ట్రిపుల్ వన్ జీవో ప్రాంతాల్ని కలిపి హైదరాబాద్ నగరానికి సరికొత్త మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తాం.. అంతర్జాతీయ కన్సల్టెంట్ల సహకారం తీసుకుని వచ్చే పద్దెనిమిది నెలల్లో పూర్తి చేస్తాం.. పర్యావరణహితంగా హైదరాబాద్ భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ బృహత్ ప్రణాళికను తీర్చిదిద్దుతామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. శుక్రవారం ఉదయం ఆయన మాదాపూర్ హైటెక్స్‌లో క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2023 మార్చి 31లోపు రాష్ట్రంలోని 141 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మాస్టర్ ప్లాన్లను సిద్ధం చేస్తామన్నారు.
ధరణిలో రెండు, మూడు మాడ్యుళ్లలో ఉన్న ఇబ్బందుల్ని పరిష్కరించేందుకు చీఫ్ సెక్రటరీకి గుర్తు చేస్తానని తెలిపారు. రాష్ట్రంలో ఎవరికైనా ప్లాటు ఉండీ.. ఇల్లు కట్టుకుంటానంటే రూ.3 లక్షలు మంజూరు చేస్తున్నామని.. ఇలా మూడు లక్షల యూనిట్ల నిర్మాణానికి రాష్ట్రవ్యాప్తంగా మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్రావు, క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు రామకృష్ణారావు, జనరల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షులు జి ఆనంద్ రెడ్డి, రాజేశ్వర్, జైదీప్ రెడ్డి, జగన్నాధ్ రావు, ట్రెజరర్ ఆదిత్య గౌర, జాయింట్ సెక్రటరీలు శివరాజ్ ఠాకూర్, కె రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
రానున్న పది, పదిహేనేళ్ల దాకా నిర్మాణ రంగానికి ఢోకా లేదని.. హైదరాబాద్ అభివృద్ధికి ఎలాంటి అడ్డు ఉండదని మంత్రి కేటీఆర్ తెలిపారు. మతకల్లోలాలు, పనికిమాలిన పంచాయతీలు, మతం పేరిట కుమ్ములాటలు, కర్ఫ్యూలు వంటివి లేకపోతే హైదరాబాద్ పెరుగుతుందన్నారు. మనం కూడా హలాల్, హిజాబ్ వంటివి పెట్టుకుంటే నష్టపోతామన్నారు. శాంతి సామరస్యాలు ఉంటేనే నగరం అభివృద్ధి చెందుతుందన్నారు. పాజిటివ్, ప్రొగ్రెసివ్ అవుట్‌లుక్.. ఉంటేనే హైదరాబాద్ డెవలప్ అవుతుందన్నారు. ప్రతిపక్ష పార్టీలకు కేసీఆర్‌ని తరిమివేయండి అన్న మాట ఒక్కటే తెలుసని.. వాళ్లు రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పరని.. జాతీయ ప్రాజెక్టు ఏమైనా తెస్తారా అంటే చెప్పరని విమర్శించారు. వచ్చే ఇరవై ఏళ్లకు వారి విజన్ ఏమిటని అడిగితే.. చెప్పగలిగే వారు ఒక్కరూ లేరన్నారు. గత ఎనిమిదేళ్ల నుంచి తెలంగాణ అభివృద్ధి చెందడానికి కేసీఆర్ నాయకత్వమే ప్రధాన కారణమని విశ్లేషించారు.
