దేశ రాజధాని ఢిల్లీలో ఇళ్ల ధరలు పెరిగాయి. ఉక్రెయిన్ యుద్ధం పరిణామాల నేపథ్యంలో సరఫరా వ్యవస్థలో అంతరాయం కలగడంతో నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరగడంతో ఇళ్ల ధరలను 10 శాతం మేర పెంచుతూ ఢిల్లీ బిల్డర్లు నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. గత నెలాఖరుకు సిమెంట్, స్టీల్ ధరలు 20 శాతానికి పైగానే పెరిగాయి. ఇప్పటివరకు ఆ భారాన్ని డెవలపర్లే భరించారు.
అయితే, ముడి సరుకుల ధరలు క్రమంగా పెరుగుతుండటంతో లాభాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో ఆ మేరకు ధరలు పెంచడం మినహా తమకు మరో మార్గం లేదని బిల్డర్లు పేర్కొంటున్నారు. ‘ఇప్పటివరకు చదరపు అడుగు రూ.3,400కి విక్రయించగా.. దానిని సగటున రూ.3,800కి పెంచాం. మొత్తమ్మీద 8 శాతం నుంచి 10 శాతం మేర ధరల్లో పెరుగుదల ఉంటుంది. ఒకవేళ నిర్మాణ సామగ్రి ధరలు మరింత పెరిగితే మరోసారి ధరలు పెంచక తప్పదు’ అని ఏసియానా హౌసింగ్ లిమిటెడ్ జేఎండీ అంకుర్ గుప్తా తెలిపారు.
ఇంధన ధరలు పెరగడంతోపాటు సాధారణ ద్రవ్యోల్బణం కూడా ధరల పెంపునకు కారణమని వివరించారు. ‘ప్రస్తుతం పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాం. వచ్చే ఆరునెలల్లో కూడా నిర్మాణ సామగ్రి ధరల్లో ఇదే తరహా పెరుగుదల ఉంటే మరోసారి ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’ అని రహేజా డెవలపర్స్ కి చెందిన నాయన్ రహేజా పేర్కొన్నారు.
This website uses cookies.