నం 3 గంటల వరకు బిడ్ల దాఖలుకు ఆఖరి అవకాశంగా టీజీఐఐసీ ప్రకటించింది. అయితే, రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రతికూలంగా ఉన్న నేపథ్యంలో.. దీనికి ఆదరణ ఎంతవరకు లభిస్తుందనేది ప్రశ్నార్థకమేనని రియల్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
This website uses cookies.