ఎంతసేపు కోకాపేట్, కొల్లూరే కాకుండా బిల్డర్లు కొత్త అవకాశాల్ని అన్వేషించాలని విజ్ఞప్తి చేశారు. ఫార్మా సిటీ చివరి దశకు వచ్చేసింది. అతిత్వరలో లాంచ్ చేయనున్నాం. ముచ్చర్ల, కల్వకుర్తి, అమన్‌గల్, వెల్దండ, కర్తాల్, కందుకూరు వంటి చోట్ల ఎందుకు కొత్త కాలనీలు కడతలేరని ప్రశ్నించారు. దుండిగల్లో కొత్త ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ పెడుతున్నాం. దాని పక్కనే సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజెస్ పార్కు ఫుల్ అయ్యింది. పక్కనే ఖాజీపల్లిలో ఐదారు వందల ఎకరాల్ని తీసుకుంటున్నాం. అక్కడెందుకు హౌసింగ్ కట్టరని అడిగారు. బిల్డర్లు గ్రోత్ సెంటర్ల వద్ద దృష్టి పెట్టాలని కోరారు. కొత్తగా లాజిస్టిక్ పార్కులను ఎంకరేజ్ చేస్తున్నాం. భూమి కోటీ, కోటిన్నర ఉన్న చోట్ల ఏర్పాటు చేస్తున్నాం. అక్కడా దృష్టి పెట్టండి. రీజినల్ రింగ్ రోడ్డు త్వరలోనే ప్రారంభమవుతుంది. స్థల సేకరణ ఆరంభమైంది. 330 కిలోమీటర్ల మేరకు ఉంటుందని వెల్లడించారు.
మన వద్ద జీనోమ్ వ్యాలీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతోందని.. ప్రపంచంలోని 33 శాతం హ్యూమన్ వాక్సీన్లు హైదరాబాద్‌లోనే ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. మన హైదరాబాద్ వ్యాక్సీన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయ్యిందని సంతోషం వ్యక్తం చేశారు. దట్స్ ద మ్యాటర్ ఆఫ్ ద గ్రేట్ ప్రైడ్.. రానున్న దశాబ్దం, దశాబ్దంన్నరలో.. హెల్త్ కేర్ సెంటర్ స్టేజ్ కానున్నది. లైఫ్ సైన్సెస్, ఫార్మా స్యూటికల్స్, బయో ఫార్మా, బయోటెక్నాలజీ, బయో స్టాటిస్టిక్స్, బయో ఇన్‌ఫార్మెటిక్స్ వంటివి రాష్ట్రంలో అభివృద్ధి చెందుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో ఏ కన్‌స్ట్రక్షన్ సైటుకెళ్లినా 60, 70 శాతం మంది జార్ఖండ్, బీహార్, ఒరిస్సా, రాజస్థాన్ వాళ్లేనని తెలిపారు. కార్పెంటరీ, ఇంటీరియర్స్ ఇలా ఏ పని అయినా ఇతర రాష్ట్రాల వాళ్లే ఉంటారు. మరి, మన వాళ్లు ఏం చేస్తున్నరు? దుబాయ్, కువైట్, ఖతార్ పోతున్నరు. అక్కడ ఎర్రటి ఎండల్లో నానా అవస్థలు పడుతూ.. తిప్పితిప్పి కొడితే నెలకు ఇరవై ఐదు వేలు సంపాదిస్తున్నారు. లేబర్ క్యాంపుల్లో ఉండి పని చేస్తున్నారు. ఇక్కడ అంతకంటే ఎక్కువ సంపాదించుకునే అవకాశముంది కదా.. మన కామారెడ్డి, నిర్మల్, కరీంనగరోళ్లు దుబాయ్, గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు. ఎక్కడో మిస్ మ్యాచ్ ఉంది. ఇదే సెంట్రింగ్ పని, నిర్మాణాల్లో పనిని అక్కడా చేస్తున్నారని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడానికి నిర్మాణ సంఘాలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. “మీరు ముందుకొస్తే.. కలిసి కొత్తగా శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. మన రాష్ట్రంలో.. మన పిల్లలకిఇక్కడే కాన్ఫిడెన్స్ ఇచ్చేలా చేద్దాం. మన రాష్ట్రంలో, మనమే శిక్షణనిచ్చి, ఇక్కడే కంపెనీలో పెట్టుకునేలా చేస్తే వారిలో విశ్వాసం ఏర్పడుతుంది. ఇక్కడ ఎన్ఏసీ పెట్టాం. రోడ్డు వేసే కంట్రాక్టర్లకే సంబంధం ఉండే వ్యవస్థగా మారింది. మీరు ఇంత లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ.. ఇన్ని కోట్ల టర్నోవర్ కడుతూ.. ఇన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పన్నుల రూపంలో కడుతున్నారు. బయటి రాష్ట్రాల లేబర్ వెళ్లిపోతే ఇబ్బంది అంటున్నారు. ఆ దుస్థితి మనకెందుకు? మనవాళ్లనే పట్టుకుని శిక్షణనిద్దాం. బ్లూ కాలర్ జాబ్స్ ఇద్దాం. ఒకవేళ చిరు ప్రయత్నం సఫలమైతే మీకు నచ్చితే విస్తరిద్దాం. మొదట క్రెడాయ్ హైదరాబాద్‌తో మొదలెడదాం. తర్వాత క్రెడాయ్ తెలంగాణకు విస్తరిద్దాం. మీకో ఇన్‌స్టిట్యూట్ కావాలి. కొంత సపోర్టు కావాలి. తప్పకుండా మేం చేస్తాం. సెటప్ లో మీరు ముందుకొచ్చి మాకు హెల్ప్ చేయండ”ని కోరారు.
ట్రిపుల్ వన్ జీవో ఎత్తి వేసే ప్రక్రియ వైఎస్సార్ హయంలో ఆరంభమైందని.. అప్పుడే ఒక కమిటీ వేశారని గుర్తు చేశారు. కేసీఆర్ 2014 కంటే ముందే.. చేవేళ్ల, రాజేంద్రనగర్, వికారాబాద్ పబ్లిక్ మీటింగుల్లో 111 జీవో ఎత్తివేస్తామని ప్రకటించారు. ఎనిమిదేళ్ల తర్వాత జీవోను రద్దు చేశారని తెలిపారు. అప్పట్లో ఈ జంట జలాశయాల నుంచి జంట నగరాలకు 27 శాతం తాగునీరు వచ్చేవని.. ఈ రోజు గోదావరి, కృష్ణా నుంచి నీళ్లు వస్తున్నా కాబట్టి.. జంట జలాశయాల్నుంచి నీరు తీసుకోనక్కర్లేదన్నారు. అలాంటప్పుడు, ఆ 84 గ్రామాల ప్రజలకు ఎందుకు నష్టం చేయాలని అనుకున్నామని చెప్పారు. కాకపోతే, ఆయా ప్రాంతాల్ని కాలుష్యం బారిన పడకుండా.. హుస్సేన్ సాగర్ మాదిరిగా కాకుండా.. సవ్యమైన ఎస్టీపీలు ఏర్పాటు చేస్తామంటే తప్పేం ఉందన్నారు.
కాంగ్రెస్, బీజేపీ వాళ్లు అక్కడివాళ్లకు మాటిచ్చారని.. ప్రతి పార్టీ చెప్పిందని.. కానీ, కేసీఆర్ చేస్తే భూములున్నాయంటూ దురుద్దేశ్యాలు ఆపాదిస్తున్నారని తెలిపారు. ట్రిపుల్ జీవో ప్రాంతాల్లో గల 1.32 లక్షల ఎకరాలు.. 535 చదరపు కిలోమీటర్లలో కొత్త నగరం సృష్టించొచ్చని.. హారిజాంటల్ గ్రోత్ ప్లాన్ చేయవచ్చని అన్నారు. హైదరాబాద్ నగర భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా.. పర్యవారణ హితంగానే అభివృద్ధి చేస్తామని.. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు, అపోహలు ఉండొద్దని స్పష్టం చేశారు. కేసీఆర్ ముందుచూపు వల్ల ఇదివరకే 600 మిలియన్ గ్యాలన్స్ మంచినీటి లభిస్తోంది. దీంతో పాటు మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ దగ్గరకు రావడం వల్ల అదనంగా 300 మిలియన్ గ్యాలన్స్ నీరు లభించే అవకాశం ఉంది. భవిష్యత్తులో ప్రతిరోజు హైదరాబాద్‌కి మంచినీటిని అందించే అవకాశముంది. ఎక్కువ గంటలు నీళ్లిచ్చే అవకాశముంది.
This website uses cookies.